మంగళవారం 31 మార్చి 2020
Health - Mar 05, 2020 , 14:02:12

కరోనా..అపోహలొద్దు.. ఏది నిజం?

కరోనా..అపోహలొద్దు..  ఏది నిజం?

కరోనా వైరస్‌ కంటే వేగంగా కొన్ని అపోహలు సోషల్‌మీడియాలో వ్యాపిస్తున్నాయి. చాలామంది ఏది నిజమో తెలుసుకోకుండానే మెసేజ్‌లు, వీడియోలు ఫార్వర్డ్‌ చేసేస్తున్నారు. దీన్నే ప్రపంచఆరోగ్య సంస్థ ‘ఇన్ఫోడెమిక్‌'గా పిలుస్తున్నది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న కొన్ని అంశాల వెనుక వాస్తవమెంతంటే..?

అపోహ : తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారి పైన మాత్రమే కరోనా ప్రభావం ఉంటుంది.  

వాస్తవం: కరోనా వైరస్‌ అందరిపై ప్రభావం చూపుతుంది. కానీ తక్కువ రోగనిరోధక శక్తి, దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు ఉన్న వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.  

అపోహ : కరోనా వైరస్‌ పిల్లలపై, వృద్ధులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.  

వాస్తవం : సాధారణంగా 30 - 60 సంవత్సరాల వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. మరణాల సంఖ్య మాత్రం వృద్ధుల్లో ఎక్కువగా ఉంది.  
అపోహ : సిట్రస్‌ ఫ్రూట్స్‌, వెల్లుల్లి వంటి రోగనిరోధక బూస్టర్లు కరోనాను ఎదుర్కొంటాయి.  

వాస్తవం : దీనికి ఎటువంటి ఆధారాలు లేవు, కానీ సిట్రస్‌ పండ్లు, వెల్లుల్లి ఆరోగ్యకరమైన ఆహారం. వీటిని తరచుగా తీసుకోవడం మంచిది. అపోహ : మాస్క్‌ ధరిస్తే కరోనా రాదు.  

వాస్తవం: సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ వారి నివేదిక ప్రకారం ఆరోగ్యంగా ఉన్నవారు ఫేస్‌మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదు. వ్యాధి లక్షణాలు ఉన్న వారు, రోగులకు సేవ చేసేవారు మాత్రం ధరించాలని చెబుతున్నారు. మాస్క్‌ ధరిస్తే వైరస్‌ వ్యాపించదు అంతే. అపోహ: చైనా నుంచి దిగుమతైన వస్తువుల్ని తాకితే వైరస్‌ వ్యాపిస్తుంది!

వాస్తవం: కరోనా వైరస్‌ ధీర్ఘకాలం పాటు సజీవంగా ఉండదు. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ వారి నివేదిక ప్రకారం చైనా నుంచి వచ్చిన ఏదైనా లెటర్‌ గానీ, కొరియర్‌, పాకెట్‌ను గానీ తాకితే వైరస్‌ వ్యాపించదు.అపోహ : పిల్లలు వైరస్‌ బారిన పడరు!

వాస్తవం: ఏ వయసు వారైనా, లింగబేధం లేకుండా వైరస్‌ బారిన పడే ప్రమాదం ఉంది. ప్రపంచంలో చాలామంది టీనేజర్లు వైరస్‌ బారిన పడ్డట్లు ‘సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌' చెబుతున్నది. 
అపోహ: కరోనా సోకితే మరణమే!

వాస్తవం: కరోనా వైరస్‌ సోకితే మరణం తప్పదు అనేది అపోహ మాత్రమే. మరణ రేటు 2 శాతం మాత్రమే ఉన్నది. 


logo
>>>>>>