గురువారం 24 సెప్టెంబర్ 2020
Health - Apr 21, 2020 , 14:54:29

అతిశుద్ధితో అనర్థాలు కలుగుతున్నాయట

అతిశుద్ధితో అనర్థాలు కలుగుతున్నాయట

హైదరబాద్: కరోనావైరస్ మీది భయంతో ఎడాపెడా శుద్ధి కార్యక్రమాలు చేపడుతుండడంతో అమెరికాలో విష ప్రభావాలు పెరుగుతున్నాయట. బ్లీచింగ్ తదితర శుద్ధికారకాల వాడకం సహజంగానే పెరిగింది. అలాగే అవి ఆహారంలో కలిసిపోవడమూ పెరిగింది. ఫలితంగా జనాలు అనారోగ్యం పాలై కాల్ సెంటర్లకు ఫోన్లు చేస్తున్నారు. పాయిజన్ సెంటర్లకు గతేడాది జనవరి-మార్చి మధ్యకాలంలో 37,822 కాల్స్ రాగా ఈసారి అదే కాలానికి 45,550కి పెరిగాయి. శుద్ధికొరకు వాడే ప్రమాదకర రసాయనాలు శరీరంలో కలిసిపోయి సమస్యలు సృష్టించడమే అందుకు కారణం. అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించిన మార్చినెలలో మరీ ముఖ్యంగా కాల్స్ పెరిగాయట. అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) ఈ సంగతి వెల్లడించింది. ఐదేళ్లలోపు పిల్లలు విషప్రయోగానికి గురికావడం ఎక్కువగా జరుగుతున్నది. పీల్చడం వల్లనే ఎక్కువ విషప్రయోగం కేసులు నమోదయ్యాయి. ఊపిరి ఆడకపోవడం, అదేపనిగా దగ్గు రావడం వంటి సమస్యలతో పిల్లలు, పెద్దలు సతమతం అవుతున్నారు. సీడీసీ ఈ ధోరణి గురించి తెలియజెప్పేందుకు రెండు ఉదాహరణలు ఇచ్చింది. ప్రమాదకరమైన రసాయనాన్ని పీల్చిన ఓ మహిళ తనకు ఊపిరి ఆడడం లేదని ఫోన్ చేసింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి పరీక్షిస్తే ఆమె రక్తంలో ఆక్సీజన్ తక్కువగా ఉన్నట్టు తెలిసింది. దాంతో ఆమెకు ఆక్సీజన్ ఎక్కిస్తే పరిస్థితి మెరుగుపడింది. ఇక రెండో కేసు ఓ నర్సరీ చదివే అమ్మాయికి సంబందించింది. ాయ పాప స్పృహ కోల్పోవడంతో ఆస్పత్రికి తెచ్చారు. సంగతేమిటంటే వాళ్ల ఇంటిలో డైనింగ్ టేబిల్ మీద రెండు లీటర్ల ఆల్కహాల్ హ్యాండ్ శానిటైజర్ సీసా మూత తెరిచి ఉంచి. ఆ పాప దానిని గుటగుట తాగేసి దబ్బున కిందపడిపోయింది. అలా పడిపోయినప్పుడు తలకు దెబ్బ తగిలింది. అంబులన్స్‌లో వాంతి చేసుకుంది. అయినా స్పృహ రాలేదు. ఆమె రక్తంలో ఆల్కహాల్ శాతం 273 మిల్లీగ్రాములు నమోదైంది. పెద్దవాళ్లకు చట్టపరంగా అనుమతించిన ఆల్కహాల్ పరిమితి కంటే అది మూడింతలు. బ్రెయిన్ స్కాన్ తీస్తే ఏమీ కనిపించలేదు. 48 గంటల తర్వాత మామూలు స్థితికి వస్తే ఇంటికి పంపించారు. అతిగా శుద్ధి రసాయనాలు వాడడం, సేకరించి పెట్టుకోవడం ఈ సమస్యలకు మూలమని తెలుస్తున్నది.


logo