కుర్చీ యోగాతో మానసిక,శారీరక రుగ్మతలు మాయం


Mon,May 21, 2018 08:33 AM

మారిన జీవన విధానంలో ఎన్నో మానసిక, శారీరక సమస్యలు.. వీటి నివారణకు యోగా ఒక మంచి సాధనం.. కానీ వృద్ధులు ఆసనాలు వేయడం కష్టం.. వీరికోసం యోగాసనాల్లో చిన్న చిన్న మార్పులు చేసి రూపొందించినదే కుర్చీ యోగా. సనత్‌నగర్ జెక్‌కాలనీ సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ప్రముఖ యోగా శిక్షకుడు ధరణీప్రగడ ప్రకాశ్‌రావు కాలనీలోని స్ట్రీట్ నెంబర్ 2లోని ఇండిగో కౌంటీ అపార్ట్‌మెంట్‌లో రెండు వారాలుగా కుర్చీయోగా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి విశేష స్పందన లభిస్తున్నది.

యోగాసనాలు..


కొద్దిపాటి శ్రమకోర్చి సాధన చేయాల్సి ఉంటుంది. శారీరక రుగ్మతలను దూరం చేసుకోవడంతోపాటు మానసిక ప్రశాంతతకు ఈ ఆసనాలు దోహదపడుతాయి. అయితే భారతీయ యోగా శాస్త్రంలోని యోగాసనాలను కొందరు నిపుణులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చేసిన మార్పులు చేర్పులు చక్కటి ఫలితాలనిస్తున్నాయి. వాటిలో ఛైర్ యోగాను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. చిన్నారులు,యువతతో పాటు వయోభారం బాధించని వారికి యోగాసనాలు వేయడంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. అయితే మారుతున్న పరిస్థితుల్లో వయోధికులతో పాటు వయోభారం అంతగా లేని వారు కూడా మోకాళ్లు, కీళ్ల నొప్పులతో అవస్థలుపడుతుంటారు.

అటువంటి వారికి కుర్చీ యోగా ఎంతగానో ఉపయోగపడుతున్నది. కుర్చీలో కూర్చుని సరళతరమైన ఆసనాలు చేస్తూ తమ సమస్యలను అధిగమిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నది. అత్యుత్తమ యోగా శిక్షకుడిగా పేరున్న పుణెకు చెందిన బీ.కే.ఎస్.అయ్యంగార్ తనకున్న అనుభవం మేరకు ఆసనాలను కొద్దిపాటి మార్పులతో కుర్చీపై కూర్చుని ఏ విధంగా చేయవచ్చనే అంశం మీద క్షుణ్ణంగా చేసిన పరిశోధనల తరువాత ప్రవేశపెట్టిన కుర్చీ యోగ విశేష ప్రాచుర్యం పొందింది. నిపుణులైన యోగా శిక్షకులు ఈ యోగాను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లడానికి తమ వంతు కృషి చేస్తున్నారు. వయోధికులకు ఎంతగానో ఉపయోగపడుతున్న ఈ యోగాను నగరంలో విస్తరించేందుకు ప్రముఖ యోగా శిక్షకుడు ధరణీప్రగడ ప్రకాశ్‌రావు తనవంతు చేయూతనందిస్తున్నారు.

సనత్‌నగర్ జెక్‌కాలనీ సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ప్రముఖ యోగా శిక్షకుడు ధరణీప్రగడ ప్రకాశ్‌రావు కాలనీలోని స్ట్రీట్ నెంబర్2లోని ఇండిగో కౌంటీ అపార్ట్‌మెంట్‌లో రెండు వారాలుగా ఛైర్ యోగా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిబిరాలకు వయోధికుల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. ప్రతిరోజూ సాయంత్రం గంట పాటు జరిగే ఈ శిబిరంలో కాలనీకి చెందిన వారు పెద్దసంఖ్యలో హాజరవుతున్నారు. 60 ఏళ్లు పైబడిన మహిళలు, పురుషులు ఈ శిబిరంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రెండు వారాల క్రితం కొద్ది మందితో ప్రారంభమైన ఈ శిబిరం స్థానికుల విజ్ఞప్తి మేరకు మరింత కాలం పొడిగిస్తున్నారు.

సరళతరమైన ఆసనాలు


వయోధికులు సహజంగా ఎదుర్కొనే నిద్రలేమి, మోకాళ్లు, కీళ్ల నొప్పులు, మధుమేహం, రక్తపోటు వంటి రుగ్మతలను సరళతరమైన యోగాసనాలతో అధిగమించవచ్చనే విషయాలను శిబిరంలో ధరణీప్రగడ ప్రకాశ్‌రావు వివరిస్తున్నారు. దాదాపు గంట పాటు కొనసాగే శిబిరంలో ముందుగా కపాలభాతి క్రియ (శుద్ధి క్రియ, సంజీవిని ప్రాణాయామం), ఆ తరువాత కుర్చీలో ప్రశాంతంగా కూర్చుని శ్వాసపై సాధన చేసిన తరువాత రెండు నిమిషాల పాటు ఓం ధ్వని సాధన, గాయత్రీ మంత్రం పఠనం, ఆ తరువాత కాలి వేళ్లు, కీళ్లు, మడమ, మోకాళ్లు, తదితర ప్రాంతాల్లో కదలికలు వచ్చేలా ఆసనాలు వేస్తారు. అనంతరం సూర్య నమస్కారాలు, పాద హస్తాసన్, హస్త ఉత్థానాసన్, ప్రశాంతంగా కూర్చుని పవన ముక్తాసన్ వేసిన తరువాత, వెన్నెముక పటుత్వానికి కుర్చీలో కూర్చుని కుడి, ఎడమ వైపుల నుంచి వెనక్కి మళ్లడం, ఆ తరువాత శవాసనం తరహాలో రిలాక్స్ అవడం, లాఫింగ్ థెరపీ, ప్రాణయామం, చివరగా 10 నిమిషాల ధ్యానంతో శిబిరం ముగుస్తుంది.

కాలానుగుణంగా మార్పులు


యోగాసనాలు వేస్తే ఆరోగ్య రుగ్మతలు దూరం చేసుకోవచ్చు. అయితే వయోభారంతో కింద కూర్చునేందుకు ఇబ్బందులు పడేవారు కూడా కుర్చీలో కూర్చొని సాధన చేసేలా యోగశాస్త్రంలో చేసిన కొన్ని మార్పులతో ఇది అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వృద్ధులు ఎదుర్కొంటున్న అనేక ఆరోగ్య సమస్యలకు ఈ కుర్చీయోగాలో చక్కటి పరిష్కారాలున్నాయి. అన్ని ఆసనాలు కూర్చుని, పడుకొని చేయాల్సిన అవసరం లేదు. -ధరణీప్రగడ ప్రకాశ్‌రావు, యోగా శిక్షకులు

2739

More News

VIRAL NEWS