శుక్రవారం 04 డిసెంబర్ 2020
Health - Oct 20, 2020 , 17:35:21

కొవిడ్ -19 : గర్భిణిలకు జాగ్రత్తలు.. రోగనిరోధకశక్తిని పెంచే చిట్కాలు

కొవిడ్ -19 : గర్భిణిలకు జాగ్రత్తలు.. రోగనిరోధకశక్తిని పెంచే చిట్కాలు

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గర్భిణిలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా గర్భం దాల్చిన తర్వాత కొవిడ్‌ సంక్రమణకు గురైతే ఎంలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి..? వ్యాధినిరోధకతను పెంచుకోవడానికి ఎలాంటి ఆహారం అవసరం..? అనే వాటి గురించి సరైన సమాచారం లేకపోవడం వలన గందరగోళంలో పడిపోతున్నారు. గర్భిణిలకు మద్దతుగా నిలిచి వారి భయం, ఆందోళనను తగ్గించడం చాలా ముఖ్యం. సాధారణ మహిళలతో పోలిస్తే గర్భిణిలు కొవిడ్‌-19 సంక్రమణకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

మహమ్మారి చుట్టూ ఉన్న అన్ని గందరగోళాల మధ్య సిజేరియన్లకు డిమాండ్ పెరిగిందని వైద్య నిపుణులు అంటున్నారు. అసంకల్పితంగా కరోనా వైరస్‌కు గురై పుట్టబోయే పిల్లలకు కూడా వ్యాప్తిచెందుతుందన్న ఆదుర్దాతో చాలా మంది గర్భిణిలు ప్రారంభ సీ-సెక్షన్ల కోసం వైద్యుల్ని అభ్యర్థిస్తున్నారు. తల్లీబిడ్డలకు మూలికా నూనె స్నానాలతో పాటు ప్రసవానంతర సంరక్షణ కోసం పెద్దవారి సహాయాన్ని తీసుకోవడం సర్వసాధారణం. డెలివరీ తర్వాత సహాయం చేయడానికి నానీలను పెట్టుకోవాల్సిన అగంత్యం ఏర్పడింది. న్యూక్లియస్‌ కుటుంబాల కారణంగా ఈ కాలం దంపతులకు పిల్లలకు నూనె మసాజ్‌ చేయడం, పిల్లల ఇతర అవసరాలను తీర్చడం ఇబ్బందికరంగా మారింది. ఇదే సమయంలో కరోనా వైరస్ వ్యాప్తితో మరింత భయపడుతున్నారు. అయితే, అమ్నియోటిక్‌ ద్రవంలోగానీ, పిల్లల గొంతులోగానీ, తల్లుల పాలలోగానీ వైరస్‌ ఉండదు. పిండానికి వైరస్‌ సంక్రమణకు గురయ్యే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.

పరిమితంగా పోస్ట్ డెలివరీ సంరక్షణ

సాధారణంగా డెలివరీ రకాన్ని బట్టి.. నవజాత శిశువు యొక్క అవసరాలను అర్థం చేసుకోవడంలో తల్లులకు సహాయపడటానికి వైద్యసిబ్బందికి, ఆయాలకు తగినంత సమయం ఉండేది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అంటువ్యాధులను నివారించేందుకు కాన్పు కాగానే ఎక్కువ కాలం దవాఖానల్లో ఉంచుకోకుండా వీలైనంత త్వరగా ఇంటికి పంపిస్తున్నారు. గర్భం దాల్చిన ప్రారంభ రోజుల్లో సాధారణంగా చేపట్టే స్కానింగ్‌లు, సంప్రదింపులు కూడా నిలిపివేయడంతో గర్భిణిలు కాస్తా అసౌకర్యంగా ఫీలవుతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో గర్భిణిలు సబ్బుతో క్రమం తప్పకుండా, సమర్థంగా చేతులు కడుక్కోవడం, నిర్ణీత దూరం పాటించడం, సమతుల ఆహారం, తగినంత విశ్రాంతి తీసుకోవడం వంటివి అలవర్చుకోవాలి. గర్భంలో పిండం కదలికలు ప్రారంభమైన తర్వాత ప్రతిరోజూ ఆన్‌లైన్ రొటీన్ చెకప్‌లను వీలైనంతగా నిర్వహించడం అలవాటు చేసుకోవాలి. ఇంట్లోనే శరీర ఉష్ణోగ్రతలు చెక్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలి. మూడు రోజుల కన్నా ఎక్కువగా జ్వరం వచ్చినా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నా.. వాసన గుర్తించడంలో మార్పులు కనిపించినా.. వెంటనే వైద్యులను సంప్రదించి తగు సలహాలు పొందాలి.  

గర్భిణిల్లో రోగనిరోధకశక్తిని పెంచేవి..

రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండేందుకు విటమిన్ సీ చాలా శక్తివంతమైన విటమిన్. క్యాప్సూల్‌ మాదిరిగా కాకుండా ఆహారం రూపంలో తీసుకోవడం ద్వారా త్వరగా శరీరం సీ విటమిన్‌ను గ్రహిస్తుంది. తాజా పండ్లు, నిమ్మజాతి పండ్లు, బ్రకలీ, కాలే, స్ట్రాబెర్రీ వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. గర్భిణిలు తమ ఆహారంలో ప్రోబయోటిక్స్ జోడించడం ద్వారా శరీరంలో యాంటీబాడీలను పెంపొందించుకోవచ్చు. పెరుగులో కాల్షియం, డీ విటమిన్ అధికంగా ఉండి గర్భిణిలు ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది. పాలకూర, ఇతర ఆకుపచ్చ కూరగాయలు, ఆకుకూరల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పచ్చి బఠానీలు, ఆలుగడ్డలు, ఉల్లికాడలు, బీన్స్‌లోనూ ఐరన్ లభిస్తుంది. పిస్తా, బాదంపప్పు, మటన్ లివర్, పల్లీలు తింటూ ఉండాలి. అందుబాటులో ఉంటే సపోటా పండ్లను జ్యూస్‌ మాదిరిగా చేసుకుని తాగడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.