కాఫీతో యాంగ్జైటీ పెరుగుతుందా..?

న్యూఢిల్లీ : కాఫీ, టీ లేకుండా మనలో చాలామందికి రోజు గడవదు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో కాఫీ భాగమైపోయింది. కాఫీలో ఉండే కెఫిన్ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పలు అథ్యయనాలు చెబుతుండగా, కొద్ది మోతాదులో తీసుకోవడంతో రోజంతా ఉత్తేజంగా గడపవచ్చని మరికొన్ని పరిశోధనలు వెల్లడించాయి. అయితే అసలు కాఫీతో యాంగ్జైటీ పెరుగుతుందా, ఒత్తిడి మరింత అధికమవుతుందా అనే సందేహాలపై తాజా సర్వేలు ఆసక్తికర వివరాలను బయటపెట్టాయి.
కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రెస్లో ప్రచురితమైన న్యూరోసైకియాట్రిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కెఫిన్ నివేదిక కాఫీతో నిద్రలేమి, యాంగ్జైటీ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుందని హెచ్చరించగా, పబ్మెడ్ సెంట్రల్లో ప్రచురితమైన మరో సర్వే కాఫీని తక్కువ మోతాదులో తీసుకుంటే పిల్లలు, పెద్దల ఆరోగ్యంలో ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని తేల్చింది. అయితే ఒత్తిడి, ఆందోళనకు లోనయ్యే వారు తలనొప్పి, యాంగ్జైటీ, తలతిరగడం వంటి లక్షణాలను నివారించేందుకు కాఫీని పరిమితంగానే తీసుకోవాలని సూచించింది. కాఫీ అలవాటును మానుకోలేని వారు హెర్బల్ టీ వంటి ఇతర ప్రత్నామ్నాయాలను ఆలోచించాలని పేర్కొంది. ఇక ఒత్తిడి, ఆందోళనను అధిగమించేందుకు రోజుకు 6-8 గంటల నిద్రతో పాటు నడక, థ్యానం, సమతుల ఆహారాన్ని తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.