ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Health - Jul 20, 2020 , 14:45:51

అర్థ‌రాత్రిళ్లు ఎక్కువ‌సేపు మేల్కొంటూ.. ఏదిప‌డితే అది తింటున్నారా?

అర్థ‌రాత్రిళ్లు ఎక్కువ‌సేపు మేల్కొంటూ.. ఏదిప‌డితే అది తింటున్నారా?

ఈ జెన‌రేష‌న్ యువ‌త ప‌గ‌లు క‌న్నా రాత్రుళ్లే ఎక్కువ‌సేపు మేల్కొంటున్నారు. సెల్‌ఫోన్‌, టీవీ, పార్టీలంటూ  రాత్రులు ఎక్కువ స‌మ‌యం గ‌డిపేస్తున్నారు. ఎక్కువ‌సేపు మేల్కొంటే కొన్ని రోగాలు వ‌స్తే ఆ స‌మ‌యంలో తినే తిండికి ఇంకొన్ని రోగాలు జ‌మ‌వుతున్నాయ‌ని ఒక ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది. రాత్రి 9 గంట‌లు దాటిన త‌ర్వాత ఎలాంటి తిండి తిన‌క‌పోవ‌డ‌మే మంచిది. వీలైనంత వ‌ర‌కు డిన్న‌ర్ ఈ స‌మ‌యానికి ముందే తింటే మంచిది. ఖాళీగా ఉండి ఫ్రిజ్ ఓపెన్ చేస్తే చాలు ఆక‌లి లేకున్నా ఏదొక‌టి తినాల‌నిపిస్తుంది. అది రాత్రులు అయినా ప‌గ‌ల‌యినా.. లేట్‌గా డిన్న‌ర్ లేదా చిరుతిండ్లు తినేవారిలో ఎలాంటి స‌మ‌స్య‌లు వస్తాయో స‌ర్వేలో వెల్ల‌డైంది. 

ప‌గ‌లు తినాల్సిన తిండిని అర్థ‌రాత్రులు తింటే.. ర‌క్తంలో చ‌క్కెర శాతం విప‌రీతంగా పెరిగిపోతుంద‌ని ఓ స‌ర్వేలో తేలింది. అంతేకాకుండా అన‌వ‌స‌ర భాగాల్లో కొవ్వు ఏర్ప‌డి మ‌రిన్ని స‌మ‌స్య‌ల్ని సృష్టిస్తుంది. అర్థ‌రాత్రిళ్లు తింటే వారిని దెయ్యం తిండి అంటార‌ని మ‌న పూర్వికులు చెబుతుండేవారు. అది ముమ్మాటికీ నిజ‌మే అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా రాత్రులు జంక్‌ఫుడ్ తినేవారిలో మెద‌డుపై చెడు ప్ర‌భావం చూపుతుంది. ఈ విష‌యంపై కాలిఫోర్నియా విశ్వ‌విద్యాల‌యంలోని శాస్త్ర‌వేత్త‌లు కొన్నేళ్ల‌పాటు లేట్‌నైట్ జంక్‌ఫుడ్ తినే వారిని ప్ర‌త్యేకంగా ప‌రిశీలించారు. నిద్రకు ముందు జంక్‌ఫుడ్‌, స్నాక్స్‌ తినేవారిలో మెదడు తీవ్ర ప్రభావానికి గురైనట్లు తెలుసుకున్నారు. వీరిలో కొంచెం కొంచెంగా జ్ఞాప‌క‌శ‌క్తి స‌న్న‌గిల్లుతుంద‌ని తెలుసుకున్నారు. వీట‌న్నిటికంటే ముఖ్యంగా నిద్ర‌లేమి స‌మ‌స్య‌లు మొద‌ల‌వుతాయి. ఇన్ని విష‌యాలు తెలుసుకున్న త‌ర్వాత కూడా ఇలానే చేస్తే ఇక ఆ దేవుడు కూడా ఏం చేయ‌లేడు. 

 

  logo