ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Health - Sep 15, 2020 , 16:15:03

చ్యవన్‌ప్రాష్‌తో కరోనా రాకుండా అడ్డుకోవచ్చా..?

చ్యవన్‌ప్రాష్‌తో కరోనా రాకుండా అడ్డుకోవచ్చా..?

న్యూ ఢిల్లీ: చ్యవన్‌ప్రాష్‌ ఇది ఒక ఆయుర్వేద ఔషధం. ఇది భారతదేశంలో ఆహార పదార్ధంగా విస్తృతంగా వినియోగించబడుతోంది. అపారమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రసిద్ది చెందిన చ్యవన్‌ప్రాష్‌ను ఆయుర్వేద వైద్యులు ప్రాచీన కాలం నుంచి రోగనిరోధక శక్తిని, దీర్ఘాయువు కోసం ఉపయోగిస్తున్నారు. ఈ మూలికా ఔషధం ఇప్పుడు కోవిడ్ -19 రాకుండా తీసుకోవాల్సిన పదార్థాల లిస్ట్‌లో చేరిపోయింది. ఇటీవలే, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ‘పోస్ట్ కోవిడ్ -19 మేనేజ్‌మెంట్ ప్రొటోకాల్‌’ ను విడుదల చేసింది. ఇందులో చ్యవన్‌ప్రాష్, యోగా ఆసనాలు, శ్వాస వ్యాయామాలు, రోజువారీ ఉదయం లేదా సాయంత్రం నడకను సిఫార్సు చేసింది. అంతకుముందు, ఆయుష్ మంత్రిత్వ శాఖ రిజిస్టర్డ్ ఆయుర్వేద వైద్యుడి ఆదేశాల మేరకు ఉదయం మోస్తరు నీరు / పాలతో చ్యవన్‌ప్రాష్‌ వాడాలని సూచించింది.  

కొవిడ్‌ నుంచి రక్షిస్తుందా..?

చ్యవన్‌ప్రాష్‌లో విటమిన్లు, ఖనిజాలు, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అనేక రకాల ఆరోగ్య సమస్యలను నివారించడానికి సహాయపడతాయి. ఇందులో ఉండే అధిక విటమిన్ సీ కంటెంట్ రోగనిరోధక శక్తిని, జీవక్రియను పెంచుతుంది. సాధారణ జలుబు, దగ్గుతో సహా వివిధ వైరల్,  బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుందని నమ్ముతారు. చ్యవన్‌ప్రాష్‌ తీసుకోవడం వల్ల కొవిడ్‌-19 వ్యాధితో సహా అంటువ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగవచ్చు. కాగా, కొవిడ్‌ను చ్యవన్‌ప్రాష్‌ నిరోధించగలదని లేదా నయం చేయగలదని రుజువు చేసే శాస్త్రీయ అధ్యయనం ఇంకా లేదని గమనించడం ముఖ్యం.

చ్యవన్‌ప్రాష్‌ మరికొన్ని ప్రయోజనాలివే..

  • ఇది వివిధ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తుంది
  • జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది
  • జీవక్రియను పెంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది
  • వృద్ధాప్య ప్రక్రియ ప్రభావం మందగించడానికి సహాయపడుతుంది
  • రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరం నుంచి విషపదార్థాలను తొలగిస్తుంది. 
  • రక్తపోటును కూడా సాధారణీకరిస్తుంది. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ను ప్రోత్సహిస్తుంది
  • పునరుత్పత్తి కణజాలాలను పెంచుతుంది

ఎలా తీసుకోవాలి..? 

ఆయుష్ మంత్రిత్వ శాఖ సిఫారసు ప్రకారం, ఒక రిజిస్టర్డ్ ఆయుర్వేద వైద్యుడి పర్యవేక్షణలో ఉదయం ఒక టీస్పూన్ చ్యవన్‌ప్రాష్‌ను గోరువెచ్చని నీరు / పాలతో కలిపి తీసుకోవాలి. క్లినికల్ ప్రాక్టీస్‌లో రికవరీ అనంతర కాలంలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని నమ్ముతారు. దీని మోతాదు ఎక్కువగా జీర్ణశక్తి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలకు చ్యవన్‌ప్రాష్‌ ఇచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు మోతాదును నిర్ణయించుకోవాలి.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo