బుధవారం 01 ఏప్రిల్ 2020
Health - Mar 23, 2020 , 23:23:12

వేడి వేడి టీ తాగుతున్నారా..?

వేడి వేడి టీ తాగుతున్నారా..?

  • వేడి వేడి కాఫీయో, టీనో కడుపులో పడితే గానీ రిలాక్స్ కాదు చాలామందికి. లిమిట్ గా తీసుకుంటే కాఫీ, టీ మంచివే. కానీ అంత వేడిగా తీసుకుంటే మాత్రం ప్రమాదమే అంటున్నాయి అధ్యయనాలు. వేడిగా తీసుకుంటే ఎందుకు డేంజరో, ఎలాంటి ప్రమాదం వస్తుందో చూద్దామా మరి.
  • టీ చల్లారిందంటే ఇక తాగలేం అంటుంటారు కొంతమంది. పొగలుగక్కే టీ గానీ, కాఫీ గానీ అయితేనే తాగినట్టు ఉంటుందంటారు. ఇవి ఎంత వేడిగా ఉంటే అంత టేస్టీగా అనిపిస్తుందేమో గానీ ఆరోగ్యానికి మాత్రం ప్రమాదమని హెచ్చరిస్తున్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అనేక అధ్యయనాలు. టీలో యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి టీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ దాన్ని అతి వేడిగా తీసుకుంటే మాత్రం మొదటికే మోసం వస్తోంది. టీ తో చాలా వరకు లాభాలే ఉన్నాయి. అయితే చాలా వేడిగా తాగితే దానివల్ల క్యాన్సర్ రిస్కు ఉంటుందంటున్నాయి రీసెంట్ స్టడీస్.
  • చైనాలో జరిగిన పరిశోధన ప్రకారం క్యాన్సర్ కు కారణమయ్యే స్మోకింగ్, ఆల్కహాల్ లకు తోడు టీ, కాఫీలను వేడి వేడిగా తాగితే అవి క్యాన్సర్ కు కాక్ టెయిల్ అవుతాయంటున్నారు. ఇలాంటివాళ్లలో అన్నవాహిక క్యాన్సర్ రిస్కు 5 వంతులు ఎక్కువగా ఉంటుంది. 4 లక్షల 50 వేల మంది 30 నుంచి 79 ఏళ్ల మధ్య వయసు వాళ్లలో 9 ఏళ్ల పాటు ఈ అధ్యయనం చేశారు. పొగతాగడం, ఆల్కహాల్ అలవాట్లతో పాటు రెగ్యులర్ గా రోజూ వేడి వేడి టీ గానీ కాఫీ గానీ తీసుకునేవాళ్లలో క్యాన్సర్ అవకాశాలు పెరిగినట్టు దీనిలో గమనించారు.
  • వేడిగా ఉండే బివరేజెస్ వల్ల అన్నవాహిక కణాలు డ్యామేజ్ అయి క్యాన్సర్ కణాలు ఏర్పడటానికి దారితీస్తున్నాయని సౌత్ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కూడా అంటున్నారు. నిజానికి గోరువెచ్చని కప్పు కాఫీ వల్ల ప్రమాదం లేకపోగా లాభాలు కూడా ఉన్నాయి. గోరువెచ్చని లేదా చల్లని కాఫీ వల్ల లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 15 శాతం తగ్గుతుందని ఇంతకుముందే లాన్సెట్ ఆంకాలజీ పత్రికలో ప్రచురితమైంది.
  • 50 వేల మందిపై పదేళ్ల పాటు చేసిన మరో అధ్యయనంలో అతిగా వేడి ఉన్న కాఫీ, టీ లు తాగే వీళ్లలో 317 మందికి అన్నవాహిక క్యాన్సర్ వచ్చినట్టు తేలింది. రోజుకి 700 మి.లీ. వేడి వేడి టీని 60 డిగ్రీల టెంపరేచర్ లో అంటే 140 డిగ్రీ ఫారన్ హిట్ ఉష్ణోగ్రతలో ఉన్న టీని తాగితే 90 శాతం వరకు అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని ఈ రీసెర్చ్ చెప్తున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కాఫీ, టీ గానీ ఇతర పానీయాలేవైనా 149 డిగ్రీ ఫారన్హిట్ టెంపరేచర్ దాటితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని చెప్తున్నది.
  • టీ ఒక్కటే కాదు.. కాఫీ గానీ, గ్రీన్ టీ గానీ.. మరోటి గానీ.. ఏ డ్రింక్ తాగుతున్నామన్నది సమస్య కాదు.. అది ఏ టెంపరేచర్ లో ఉన్నదనేదే విషయం. వేడి వల్లనే క్యాన్సర్ వస్తున్నట్టు గుర్తించారు. అయితే ఈ వేడి ఎలా క్యాన్సర్ కు కారణమవుతుందనే విషయంలో ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది. దీర్ఘకాలంలో అధిక ఉష్ణోగ్రత వల్ల అన్నవాహికలో గాయమై ఇన్ ఫ్లమేషన్ కు కారణం అవ్వొచ్చు. దానివల్లనే క్యాన్సర్ కు దారి తీస్తున్నదని అంటున్నారు పరిశోధకులు. డైరెక్ట్ గా క్యాన్సర్ రాకపోయినా దెబ్బతిన్న అన్నవాహిక గుండా ఆహారం వెళ్లినప్పుడు దానిలోని క్యాన్సర్ కారక  పదార్థాలు సులువుగా అన్నవాహిక గోడల్లోకి వెళ్లవచ్చు అంటున్నారు. ఏది ఏమైనా వేడి వేడి పానీయాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలూ ఉండవు కాబట్టి వాటిని చల్లబరిచి తాగడమే మేలు. 


logo
>>>>>>