శనివారం 27 ఫిబ్రవరి 2021
Health - Jan 19, 2021 , 13:42:04

అమ్మో! సూది మందా? నాకు భయ్యం..

అమ్మో! సూది మందా? నాకు భయ్యం..

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారిని తరిమేసేందుకు వ్యాక్సినేషన్‌ విజయవంతంగా ప్రారంభమైంది. అయితే, ఈ సమయంలో టీకా వేయించుకోవడానికి చాలా మంది భయపడుతున్నారు. వ్యాక్సిన్‌పై అనుమానాలతో కాదు. సూది మందు అంటే భయంతో. దీనినే వైద్యపరిభాషలో ట్రిపనోఫోబియా అంటారు. ఈ ఫోబియాతో బాధపడుతున్నవారు సూది మందు ఇస్తామంటే చాలు అంతెత్తు ఎగురుతారు. జ్వరం తక్కువ కాకున్నా పర్వాలేదు కానీ, సూది మాత్రం వేయించుకోను.. అంటూ చాలా మంది డాక్టర్లకు చెప్పి జారుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కరోనా వైరస్‌ టీకాలు వేస్తున్న ఈ సమయంలో ట్రిపనోఫోబియా మరోసారి చర్చలోకి వచ్చింది.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం, అమెరికాలో 7 శాతం మంది పెద్దలు ట్రిపనోఫోబియా కారణంగా టీకాలు వేయించుకోవడం లేదంట. భారతదేశంలో కూడా చాలా మంది టీకాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, ఎంత శాతం అనే గణాంకాలు మాత్రం ప్రభుత్వం వద్ద లేవు. అసలింతకీ ట్రిపనోఫోబియా లక్షణాలు ఉంటే దాన్ని ఎలా బయటపడాలి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే తీవ్ర వ్యాధులతో బాధపడే సమయంలో మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందని వైద్యులు చెప్తున్నారు.

ట్రిపనోఫోబియా అంటే..?

ట్రిపనోఫోబియా అనేది ఒక వైద్య విధానం. దీనిలో ఇంజెక్షన్ లేదా హైపోడెర్మిక్ ఇంజెక్షన్ అంటేనే చాలా భయం కలుగుతుంది. ఇది కూడా ఒక రకమైన రుగ్మత. పిల్లలలో ఈ రకమైన భయం చాలా సాధారణం, పిల్లల్లో చర్మం చాలా సున్నితంగా ఉంటున్నందున వారు భయపడుతుంటారు. అందుకే పిల్లలు సూదులు చూడగానే భయపడిపోతారు. కొంతమంది పెద్దయ్యాక కూడా చిన్ననాటి భయాలు కలిగి ఉంటారు. పెద్ద వయసులో కూడా వారు ఇంజెక్షన్‌ చేసుకోవడానికి వెనుకంజ వేస్తారు.

ట్రిపనోఫోబియా చికిత్స ఏమిటి..?

భయాలతో వ్యవహరించే మార్గం ప్రతి ఒక్కరిలో భిన్నంగా ఉంటుంది. కొంతమంది దాని నుంచి బయటపడవచ్చు, మరికొందరు దానితో జీవించడం నేర్చుకోవచ్చు. శరీరం, మెదడు సడలింపు కారణంగా ట్రిపనోఫోబియా లక్షణాలను తగ్గిస్తుంది. అందుకని వైద్యులు కూడా ధ్యానం చేయాలని చాలా మందికి సిఫార్సు చేస్తారు. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ), ఎక్స్‌పోజర్ థెరపీ ద్వారా ట్రిపనోఫోబియాకు చికిత్స చేయడం సాధ్యమని వైద్యనిపుణులు చెప్తున్నారు. రోగి నిరాశ లేదా ఆందోళనతో బాధపడుతుంటే అతని ఔషధాలను అందజేస్తూ వారిని మాటల్లో దింపి భయం పోగొట్టేలా చేయాల్సి ఉంటుంది.

ట్రిపనోఫోబియాతో సమస్యలు ఏమిటి..?

ఒత్తిడితో బాధపడుతున్న వ్యక్తులు కూడా తీవ్ర భయాందోళనలకు గురవుతారు. ఇది వారికి చికిత్సను మరింత ఆలస్యం చేస్తుంది. దీర్ఘకాలిక వ్యాధి ఉంటే లేదా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే.. ఈ సమస్య చాలా మరింత ఎక్కువవుతుంది. 

ఇలాంటి వారికి టీకా వేయడం ఎలా..?

ట్రిపనోఫోబియాతో బాధపడుతున్న వ్యక్తికి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా అతడిలోని భయాన్ని తొలగించాల్సి ఉంటుంది. ఇది ప్రమాదకరమైన విషయం కాదని నచ్చజెప్పాలి. సూది మందులు తీసుకుంటున్న వ్యక్తులు ఎలాంటి భయాన్ని గానీ, సమస్యలను గానీ ఎదుర్కోవడం లేదని ప్రత్యక్షంగా చూపించడం ద్వారా వారిలోని భయాన్ని పోగొట్టడం సాధ్యమవుతుంది. అలాగే, థెరపీని కూడా ఇవ్వవచ్చు. ఇందులో, వ్యక్తి భయపడే విషయాలను బహిర్గతం చేయడం ద్వారా.. వారి భయాన్ని తొలగించవచ్చు. వారి ప్రవర్తనను మార్చడం ద్వారా ఈ ఫోబియా నుంచి బయటపడేయవచ్చు. ఇంజెక్షన్‌కు ప్రస్తుతం ప్రత్యామ్నాయం లేదని వైద్యులు చెప్తున్నారు. 

అమెరికాలో 25 శాతం పెద్దలకు భయం

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం, అమెరికాలో 25 శాతం పెద్దలు ట్రిపనోఫోబియాతో బాధపడుతున్నారు. ఈ భయం కారణంగా 7 శాతం పెద్దలు కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. టీకా తీసుకోక పోవడం కారణంగా రోగనిరోధక శక్తి పెరుగదని, తాము సురక్షితంగా ఉండమని తెలిసినప్పటికీ ఈ ఫోబియా కారణంగా వ్యాక్సిన్లకు దూరంగా ఉంటున్నారు. ఒక అధ్యయనం ప్రకారం, అమెరికాలోని పెద్దల్లో 16 శాతం మందికి సూదులు భయం వల్ల ఫ్లూ వ్యాక్సిన్ అందలేదు. అలాగే, బ్రిటన్‌ జనాభాలో 10 శాతం మంది ప్రభావితమవుతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి.

ఇవి కూడా చదవండి..

తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైన ఇందిరమ్మ

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo