శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - Aug 03, 2020 , 16:31:00

బిడ్డకు పాలిస్తే తల్లికి ప్రయోజనం

బిడ్డకు పాలిస్తే తల్లికి ప్రయోజనం

న్యూ ఢిల్లీ: అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రుపాలు తప్పక తాగించాలి. పిల్లలకు కనీసం ఏడాదిపాటు తల్లిపాలు తాగిస్తే బిడ్డ ఎదుగుదల బాగుంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే, బ్రెస్ట్‌ ఫీడింగ్‌ వల్ల పాలిచ్చే తల్లులకూ ప్రయోజనం ఉందట. బిడ్డకు పాలిస్తే తమ షేప్‌ అవుట్‌ అవుతుందని భావించే ఆధునిక తల్లులు ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే. బిడ్డకు దీర్ఘకాలం పాలిస్తే గర్భధారణ సమయంలో పెరిగిన బరువు, ప్రసవానంతరం తగ్గిపోతారట. అంటే బ్రెస్ట్‌ ఫీడింగ్‌ వల్ల తల్లులు నాజూగ్గా తయారవుతారట. 

తల్లిపాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా ఆగస్టు 1-7వ తేదీ వరకూ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఈ వారోత్సవాలను ‘ఆరోగ్యకరమైన ప్లానెట్‌ కోసం బ్రెస్ట్‌ ఫీడింగ్‌..’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. తల్లిపాలు అటు బిడ్డకు, ఇటు తల్లికీ మేలు చేస్తాయని వివరిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, చైల్డ్‌కేర్‌ సెంటర్లలో గర్భిణులు, బాలింతలకు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

బ్రెస్ట్‌ ఫీడింగ్‌ వల్ల కలిగే లాభాలు..

తల్లిపాలివ్వడం వల్ల అటు తల్లితోపాటు ఇటు పిల్లలకు కూడా అనేక ప్రయోజనాలున్నాయని పలు అధ్యయనాల్లో తేలింది.  తల్లిపాలలో యాంటీబాడీస్‌ ఉంటాయి. ఇవి శిశువు ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. అలాగే, ఊబకాయం సహా ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఇవి సహాయపడతాయి. అలాగే, శిశువు ఎదుగుదలకు అవసరమైన ప్రొటీన్స్‌, కొవ్వులు, విటమిన్లులాంటి పోషకాలు తల్లిపాలలో ఉంటాయి. ఇవి శిశువు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.  ఆకస్మిక శిశు మరణ సిండ్రోమ్, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది శిశువుకు ఉబ్బసం,  హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. పిల్లల్లో ఐక్యూ పెరిగేందుకు తల్లిపాలు దోహదపడుతాయి. పాలిచ్చే తల్లులకు శిశువుకు ప్రత్యేక అనుబంధం ఏర్పడుతుంది. వీటికి అదనంగా తల్లికి కూడా ప్రయోజనాలు కలుగుతున్నాయి. పాలిచ్చే తల్లులు ప్రసవానంతరం బరువు తగ్గేలా బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ప్రోత్సహిస్తోంది. దీనికి ప్రధాన కారణమేంటంటే తల్లి పాలిచ్చేటప్పుడు ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. దీంతో పాలిచ్చే తల్లులు స్లిమ్‌గా తయారవుతారు. అలాగే, బ్రెస్ట్‌ ఫీడింగ్‌ వల్ల బిడ్డపై తల్లికి ప్రేమ రెట్టింపవుతుంది. తల్లులు ఉల్లాసంగా ఉంటారు. బ్రెస్ట్‌ ఫీడింగ్‌ తల్లులకు మంచి అనుభూతితోపాటు ఆనందాన్ని పంచుతుందని అధ్యయనాల్లో తేలింది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo