గురువారం 02 ఏప్రిల్ 2020
Health - Feb 03, 2020 , 08:29:45

నేటి నుంచి గాంధీ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు..

నేటి నుంచి గాంధీ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు..

హైదరాబాద్‌: ఇవాళ్టి నుంచి నగరంలోని గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జరుగనున్నాయి. కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల కిట్లను కేంద్రప్రభుత్వం రాష్ర్టానికి పంపించింది. దీంతో, ప్రతిరోజు 30 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు కిట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 19 మంది కరోనా అనుమానితులు ఆస్పత్రుల్లో చేరారు. నగరంలోని ఫీవర్‌ ఆస్పత్రి, గాంధీ ఆస్పత్రిలో వారిని ప్రత్యేక సదుపాయాల నడుమ వైద్యుల పరిశీలనలో ఉంచారు. వారి నుంచి నమూనాలు సేకరించిన వైద్యులు.. పూణేలోని ల్యాబ్‌కు పంపించారు. కాగా, వారిలో 11 మందికి కరోనా వైరస్‌ లేదని నమూనా పరీక్షలో నిర్ధారణ అయ్యింది. వైద్యులు వారిని డిశ్చార్జి చేశారు. మరో 8 మంది వివరాలు వెల్లడించాల్సి ఉందనీ.. ల్యాబ్‌ నుంచి నమూనాల ఫలితాలు రాగానే వారి ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ వస్తుందని వైద్యులు తెలిపారు.

చైనాలో చిన్న జ్వరంగా మానవ శరీరంలోకి ప్రవేశించిన ఈ వైరస్‌ ప్రాణాలను రోజు వ్యవధిలో హరిస్తోంది. ఇప్పటికే చైనాలో ఈ వ్యాధి బారిన పడి 304 మంది చనిపోయారు. ఇంకా వేల మంది ఈ వైరస్‌ లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. చైనాలోని వుహాన్‌ నగరంలో ఉంటున్న భారతీయులు ప్రత్యేక విమానంలో భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. వారు ప్రస్తుతం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని ప్రత్యేక సైనిక వైద్య శిబిరాల్లో ఉన్నారు. వారికి ఎలాంటి వ్యాధి  లక్షణాలు లేనప్పటికీ ముందు జాగ్రత్తగా చర్యగా వారిని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శిబిరాల్లో ఉంచింది. ప్రపంచంలో చాలా దేశాలకు విస్తరించిన ఈ ప్రాణాంతక వైరస్‌.. భారత్‌లో కూడా ప్రవేశించింది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా కేంద్రం సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. 


logo
>>>>>>