తాజా పండ్ల రసాలే ‘సిప్పీ మాంక్స్’ ప్రత్యేకత


Fri,May 4, 2018 08:12 AM

మండే ఎండల్లో చల్లని పానీయం తాగాలని మనసు తహతహలాడుతున్నది. దప్పిక తీర్చడమే కాదు కాస్త శక్తినిచ్చే పానీయమే అందరూ కోరుకుంటారు. కానీ కొనుక్కునేది మాత్రం రసాయనాల రంగు నీళ్లను. శక్తి కన్నా శక్తినిచ్చినట్లు అనుభూతిని కల్పించే రసాయనాలను, అంతకన్నా ఆరోగ్యానికి హాని చేసే విషపు రసాయనాలను. ఇవన్నీ లేకుండా ఆ సీసాలపై కనిపించే పండ్ల రసాలే మనకు అందుబాటులో ఉంటే ఎంత బాగుండు అనుకుంటాం. ఆ కలకు తగ్గ ఫలాన్ని అందించే ఫలితం ఈ సిప్పీ మాంక్స్! టెకీలకు చల్లని, తాజా పండ్ల రసాలను అందిస్తున్న ఈ స్టార్టప్ ఆరోగ్యవంతమైన భవిష్యత్‌కు భరోసా.

సమ్మర్‌లో ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. ఎండలో శరీరం కోల్పోయే లవణాలను తిరిగి పొందేందుకు, శక్తిని కూడగట్టుకునేందుకు తగిన పానీయాలు కావాలి. ఇప్పుడు మార్కెట్‌లో అలాంటి వాటికి డిమాండ్ ఉన్నదా? లేదు. కారణం తమకు ఏది కావాలో తెలియని అమాయకత్వంలో ఉన్నారు వినియోగదారులు. తెలిసినవాళ్లు కావాలని కోరుకున్నా మార్కెట్‌కు కావాల్సింది ఇచ్చేలా లేదు. ఇష్టమైన ఫ్రూట్స్‌ని సీసాలపై చూపిస్తూ సీసాలో మాత్రం రంగుల రసాయనాలతో తయారు చేసిన నీళ్లనే అమ్ముతున్నారు. అధిక మోతాదులో ఉండే పంచదార పాళ్లు, ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ హాని అని తెలిసినా జనం ఎగబడి కొంటూనే ఉన్నారు. ఇలా మార్కెట్‌లో జనం ఏది కొంటారో ఎంచుకోకుండా, ప్రజలకు ఏం కావాలో ఎంచుకున్నది దీపిక. చిన్న వయసులోనే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన ఆమె స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన జీవితానికి అవసరమైన పోషకాలను అందించే పండ్ల రసాలను అందించే కొత్త వ్యాపారం ప్రారంభించింది. సిప్పీ మాంక్స్ పేరుతో గచ్చిబౌలిలో కొన్ని నెలల క్రితం ప్రారంభమైన ఈ ఆలోచన కొద్ది రోజుల్లోనే వేలాది మంది ఆదరణ పొందింది. కొబ్బరి నీళ్లు, వాటిలో సహజమైన రుచి, ఆరోగ్యాన్నిచ్చే పోషకాలున్న పండ్ల రసాలను జోడించి చిన్న సీసాలో చల్లని పానీయం అందించే సిప్పీ మాంక్స్‌కు విద్యాధికులైన టెకీలు త్వరగానే ఆదరించారు.

టేస్టీ డ్రింక్స్


కొబ్బరి నీళ్లతో అనేక రకాల ఫ్రూట్ జ్యూస్‌లను తయారు చేస్తున్నది. ఇవన్నీ పల్ప్ నుంచి కాకుండా నేరుగా పండ్ల నుంచే తయారు చేసినవి. నిల్వ రసాయనాలు ఉపయోగించే అవసరం లేదు. అవసరమైన వాళ్లు ఆర్డర్ చేస్తేనే జ్యూస్‌ని తయారు చేస్తారు. కొబ్బరి నీళ్లతో సిప్పీ మాంక్స్ 80కిపైగా రుచుల్ని అందిస్తుంది. కొబ్బరి నీళ్లతో నిమ్మ, జామ, మామిడి, వాటర్ మిలాన్, ద్రాక్ష, పుదీనా, ఫలుదా(సబ్జా) మొదలైన పానియాలను అందిస్తున్నది. శరీరానికి తగినంత శక్తినిచ్చే గ్లూకోజ్, వేసవిలో శరీరం కోల్పోయే లవణాలు అధికంగా ఉండే ఈ కొబ్బరి నీళ్లతోపాటు ఆరోగ్యాన్నిచ్చే పండ్ల రసాలు ఉండటంతో టెకీలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. చిన్న మొత్తాల పెట్టుబడితో ప్రారంభమైన సిప్పీ మాంక్స్ పెద్ద ఎత్తున ప్రచారం లేకున్నా టెకీల ప్రచారంతో గచ్చిబౌలిలో ప్రాచుర్యంలోకి వచ్చింది. తక్కువ కాలంలోనే ఈ సంస్థ ఎక్కువ మందికి చేరువైందని, ఇప్పుడు రోజుకు ఏడు వేల మంది వరకు వస్తున్నారని దీపికా అంటున్నది. ఈ విజయంతో నగరంలో మరికొన్ని చోట్ల ఈ టేస్టీ డ్రింక్స్‌ను అందించే ప్రయత్నంలో ఉన్నానంటున్నది.

1821

More News

VIRAL NEWS