శుక్రవారం 22 జనవరి 2021
Health - Jan 11, 2021 , 17:54:12

వంటింటి చిట్కాల‌తో జ‌లుబు, ద‌గ్గు, గొంతునొప్పికి చెక్ పెట్టొచ్చిలా..!

వంటింటి చిట్కాల‌తో జ‌లుబు, ద‌గ్గు, గొంతునొప్పికి చెక్ పెట్టొచ్చిలా..!

హైద‌రాబాద్‌: చ‌లికాలంలో సాధార‌ణంగా జ‌లుబు, ద‌గ్గు, గొంతునొప్పి లాంటి శ్వాససంబంధ స‌మ‌స్య‌లు వేధిస్తుంటాయి. విప‌రీత‌మైన చ‌లిగాలుల‌వ‌ల్ల త‌రచూ జ్వ‌రాలు కూడా వ‌స్తుంటాయి. చెప్పుకోవ‌డానికి చాలా చిన్న‌విగా క‌నిపించే ఈ స‌మ‌స్య‌లు మ‌న‌ల‌ను తీవ్రంగా వేధిస్తాయి. ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు వంటింట్లో ల‌భించే వ‌స్తువులు చ‌క్క‌ని ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తాయ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వంటిళ్ల‌లో నిత్యం వాడే మసాలా దినుసులు, అల్లం, వెల్లుల్లి, తేనే వంటి పదార్థాలతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వాటిని త‌ర‌చూ తీసుకోవ‌డంవ‌ల్ల చ‌లికాలంలో జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం, గొంతునొప్పి లాంటి స‌మ‌స్య‌లు ద‌రిచేర‌కుండా ఉంటాయి. మ‌రి ఆ వంటింటి చిట్కాలేంటో ఒక‌సారి చూద్దామా..?  

1. దాల్చినచెక్క-లవంగ-యాల‌కుల‌ కషాయం

ఈ కషాయాన్ని త‌యారు చేయ‌డం చాలా సులువు. మొదట చిన్నపాటి మట్టి కుండలో ఒక గ్లాసు నీళ్లు పోయాలి. ఆ నీళ్లు మరిగిన త‌ర్వాత‌ దాల్చిన చెక్క, రెండు మూడు లవంగాలు, కొన్ని ఏలకులు అందులో వేయాలి. ఇప్పుడు ఒక టీస్పూన్ తురిమిన అల్లం, సగం టీస్పూన్ నల్ల ఉప్పు, సగం టీస్పూన్ పసుపు, సగం టీస్పూన్ నల్ల మిరియాలు క‌లుపాలి. వాటితోపాటు 5-6 తులసి ఆకులను కూడా వేయాలి. వీటన్నింటినీ కలిపి కుండ‌లోని నీరు సగం అయ్యే వరకు ఉడకబెట్టాలి. ఆ తర్వాత‌ మిశ్రమాన్ని వడపోసి భద్రపరుచుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని రోజుకు కనీసం రెండుసార్లు తాగాలి. ఇలా తాగడం వల్ల జలుబు, ఛాతి నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. వైరస్‌ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. 

2. అల్లం-బెల్లం-మ‌సాలా దినుసుల కషాయం

ఈ క‌షాయం త‌యారు చేయ‌డానికి ముందుగా ఒక చిన్న మట్టి కుండనుగానీ, పాత్రనుగానీ తీసుకోవాలి. అందులో ఒక గ్లాసు నీటిని వేడి చేయాలి. ఆ తర్వాత ఆ నీళ్ల‌లో లవంగాలు, నల్ల మిరియాలు, ఏలకులు, అల్లం, బెల్లం వేసి కలుపాలి. అలా వాటిని కొద్దిసేపు ఉడకనివ్వాలి. త‌ర్వాత‌ కొన్ని తులసి ఆకులను వేయాలి. పాత్రలోని నీరు సగం అయ్యేవరకు మరిగించి, చ‌ల్లారిన త‌ర్వాత వడపోసి భద్రపర్చుకోవాలి. ఈ కషాయంలో బెల్లం కలుపడం వల్ల కొంచెం రుచిగా ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా తాగుతారు. ఇది గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. 

3. మిరియాలు-నిమ్మరసం క‌షాయం

ఒక కప్పు నీళ్ల‌ను వేడిచేసి ఆ నీళ్ల‌లో ఒక టీస్పూన్ మిరియాలు, నాలుగు టీ స్పూన్ల నిమ్మరసం క‌లిపి మరిగించాలి. ఇలా మ‌రిగించి తయారు చేసిన కషాయాన్ని ప్రతిరోజూ ఉదయాన్నే తాగాలి. ఈ క‌షాయం శ‌రీరంలో వేడిని పెంచుతుంది. దాంతో చ‌లి నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేగాక శరీరంలోని చెడు కొలెస్ట‌రాల్‌ను కూడా ఈ క‌షాయం తగ్గిస్తుంది. దీనివ‌ల్ల ఒంట్లో చురుకుదనం, ఉత్సాహం కూడా పెరుగుతాయి.

4. వాము-బెల్లం కషాయం

ఈ కషాయం త‌యారీకి ఒక పాత్రలో గ్లాసెడు నీళ్లు తీసుకుని బాగా మరిగించాలి. ఆ తర్వాత‌ సగం టీ స్పూన్ వాము, సరిపడా బెల్లం వేసి మ‌రికొంతసేపు మ‌ర‌గ‌బెట్టాలి. ముందుగా మనం పోసిన నీరు సగం అయ్యేవరకు మరిగిన త‌ర్వాత, వ‌డ‌పోసి భ‌ద్ర‌ప‌ర్చుకోవాలి. ఈ క‌షాయం జీర్ణవ్యవస్థ ప‌నితీరును మెరుగుప‌రుస్తుంది. అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. అంతేగాక‌ దగ్గు, కడుపునొప్పి సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo