సోమవారం 18 జనవరి 2021
Health - Nov 29, 2020 , 22:15:57

గుడ్డు పెంకులు తినొచ్చా.. తింటే ఏమవుతుంది?

గుడ్డు పెంకులు తినొచ్చా.. తింటే ఏమవుతుంది?

హైదరాబాద్‌ : మనందరికీ తెలుసు గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదని. శరీరానికి పోషకాలు, ప్రొటీన్లు అందించడంలో గుడ్డు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని కూడా తెలుసు. అయితే గుడ్డులో తెల్లసొన మాత్రమే తినాలి.. పచ్చసొన తింటే కొవ్వు పెరుగుతుందని కొందరంటే.. లేదు పచ్చసొన కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని మరికొందరు చెబుతుంటారు. ఇదంతా పక్కకు పెడితే.. గుడ్డు పెంకు కూడా తినొచ్చని కొత్తగా చేసిన స్టడీలు చెబుతున్నాయి. నిజమే గుడ్డులోని తెల్లసొన, పచ్చసొనతో పాటు.. వాటి పెంకుల్ని కూడా తినొచ్చట. అంతేకాదు.. కోడిగుడ్డు పెంకులు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయట. ఆశ్చర్యంగా ఉంది కదా.

ఎటువంటి లాభాలున్నాయో కూడా చూద్దాం పదండి.. గుడ్డు పెంకుల్లో కాల్షియం ఉంటుందట. ఇవి తినడం వల్ల ఎముకలు, దంతాలు బలంగా తయారవుతాయట. తాజాగా చేసిన అధ్యయనం ప్రకారం.. గుడ్డు పెంకుల వల్ల ఎముకలు, దంతాలకు దాదాపు 1000 నుంచి 1500 మిల్లీ గ్రాముల కాల్షియం అందుతుంది. దీంతోపాటు..  శరీరానికి కావల్సిన అతి ముఖ్యమైన విటమిన్-డి కూడా గుడ్డు పెంకుల్లో లభిస్తుంది. 

కాబట్టి కాల్షియం, విటమిన్-డి లోపం ఉన్నవారు.. గుడ్డు పెంకును పొడి చేసుకుని, వేడి నీళ్లు లేదా పాలలో  కలిపి.. దీన్ని కనీసం 20 నుంచి 30 నిమిషాలు మరిగించి చల్లారాక తాగాలి. ఇలా పొడి చేసిన గుడ్డు పెంకులను రోజుకు అర టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుంటే శరీరానికి కావల్సిన కాల్షియం, విటమిన్-డి కచ్చితంగా లభిస్తాయి. చాలా మంది గుడ్డు పెంకు పొడిని వెనిగార్, నిమ్మరసం, ఆరెంజ్ జ్యూస్‌లో కలుపుకుని తాగుతుంటారు.  వీటితో పాటుగా పిజ్జా, పాస్తా లాంటి వంటకాల్లో కూడా దీన్ని వేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

కాకపోతే.. ఇక్కడ కొన్ని షరుతులు ఉన్నాయి. గుడ్డు పెంకులను తీనే ముందు చాలా జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే.. గుడ్డు పెంకులను నేరుగా తీసుకుంటే.. అంతర్గత అవయవాలకు హాని కలగవచ్చు. అందుకని వీటిని  బాగా ఉడికించిన తర్వాతే తినాలి. ఉడికించడం వల్ల దానిపై ఉండే బ్యాక్టీరియా పోతుంది. పొడి చేసుకుని తినడం వల్ల సులభంగా కరిగిపోతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.