ప్రస్తుత తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది కిడ్నీ స్టోన్ల సమస్యతో బాధపడుతున్నారు. చాలా మందికి ఇప్పుడు యుక్త వయస్సులో కూడా కిడ్నీ స్టోన్లు వస్తున్నాయి. అయితే ఎవరికైనా కిడ్నీ స్టోన్లు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. కానీ కింద సూచించిన పలు సూచనలు పాటిస్తే కిడ్నీ స్టోన్లు రాకుండా చూసుకోవచ్చు. అలాగే ఇప్పటికే స్టోన్లు వచ్చిన వారు ఈ సూచనలు పాటిస్తే.. ఆ స్టోన్లు పడిపోయేందుకు అవకాశం ఉంటుంది. మరి ఆ సూచనలు ఏమిటంటే... 1. నిత్యం 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలి. దీని వల్ల కిడ్నీల్లో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. కిడ్నీ స్టోన్లు వచ్చేందుకు అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. 2. నిత్యం తీసుకునే ఆహారంలో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే సోడియం ఎక్కువగా ఉండే మటన్, ప్రాసెస్డ్ ఆహారాలు, నూడుల్స్, సాల్ట్ స్నాక్స్ తినరాదు. వాటి వల్ల కిడ్నీ స్టోన్లు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. 3. కాల్షియం ఉన్న ఆహారాలను బాగా తీసుకుంటే కిడ్నీ స్టోన్లు వస్తాయని చాలా మంది భావిస్తారు. కానీ అది ఎంత మాత్రం నిజం కాదు. నిజానికి కాల్షియం ఉన్న ఆహారాలను బాగా తినాలి. దీని వల్ల కిడ్నీ స్టోన్లు రాకుండా చూసుకోవచ్చు. 4. పాలకూర, స్ట్రాబెర్రీలు, నట్స్, టీ తదితరాల్లో ఆగ్జాలిక్ యాసిడ్లు లేదా ఆగ్జలేట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ ఆహారాలను మానేయాలి. లేదంటే ఆగ్జలేట్ స్టోన్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. 5. విటమిన్ సి ఆహార పదార్థాలను నిత్యం మోతాదుకు మించి తీసుకోరాదు. తీసుకుంటే ఆగ్జలేట్ స్టోన్స్ ఏర్పడతాయి. 6. చక్కెర, చక్కెరతో తయారు చేయబడే పదార్థాలు, కోడిగుడ్లు, చేపలు తదితర ఆహార పదార్థాలతో స్టోన్లు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఈ పదార్థాలను మానేయాలి లేదా మితంగా తీసుకోవాలి. దీంతో కిడ్నీ స్టోన్లు ఏర్పడకుండా చూసుకోవచ్చు.