శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Health - Sep 13, 2020 , 22:06:28

విటమిన్‌ సీ,డీ తీసుకుంటే ఇన్ఫెక్షన్లు దూరమవుతాయా?

విటమిన్‌ సీ,డీ తీసుకుంటే ఇన్ఫెక్షన్లు దూరమవుతాయా?

న్యూ ఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 మహమ్మారి విజృంభణ తగ్గలేదు. అన్ని దేశాలూ గజగజ వణికిపోతున్నాయి. రాబోయేది శీతాకాలం. ఈ కాలంలో ప్రజలు ఎక్కువగా ఇన్ఫెక్షన్ల బారినపడే ప్రమాదముంది. కరోనాకు ఇంకా టీకా అందుబాటులోకి రాలేదు. మరి చలికాలంలో ఇన్ఫెక్షన్లబారిన పడకుండా, ముఖ్యంగా కొవిడ్‌నుంచి తప్పించుకునేందుకు ఉన్న ఏకైక మార్గం రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడమే. విటమిన్‌ సప్లిమెంట్స్‌ ద్వారా ఇమ్యూనిటీ పవర్‌ పెంచుకోవడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ సిఫార్సు చేస్తున్నారు. ముఖ్యంగా చాలా దేశాల్లో పాఠశాలలు తెరిచారని, పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందని అంటున్నారు. వారికి విటమిన్‌ సీ, డీ అందేలా చూస్తే ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడవచ్చని ఫౌసీ పేర్కొంటున్నారు.  

కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైననాటినుంచి ప్రపంచానికి ప్రముఖంగా వినిపిస్తున్నపేరు డాక్టర్‌ ఫౌసీ, ఆయన విలువైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. యూఎస్‌ఏలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్ కూడా అయిన ఫౌసీ సోషల్ మీడియా లైవ్ ఇంటర్వ్యూలో నటి జెన్నిఫర్ గార్నర్‌తో మాట్లాడారు. ఇన్ఫెక్షన్స్‌ నుంచి తప్పించుకునేందుకు తాను విటమిన్ సీ, విటమిన్ డీ సప్లిమెంట్లను తీసుకుంటానని చెప్పారు. అందరూ వీటిని వాడాలని తాను సూచిస్తున్నట్లు తెలిపారు. విటమిన్‌ డీ లోపముంటే ఇన్ఫెక్షన్లతోపాటు కరోనా వచ్చే ప్రమాదముందన్నారు. విటమిన్‌ సీ మంచి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుందని, అందుకే దాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని చెబతున్నారు. 

విటమిన్లు ఇమ్యూనిటీని పెంచుతాయా?

రోగనిరోధక శక్తి పెరగాలంటే విటమిన్‌ సీ, డీ తీసుకోవాలని నిపుణులంతా సూచిస్తున్నారు. ప్రజలు కూడా ఆ విటమిన్లున్న పదార్థాలకు ప్రాధాన్యమిస్తున్నారు. అలాగే, ట్యాబ్లెట్ల రూపంలోనూ తీసుకుంటున్నారు. అయితే, ఇవి నిజంగా ఇమ్యూనిటీని పెంచుతాయా? అంటే అవుననే అంటున్నాయి చాలా పరిశోధనలు. డాక్టర్‌ ఫౌసీ చేసిన వాదనకు చాలా శాస్త్రీయ ఆధారాలు మద్దతు ఇస్తున్నాయి. కొవిడ్‌-19 తో సహా అన్ని వ్యాధులతో పోరాడే శరీర సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే విటమిన్ సీలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయని కాలక్రమేణా వివిధ అధ్యయనాలు చూపించాయి. మరోవైపు, విటమిన్ డీ కొవిడ్‌-19 కు సంభావ్య చికిత్సగా పరీక్షించబడుతోంది. ఈ సప్లిమెంట్ ఇచ్చిన రోగులు మరణం నుంచి తప్పించుకున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. విటమిన్‌ డీ వాడుతున్నవారికి ఇన్ఫెక్షన్‌ తగ్గిపోతున్నదని శాస్త్రవేత్తలు గుర్తించారు. 

విటమిన్‌ సప్లిమెంట్స్‌ను డైరెక్ట్‌గా వేసుకోవచ్చా?

విటమిన్‌ సీ, డీ సప్లిమెంట్స్‌ తీసుకునే విషయంలో చాలామందికి వచ్చే అనుమానం ఇదే. అయితే, విటమిన్స్‌ లోపం వల్ల వివిధ వ్యాధులు వస్తుంటాయి. అలాంటప్పుడు వీటిని నేరుగా తీసుకోవాల్సిందే. అప్పటికప్పుడు ఇవి ఉన్న ఆహారపదార్ధాలు తీసుకుంటే వెంటనే శరీరంలోకి విటమిన్లు చేరవు. అయితే, విటమిన్‌ సప్లిమెంట్స్‌ను ఎంత మోతాదులో తీసుకోవాలి? మన శరీరానికి అవి అవసరమున్నాయా? అనేది వైద్యులు మాత్రమే చెబుతారు. అందుకే డాక్టర్‌ సూచించిన మేరకు మాత్రమే వీటిని వాడాలి. నేరుగా మనకు మనమే తీసుకుంటే ప్రమాదం కొనితెచ్చుకున్నట్లే. ఇన్ఫెక్షన్లబారిన పడకుండా ఉండాలంటే నారింజ, కివి, పాల ఉత్పత్తులు, చేపలు లాంటి విటమిన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo