బుధవారం 08 ఏప్రిల్ 2020
Health - Jan 30, 2020 , 23:05:40

నానమ్మ నడుము వంగిపోతున్నది.. ఎలా?

నానమ్మ నడుము వంగిపోతున్నది.. ఎలా?

మా నానమ్మ వయసు 73 సంవత్సరాలు. ఆమెకు చాలాకాలం నుంచి నడుము నొప్పి ఉంది. ఈమధ్య కాలంలో ఆమె నడుము ముందుకు వంగిపోతున్నది. దాంతోపాటు నడుము నొప్పి ఎక్కువైంది. ఒక 2 నిమిషాలు కూడా నిలబడలేదు. నడవలేదు. డాక్టర్‌కు చూపిస్తే ఎక్స్‌రేలు, నడుముకి ఎంఆర్‌ఐ స్కాన్‌ కూడా చేశారు. ఎక్స్‌రేలో నడుము ఒక పక్కకి వంగిపోయిందని చెప్పారు. ఎంఆర్‌ఐలో ఎల్‌3, ఎల్‌4, ఎల్‌4-ఎల్‌5, ఎల్‌5-ఎస్‌1 భాగాల్లో నరాల మీద విపరీతమైన ఒత్తిడి ఉందన్నారు. వయసుతో పాటు వచ్చే మార్పులనీ, మందులతో ఏమీ చేయలేమని అంటున్నారు. ఆమెకు ఈ వయసులో ఆపరేషన్‌ చేయొచ్చా? - సుధాకర్‌, హైదరాబాద్‌

మనకు వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు వచ్చినట్టే నడుములో కూడా వస్తాయి. నడుములో డిస్క్‌లు అరిగి, ఎముకల్లో క్యాల్షియం తగ్గుతుంది. దీనివల్ల నడుము, పిరుదుల్లో నొప్పి, నిలబడటం, నడక కష్టంగా ఉంటాయి. దీన్నే మేము సాజిటల్‌ ఇంబ్యాలెన్స్‌ అంటాం. ఈ మార్పులు వయసు పెరిగే కొద్దీ పెరుగుతూ వెళ్తాయి. అందువల్ల మీ నానమ్మకు కూడా వయసుతోపాటు నడుము ముందుకు వంగుతూనే ఉంటుంది. ఆమె ఇబ్బంది కాలంతో పాటు పెరుగుతూనే ఉంటుంది గానీ తగ్గేది కాదని తెలుసుకోవాలి. అందువల్ల ఆపరేషన్‌ మాత్రమే దీనికి శాశ్వత పరిష్కారం.  పెద్దవాళ్లలో ఈ ఆపరేషన్‌ చేయడానికి సరైన ప్లానింగ్‌ ముఖ్యం. ఎక్స్‌రేలో నడుము ఎంత వంగిపోయింది, దాన్ని ఎంతవరకు సరిచేయొచ్చనేది ముందుగా ఒక అంచనాకు రావాలి. అంతేగాకుండా వెన్నుపూసల్లో స్క్రూలు ఎక్కడి నుంచి ఎక్కడివరకు వేయాలో కూడా ముందు ప్లాన్‌ చేసుకోవాలి. ఇవే కాకుండా ఎముకల్లో క్యాల్షియం ఎంత ఉందనేది డెక్సా స్కాన్‌ (బోన్‌ మినరల్‌ డెన్సిటీ) పద్ధతి ద్వారా ఆపరేషన్‌కి ముందే చూసుకోవాలి. ఆపరేషన్‌కు ముందు ప్రణాళిక సరిగ్గా ఉంటే ఈ వెన్ను వంకరను సరిచేయడానికి అవకాశం ఉంటుంది. 


డాక్టర్‌ 

జిపివి సుబ్బయ్య

కన్సల్టెంట్‌ సీనియర్‌ స్పైన్‌ సర్జన్‌ కేర్‌ హాస్పిటల్స్‌

గచ్చిబౌలి, హైదరాబాద్‌


logo