గురువారం 01 అక్టోబర్ 2020
Health - Jul 24, 2020 , 21:28:32

చికెన్‌.. గుడ్డు.. ఇందులో ఏది బెస్ట్‌?

చికెన్‌.. గుడ్డు.. ఇందులో ఏది బెస్ట్‌?

హైదరాబాద్‌: కోడి ముందా? గుడ్డు ముందా? అని అందరూ సరదాగా అడుగుతుంటారు. దాంతో ఎలాంటి ప్రయోజనం లేదుగానీ,  ప్రొటీన్ల పరంగా ఇందులో ఏది ఉత్తమం తెలుసుకుంటే మనకిప్పుడెంతో లాభం. కరోనా రాకుండా, వచ్చినా డైట్‌లో భాగంగా ఇప్పుడు ఈ రెండింటినీ చేర్చారు వైద్య నిపుణులు. కాగా, కొందరు శాఖాహారులు చికెన్‌ తినరు కానీ గుడ్డు మాత్రమే తీసుకుంటారు. మరికొంతమంది పేదవారికి చికెన్‌ తినాలనున్నా తరుచూ కొనడం ఆర్థిక సమస్యలతో సాధ్యంకాకపోవచ్చు. మరి అతిచౌక ధరలో లభించే గుడ్డులో మన బాడీకి సరిపోయే ప్రొటీన్లు ఉంటాయా? చికెన్‌ తినకున్నా గుడ్డు మాత్రమే తింటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోగలమా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోండి మరీ..

 చికెన్‌ సీక్రెట్‌..

భారతదేశంలో ప్రతి ఏడాది  జూలై 24 నుంచి జూలై 30 మధ్య ప్రొటీన్‌ వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. మరి మనకు ప్రొటీన్‌ రిచ్‌ ఫుడ్‌ అంటే టక్కున గుర్తుకొచ్చేవి చికెన్, కోడిగుడ్లే. ప్రపంచవ్యాప్తంగా ఫిట్‌నెస్ ఔత్సాహికులు చికెన్‌ను బాగా తింటారు.  ఎందుకంటే ఇందులో ఉండే ప్రొటీన్లు కండర శక్తిని పెంపొందిస్తాయి. యూఎస్ వ్యవసాయ శాఖ (యూఎస్‌డీఏ) ప్రకారం.. 100 గ్రాముల చికెన్ 143 కిలో కేలరీల శక్తిని, 24.11 గ్రా. ప్రోటీన్, 2.68 గ్రా. కార్బోహైడ్రేట్లను, 3.12 గ్రాముల లిపిడ్లు లేదా కొవ్వును అందిస్తుంది. దీంతోపాటు అదే మొత్తంలో చికెన్‌లో మన శరీరానికి కావాల్సిన కాల్షియం, ఐరన్, సోడియం, విటమిన్ ఏ, విటమిన్ సీ ఉంటుంది. అయితే, బరువు తగ్గాలనుకునేవారు, ఫిట్‌నెస్‌ సాధించాలనుకునేవారు చికెన్‌ బ్రెస్ట్‌ను మాత్రమే తీసుకోవాలి. వెయిట్‌ గెయిన్‌ అవ్వాలనుకున్నవారు చికెన్‌ లెగ్స్‌, వింగ్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.   

ఎగ్‌ రహస్యం..

యూఎస్‌డీఏ ప్రకారం 100 గ్రాముల బరువున్న ఉడికించిన గుడ్డులో 155 కిలో కేలరీల శక్తి, 12.58 గ్రా. ప్రోటీన్, 1.12 గ్రా. కార్బోహైడ్రేట్లు, 10.61 గ్రా. కొవ్వు ఉంటుంది. అయితే, గుడ్డులో ఉండే కొవ్వు మన శరీరంలోని రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిని పెంచదని ఇటీవల అధ్యయనాలు తెలిపాయి. మొత్తం గుడ్డును నిరభ్యంతరంగా తినేయవచ్చని సూచించాయి. అదనంగా, అదే మొత్తంలో గుడ్డులో కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, సోడియం, జింక్, రాగి, మాంగనీస్, సెలీనియం, ఫ్లోరైడ్, విటమిన్ ఏ, విటమిన్ బీ కాంప్లెక్స్, విటమిన్ కే ఉంటాయి. అలాగే, గుడ్డు పచ్చసొనలో లుటిన్, జియాక్సంతిన్ లాంటి యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.  ఇవి కండర నిర్మాణం, బరువు తగ్గడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు గుడ్డు చాలా తోడ్పడుతుంది. 

ప్రొటీన్ల ఆవశ్యకత..

ఇండియన్ డెర్మటాలజీ ఆన్‌లైన్ జర్నల్ (2019) లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, భారతీయ ఆహార విధానం ఎక్కువగా కార్బోహైడ్రేట్ల ఆధారితమైనది. దేశంలో ప్రోటీన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రోటీన్ లోపం వల్ల మరస్మస్, ఎడెమా, కండరాల నష్టం, సోరియాసిస్, డయాబెటిస్, డైస్లిపిడెమియా, చర్మ సమస్యలు, జుట్టు ఊడిపోవడంలాంటివి వేధిస్తాయి. కనుక శరీర బరువు ప్రతి కిలోగ్రాముకు 0.8 గ్రాముల ప్రొటీన్‌ తప్పనిసరిగా తీసుకోవాలి. మీ బరువు 50 కిలోలు ఉంటే మీరు ప్రతిరోజూ 40 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాల్సిందే.  

ఏది బెటర్‌?

మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు చికెన్‌, గుడ్లు రెండూ ప్రొటీన్‌రిచ్‌ ఆహార పదార్థాలే. కావున మన బాడీకి సరిపోయే ప్రొటీన్‌ అందించాలంటే ఈ రెండింటినీ సమానంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకేవేళ చికెన్‌ తీసుకోవడం మీకు సాధ్యం కాకుంటే గుడ్లను ప్రతిరోజూ తీసుకోవాలని పేర్కొంటున్నారు. గుడ్లను క్రమం తప్పకుండా తీసుకున్నా మనకు కావాల్సిన ప్రొటీన్లను పొందవచ్చని సూచిస్తున్నారు. భారీస్థాయిలో ప్రొటీన్‌ లోపం ఉన్నవారు మాత్రం గుడ్లతోపాటు చికెన్‌బ్రెస్ట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సలహా ఇస్తున్నారు. ఇంకెందుకాలస్యం మీకు వీలుంటే విన్నర్‌ విన్నర్‌ చికెన్‌ డిన్నర్‌.. లేకుంటే సండే యా మండే రోజ్‌కావో అండే...


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo