గురువారం 02 ఏప్రిల్ 2020
Health - Mar 12, 2020 , 20:32:39

నడకతో మానసిక ప్రశాంతత

నడకతో మానసిక ప్రశాంతత

*   మూడ్‌ బాగాలేదా.. అయితే కాస్త అలా తాజా గాలిలో నడవండి. చుట్టూ ఉండే ప్రకృతి చిత్రాలు మనసుకు, శారీరకంగా కదిలే కండరాలు శరీరానికి వ్యాయామాన్ని ఇస్తాయి. మొత్తంగా నడక అటు మనసునూ, ఇటు శరీరాన్నీ ఆరోగ్యంగా ఉంచే మంచి ఔషధం అవుతుంది. 

*   సకల రోగాలకు మూలం ఒత్తిడిలోనే ఉందని నిపుణులు ఒక పక్క నొక్కి చెబుతున్నారు. కాని ప్రతి ఒక్కరినీ పట్టి పీడిస్తున్న ఈ భూతం ఒకవైపు శారీరక వ్యాధులను, మరో వైపు మానసిక అనారోగ్యాలను తెచ్చిపెడుతున్నది. అందుకే ఒత్తిడిలో ఉన్నప్పుడు దానికి కారణాలను విశ్లేషించి, ఒక్కొక్కటిగా ఆయా పనులు చేసుకుంటూ పోతే దాని నుంచి బయటపడేందుకు వీలు చిక్కుతుంది. 

*   డిప్రెషన్‌ మూలం మన ఆహారంలో కూడా ఉందంటే అతిశయోక్తి కాదు. మన రోజువారీ డైట్‌లో ఉండే కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా ఇందుకు దోహదపడొచ్చు. తక్కువ పోషకాలు లేదా ఎక్కువ కెఫీన్‌, చక్కెరలు ఉండే పదార్థాలు మన భావోద్వేగాలపై ప్రభావం చూపి, డిప్రెషన్‌కు కారణమవుతాయని ఇటీవలి అధ్యయనంలో తేలింది. 

*   బి విటమిన్‌ తగినంత లేకపోతే త్వరగా డిప్రెషన్‌కు గురవుతారట. బి కాంప్లెక్స్‌ విటమిన్లు డిప్రెషన్‌లో కీలకపాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. బి విటమిన్‌ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల మానసిక సందిగ్ధత తగ్గి, స్పష్టమైన నిర్ణయాలు తీసుకోగలగడం, ప్రీమెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ లాంటి సమస్యలు, మానసిక ఆందోళన తగ్గుతాయంటున్నారు నిపుణులు. 

*   అలసటగా ఉన్నప్పుడు చిన్న విషయానికే చికాకు ఎక్కువ అవుతుంటుంది. ఇక తగినంత నిద్ర లేకపోతే మరింత విసుగ్గా, అసహనంగా ఉంటుంది. వ్యతిరేక భావనలు పెరుగుతాయి. చిన్న విషయమే ఆందోళన కలిగిస్తుంది. అందుకే శారీరక ఆరోగ్యానికే కాదు.. మానసిక ఆరోగ్యానికి కూడా తగినంత నిద్ర అవసరం. ఇలాంటి సమస్యలుంటే తప్పనిసరిగా ప్రతిరోజూ రాత్రి 8 గంటల పాటు విశ్రాంతి తీసుకోవాలి. 

*   ఖాళీగా కూర్చుంటే డెవిల్స్‌ మైండ్‌ అవుతుందని ఊరకే అనలేదు. అందుకే ఎప్పుడూ బిజీగా ఉండేలా చూసుకోండి. మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చేవి, మీకిష్టమైన పనులు చేయడం వల్ల మనసులో సానుకూల భావనలు ప్రేరేపితం అవుతాయి. ఇది నెమ్మదిగా డిప్రెషన్‌ను దూరం చేస్తుంది. 

*   పరిసరాలు, వాతావరణ మార్పిడి కూడా ఆందోళన, డిప్రెషన్‌ల నుంచి దూరం చేస్తుంది. అందుకే చిన్న పిక్నిక్‌కో, ట్రిప్‌కో ప్లాన్‌ చేయండి. 

*   మీమీద మీకు నమ్మకం కలగడానికి, సానుకూల ఆలోచనలు పెరగడానికి, డిప్రెషన్‌ నుంచి బయట పడడానికి మెరుగైన మార్గం సహాయం చేయడం. అవసరంలో ఉన్న మీ స్నేహితులకో, ఇతరులకో మీరు చేయగల సాయం చేయండి. logo
>>>>>>