కళ్లకు వ్యాయామం కావాలి


Fri,April 6, 2018 06:06 PM

అద్దాలు రాని వారు అదృష్టవంతులంటారు. అద్దాలు లేకుండా ప్రపంచాన్ని చూడటం వరమే. కానీ అద్దాలు లేకుండా ప్రపంచాన్ని చూసేవారి సంఖ్య నానాటికీ తగ్గుతుంది. అద్దాలతోనే ప్రపంచాన్ని చూడాల్సిన పరిస్థితి నేడు ఏర్పడుతుంది. సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులైన కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ల ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. మితిమీరితే కళ్లద్దాలు పెట్టుకోవాల్సిందేనని హెచ్చరిస్తున్నారు కంటి వైద్యులు. అందుకే కళ్లకు జాగ్రత్తగా పాటించాలి. మనిషి ఆరోగ్యం కోసం నిత్యం వ్యాయామం చేసినట్లే, సరైన దృష్టి కోసం కండ్లతోనూ వ్యాయామం తప్పనిసరి అంటున్నారు కంటి వైద్యులు.

కళ్లకు ఇబ్బంది కలిగించే ఏపరిజ్ఞానమైనా అవసరమైనంత వరకు మాత్రమే వాడాలని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వస్నున్న అత్యాధునిక పరిజ్ఞానం కలిగిన స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌ట్యాప్, కంప్యూటర్లు, ఎల్‌ఈడీ టీవీలాంటివి ఎక్కువ సేపు చూస్తే కళ్లకు ఇబ్బందే. నేడు అనేక మంది వీటికి అలవాటై ఎక్కువ సమయం వెచ్చించి కళ్లకు ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. దీంతో పలురకాల దృష్టిలోపాలు తలెత్తుతున్నాయి. చివరకు వైద్యుని సలహాలతో కళ్లద్దాలు వాడాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రతి 10మందిలో నలుగురు అద్దాలు వాడుతున్నారు. గతంలో జన్యుపరమైన లోపాలతో కళ్లద్దాలు వచ్చేవి. కానీ ప్రస్తుతం స్వయంకృతాపరాధమేనని వైద్యులంటున్నారు.

కళ్లలో సహజత్వం లోపించింది..
సహజంగా ప్రతి మనిషి నిమిషానికి 15 సార్లు కళ్లార్పుతారు. ఈ ప్రక్రియతో కళ్లకు రక్షణ ఉంటుంది. ప్రస్తుత గ్రాడ్జెట్ల వాడకంతో కళ్లార్పే రేటు బాగా పడిపోయిందంటున్నారు వైద్యనిపుణులు. స్మార్ట్‌ఫోన్, ట్యాప్, ల్యాప్‌టాప్ మోజులో పడి కళ్లార్పడం మరిచిపోయారు. నిపుణుల పరిశీలన ప్రకారం వీటిని వాడే వ్యక్తి నిమిషానికి ఐదుసార్లు కూడా కళ్లార్పడం లేదంటున్నారు. కళ్లార్పడం వల్ల గుడ్డుపై ఉన్న పొర తడుస్తూ కంటికి కావాల్సిన ఆక్సీజన్‌ను అందిస్తుంది.

కళ్ల మంట.. తెలియని అలసట
గాడ్జెట్లు వాడేవారిలో కళ్లార్పడం తగ్గిపోవడంతో నల్లగుడ్డుపైన ఉన్న పొర పొడిగా మారుతుంది. దీంతో కండ్లు మండుతున్నట్లు, తెలియని అలసట ఉన్నట్లనిస్తుందని చెబుతున్నారు. ఎక్కువగా ఏసీలో కూర్చున్న వారిలో ఈ సమస్య కన్పిస్తుంది. ఈ యంత్రాల ద్వారా గదిలోని తేమతో పాటు కంటిలోని తేమను లాగేస్తున్నాయి. తద్వారా కంటిలో తేమ మాయమవుతుంది. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని ఒకవేళ ఈ సమస్య ఉంటే ఆర్టిఫీషియల్ చుక్కల ద్వారా ఉపశమనం పొందవచ్చునని వారు సూచిస్తున్నారు. ఏసీకి ఎదురుగా ఎప్పుడూ కూర్చోవద్దని సూచిస్తున్నారు.

విటమిన్ ఏ, డీ ఆహారమే మేలు
విటమిన్ ఏ, డీ ఆహార పదార్థాల్ని ఎంత బాగా తీసుకుంటే కళ్లకు అంత మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. చేప, గుడ్డు, పాలు, క్యారెట్ లాంటి వాటితో పాటు పండ్లను తీసుకోవాలి. దృష్టి లోపం ఉన్నా, లేకపోయినా విటమిన్ ఏ డ్రాప్స్‌ను పిల్లలకు తప్పనిసరిగా వేయించాలి.

కంటికి తగినంత విశ్రాంతినివ్వాలి
ప్రస్తుతం కంటికి తగినంత విశ్రాంతిని ఇవ్వడం లేదు. ఎక్కువగా సెల్‌ఫోన్లు, కంప్యూటర్లపైనే గడుపుతున్నారు. అలాగే మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల తగినత పోషకాలు అందకపోవడం కూడా చిన్న వయసులోనే దృష్టి లోపాలు తలెత్తడానికి కారణం. అందుకే ఎక్కువ పోషకాలున్న ఆహారాన్నే తీసుకోవాలి. అలాకాకుండా ఎడాదికి ఒకసారి వైద్యపరీక్షలు చేయించుకోవడం మంచిది. కంప్యూటర్ ముందు ఎక్కువగా గడిపేవారు ప్రతి 20 నిమిషాలకు, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను 20 సెకన్ల పాటు చూస్తే మంచిది. కాంతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో, కార్యాలయాలలో సరిపడా వెలుగు వచ్చేలా చూసుకోవాలి.
- డాక్టర్ జీవీఎస్ జగన్నాథ్‌కుమార్, కోదాడ

3739

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles