గురువారం 01 అక్టోబర్ 2020
Health - Apr 24, 2020 , 15:21:56

కరోనా అంతంపై బిల్ గేట్స్ ప్లాన్ ఏమిటంటే..

కరోనా అంతంపై బిల్ గేట్స్ ప్లాన్ ఏమిటంటే..

హైదరాబాద్: కరోనా వైరస్‌ను ఆపాలంటే ఏం చేయాలి? ఈ విషయమై సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ధార్మక కార్యక్రమాల దిగ్గజం బిల్ గేట్స్ ఓ ప్రణాళిక సూచిస్తున్నారు. గేట్స్ నోట్స్ పేరిట నడిపే బ్లాగ్‌లో ఆ ప్రణాళికను ఆవిష్కరించారు. కరోనా వైరస్ వ్యాప్తిని గేట్స్ రెండోప్రపంచ యుద్ధంతో పోల్చడం గమనార్హం. సృజనాత్మకతను వైరస్‌పై ఓ ఆయుధంలా ప్రయోగించాలని ఆయన అంటున్నారు. రెండో ప్రపంచయుద్ధం కాలంలో రాడార్‌ను కనిపెట్టడంతో సహా బోలెడు సృజనాత్మకత, విశ్వసనీయమైన టార్పీడోలు, కోడ్ బ్రేకింగ్ వంటివి యుద్ధాన్ని సత్వరం ముగించడంలో తోడ్పడ్డాయి. ప్రస్తుత విశ్వ మహమ్మారి విషయంలోనూ ఇదే జరగాలి. సృజనాత్మకతను నేను ఐదు రకాలుగా విభజిస్తాను. అవి.. చికిత్సలు, టీకాలు, పరీక్షలు, వైరస్‌కు గురైనవారిని వెతికిపట్టుకోవడం, నిబంధనల ఉపసంహరణకు విధానాలు. ఈ అన్నిటిలో ఎంతోకొంత సృజనాత్మకత సాధించకుండా సాధారణ జీవితానికి మళ్లలేం లేక వైరస్‌ను నియంత్రించలేమని గేట్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఆయన ఆలోచన ప్రకారం ఆ ఐదు అంశాల్లో ఏముందంటే.. చికిత్సలు ప్రస్తుతం ప్రయత్నిస్తున్న చికిత్సల్లో అనేకం విఫలమవుతున్నాయి. కానీ అందులోంచి కొన్ని మన భారం తగ్గిస్తాయని ఆశావాదంతో ఉన్నరాయన. '2021 వసంతంలో స్పోర్ట్స్ లేదా మ్యూజిక్ ఈవెంట్‌కు హాజరయ్యేవారు తాము దైర్యంగా బయటకి వచ్చేందుకు ధైర్యాన్నిచ్చిన అద్భుతమైన చికిత్సకు చేతులెత్తి మొక్కుతారు' అని ఆయన రాశారు. టీకాలు ప్రపంచాన్ని మళ్లీ పాతరోజులకు మళ్లించాలంటే ఇంద్రజాలం లాంటి చికిత్స ఏదైనా రావాలి. అంతకన్నా టీకా కనిపెట్టడం ముఖ్యం. సాదారణంగా టీకా తయారీకి ఐదేళ్లు పడుతుంది. కానీ కరోనా విషయంలో 18 మాసాలు పట్టవచ్చు. తొమ్మిది నెలల నుంచి రెండేళ్ల లోపు ఎప్పుడైనా అది రావచ్చునని గేట్స్ రాశారు.

పరీక్షలు

సరైనవారికి పరీక్షలు నిర్వహించడం మీద దృష్టి నిలపాలంటారు గేట్స్. లక్షణాలున్నవారిని ముందుగా పరీక్షించి చూడాలనేది ఆయన అభిప్రాయం. వారు అయిపోయిన తర్వాతే లక్షణాలు లేనివారి వెంటపడాలని పేర్కొన్నారు. పరీక్ష ఫలితాలు 24 గంటల్లోపు రావాలి. అప్పుడే మిమ్మల్ని మీరు, మీతోపాటు కలిసి ఉండేవారు అంతా తమను తాము వేరుపరచుకోవడం, వైద్య పరిశీలనలోకి వెళ్లడం గురించి ఆలోచించగలరని గేట్స్ తెలిపారు.

వైరస్‌కు గురైనవారిని వెతికిపట్టుకోవడం

వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో దాని ప్రభావానికి గురైనవారిని వెతికిపట్టుకోవడం చాలా కీలకమని గేట్స్ అంటారు. పాజిటివ్ వచ్చినవారిని ఎవరెవరు కలుసుకున్నారు అనేది తెలుసుకుని పరీక్షలు నిర్వహించడం ముఖ్యం. ఈ విషయంలో జర్మనీని ఆయన అభినందించారు.

నిబంధనల ఉపసంహరణకు మార్గాలు

వ్యాపారాలు పునఃప్రారంభించడం, బహిరంగ ప్రదేశాల్లోకి జనాన్ని అనుమతించడానకి సంబంధిచినంతవరకు అభివృద్ధి చెందిన దేశాలు వచ్చే రెండు నెలల్లో విశ్వమహమ్మారి రెండోదశలోకి వెళతాయి. ఈ దశను గేట్స్ 'అర్ధసాధారణ స్థితి'గా అభివర్ణించారు. ఏది ఎంతవరకు అనుమతించాలి అనేది ఏ స్థాయిలో ఇన్‌ఫెక్షన్ వ్యాపిస్తుంది అనేదానిని బట్టి ఆలోచించాల్సి ఉంటుంది. పరీక్షల వ్యవస్థ ప్రబలంగా ఉన్న దేశాల నుంచి మిగతా దేశాలు ఎక్కడ సమస్య మొదలవుతుంది అనేది తెలుసుకోవచ్చునని బిల్ గేట్స్ పేర్కొన్నారు.


logo