శనివారం 26 సెప్టెంబర్ 2020
Health - Jul 25, 2020 , 11:30:34

వ్యాధుల సీజన్‌.. ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా..

వ్యాధుల సీజన్‌.. ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా..

హైదరాబాద్‌ : వేసవికాలం ఎండలతో విసుగుచెంది ఉన్న సమయంలో వర్షం ఎంతో ఉపశమనం ఇస్తుంది. వర్షాలు కొనసాగితే వాతావరణం పూర్తిగా చల్లబడడంతోపాటు చుట్టూ ఆకుపచ్చదనం పెరిగి కళ్లకు, మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. వర్షాలతో వాతావరణంలో తేమ పెరగడం, వర్షంతో నీటి గుంతల్లో నీరు నిలిచి వైరస్‌లు, బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో వానకాలం ప్రారంభమైంది. అంతటా వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఆహారం ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన సమయం ఇది. ఈ సమయంలో సరైన ఆహారాన్ని తీసుకోకపోతే వ్యాధుల బారినపడి అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం లేకపోలేదు. 

మలేరియా, డెంగ్యూ, డయేరియా వంటి వ్యాధులు ప్రబలి కంటికి మీద కునుకు లేకుండా చేస్తాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు ఎక్కువయ్యే ప్రమాదం ఉన్నది. వ్యాధుల బారిన పడకుండా మన ఆహార అలవాట్లే మనల్ని కాపాడుతాయి. ప్రధానంగా బయటి ఆహారాన్ని తినడం మాని ఇంట్లో తయారు చేసిన వేడివేడి ఆహారాన్ని తింటూ సరైన జాగ్రత్తలు తీసుకుంటే.. అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ఇంట్లో తయారు చేసుకోని తీసుకోవడం వల్ల కరోనా మహమ్మారి, సీజనల్ వ్యాధులను మీ దరికి చేరకుండా ఉంటాయి. ఇంట్లో అందుబాటులోనే ఉన్న కొన్ని పదార్థాలను తీసుకోవడం ద్వారా ఈ వైరస్‌లకు అడ్డుకట్ట వేయొచ్చు. అవి ఏంటో కొన్ని తెలుసుకుందాం.

పెరుగు

పెరుగు ఎలాంటి వాత వ్యాధినయినా జయిస్తుంది. ఇది బరువును పెంచుతుంది. శరీరానికి పుష్టిని కలిగిస్తుంది. ఆహారం మీద ఇష్టం లేని వారికి పెరుగు మంచిదని ఆయుర్వేదం చెబుతుంది. పెరుగులో ఉండే పోషక విలువలు పాలలో ఉండే పోషక విలువలతో సమానంగా ఉన్నప్పటికీ, పెరుగులో ఉండే ప్రత్యేక గుణం దాన్ని ఆరోగ్యాన్నిచ్చే పదార్థాలలో ఉన్నత స్థానంలో ఉంచుతుంది. పాలు పెరుగుగా మారడానికి జరిగే ప్రక్రియలో బాక్టీరియా పాలలో ఉండే ప్రోటీన్‌ని తేలికగా అరిగేలా చేస్తుంది. ఈ రకమైన మార్పుతో పెరుగు త్వరగా జీర్ణం అవుతుంది. అంతే కాకుండా జీర్ణకోశంలో పెరిగే హానికర బాక్టీరియాని పెరగనివ్వకుండా చేస్తుంది. అంతే కాకుండా శరీరానికి ‘మంచి’ చేసే బాక్టీరియాని పెరిగేలా కూడా చేస్తుంది. ఈ బాక్టీరియా పెరుగులో ఉండే మినరల్స్ త్వరగా రక్తంలో కలిసేలా చెయ్యడం, బీ కాంప్లెక్స్ విటమిన్‌ను కూడా తయారు చేస్తుంది.  

అల్లం

జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు అల్లం చాలా మంచిది. గొంతు నొప్పికి చికిత్స చేయడానికి అల్లం చాలా మంచి మూలికలలో ఒకటి. రూట్ మసాలా యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. అలాగే అల్లం నోటి దుర్వాసనను పోగోడుతుంది. అల్లం నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియాలను సంహరించి, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం అల్లానికి ఉంది. అల్లం ప్రభావం కాలేయం మీద ఉంటుంది. కొలెస్టరాల్ నియంత్రణలో మెరుగైన పాత్ర వహించేలా కాలేయాన్ని తయారు చేయడమే అల్లం నిర్వహించే పాత్ర. రక్త నాళాల్లో రక్తప్రవాహం మెరుగుపరుస్తుంది. ఆస్త్మాల నుంచి ఉపశమనం అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది. సులభ విరోచనకారి. కడుపు ఉబ్బరాని తగ్గిస్తుంది. 

పుట్టగొడుగు

పుట్టగొడుగుల్లో ఉన్న విటమిన్‌ బీ, యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుట్టగొడుగులు వర్షపు వాతావరణంలో సంభవించే ఇన్ఫెక్షన్లతో పోరాడగలవు. ‘ఇర్గోథియోనైన్‌, సెలీనియం’ అనే రెండు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. విటమిన్‌ ‘డీ’ పుష్కలంగా లభిస్తుంది. ఎముకలు, దంత పుష్టికి సహకరిస్తుంది. పుట్టగొడుగులు ఆల్ట్రావైట్‌- బీ కిరణాలకు ఎక్స్‌పోజ్‌ చేయడం వల్లం విటమిన్‌ ‘డీ’ బాగా తయారవుతుంది.  పోజ్ చేయడం వల్ల విటమిన్‌ డి బాగా తయరవుతుంది. అలాగే శరీర సౌష్టవం, కండర పుష్టికి దోహదపడతాయి. పుట్టగొడుగులలో ఉండే కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడి మెదడుకి, కండరాలకు, ఆక్షిజన్‌ సరఫరా అధికమయినందున వాటి పని సామర్థ్యం పెరుగుతుంది. గుండె, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. మధుమేహం తగ్గిస్తుంది. పుట్టగొడుగుల్లో ఫైబర్, పొటాషియం, విటమిన్ ‘సీ’ కలిగి ఉండి రక్త కణాల ఆరోగ్యానికి సహాయపడుతుంది.

పసుపు పాలు

ఈ పాల ఉత్పత్తిలో అన్ని విటమిన్లు, కార్బోహైడ్రేట్, ఐరన్, కేలరీలు ఉన్నాయి. పసుపులో మంటను నియంత్రించే లక్షణాలు ఉన్నాయి. రోజూ రాత్రి పసుపు పాలు. తీసుకోవడం ద్వారా జలుబు, జ్వరం, చర్మవ్యాధులకు పని చేస్తుందని, ఇంకా మరికొన్ని అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని తేలింది.  ఒక గ్లాసు పాలలో ఒక చెంచా పసుపు, ఒక చెంచా తేనె, కొద్దిగా నెయ్యి వేసి చిటికెడు మిరియాల పొడి వేసి బాగా కలిపి రోజూ రాత్రి పడుకోబోయే ముందు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అజీర్తి, ఛాతీలో మంట వంటివి ఈ పసుపు పాలు తాగితే తగ్గిపోతాయి. కీళ్ల నొప్పుల నుంచి తప్పించుకోవచ్చు. ఇంకా రక్తపోటు నియంత్రణలో ఉంచుతాయి. ఈ పాలలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటి ఇన్‌ఫ్లేమటరీ గుణాలుంటాయి కనుక రోగ నిరోధక శక్తిని బలోపేతం అవుతుంది. జీవక్రియల పనితీరు మెరుగవుతుంది. దీంతో అదనపు బరవు తగ్గి కంట్రోల్‌లో ఉంటుంది. కేన్సర్ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది. కనుక పసుపు పాలను తాగుతూ ఉంటే అనారోగ్యాన్ని దరి చేరనివ్వదు.  

నిమ్మకాయలు

నిమ్మరసం పిండి లేదా నిమ్మకాయ టీ తీసుకోండి. దగ్గును బే వద్ద ఉంచుతుంది. నిమ్మకాయలలో విటమిన్ సి ఉంటుంది. ఇది బాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. జలుబు చేసిన వారికి ఇది చాలా మంచిది. ఆయుర్వేదంలో నిమ్మ జీర్ణక్రియలోను చర్మసౌందర్యానికి చాలా మంచిదని వివరించబడింది. నిమ్మరసం వేడినీటిలో కలిపి సేవిస్తే కాలేయం శుభ్రపరుస్తుంది. రెండు చెంచాల నిమ్మకాయ రసాన్ని ఒక గ్లాసులో కలుపుకొని రోజుకి నాలుగు లేక ఐదు సార్లు తాగితే పచ్చకామెర్లు కూడా తగ్గుతాయి. వలన పచ్చకామెరల వ్యాధి తగ్గుతుంది. రోజూ పరగడుపున ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్లలో ఒక నిమ్మకాయ రసం కలుపుకొని, కొంచెం ఉప్పు కలిపి తాగితే ఊబకాయం తగ్గుతుంది. మలబద్ధకం, అజీర్ణం తదితర జీర్ణక్రియ వ్యాధుల్లో ప్రతీ రోజు రెండు పూటలా నిమ్మరం సాగితే జీర్ణ రసాలు ఊరి ఆకలి పెరుగుతుంది. వీటితో పాటు ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo