బుధవారం 08 ఏప్రిల్ 2020
Health - Mar 22, 2020 , 07:35:39

రక్తనాళాలకు కష్టమొస్తే...కూర్చున్నా.. నిల్చున్నా.. సమస్యే!

రక్తనాళాలకు కష్టమొస్తే...కూర్చున్నా.. నిల్చున్నా.. సమస్యే!

గంటలు గంటలు కూర్చుని పనిచేస్తున్నారా..? లేక రోజంతా నిల్చునే ఉంటున్నారా..? ఏ పనైనా అతిగా చేస్తే ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది. ఎక్కువ సేపు కూర్చుంటే కొవ్వు పేరుకుపోయి స్థూలకాయం, డయాబెటిస్‌ లాంటి సమస్యలే కాదు.. రక్తనాళ సమస్యలు కూడా వస్తాయి. ఎక్కువ సేపు నిల్చున్నా ఇలాంటి సమస్యలు తప్పవంటున్నారు వైద్య నిపుణులు. ఉదయం స్కూల్‌ మొదలైనప్పటి నుంచి చివరి పీరియడ్‌ అయిపోయేవరకు దాదాపుగా నిల్చునే ఉంటారు టీచర్లు.. ట్రాఫిక్‌ని నియంత్రించే క్రమంలో అసలు కూర్చునే అవకాశమే ఉండదు ట్రాఫిక్‌ పోలీసులకి... మరోవైపు అసలు నిల్చోవడానికీ, నడవడానికీ అవకాశమే లేకుండా రోజంతా కూర్చునే పనిచేస్తుంటారు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. వీళ్లు చేసే పనులు వేరైనా వాళ్లకు వచ్చే జబ్బులు మాత్రం ఒకటే. 

అవే.. రక్తనాళ సమస్యలు!

రక్తం.. ఊపిరి ద్వారా ఆక్సిజన్‌ అందాలన్నా.., శరీరానికి శక్తి రావాలన్నా.., అవయవాలను పనిచేయించే హార్మోన్లు వాటిని చేరుకోవాలన్నా.., రోగ నిరోధక శక్తి ఉండాలన్నా.. కావలసిన అత్యంత ముఖ్యమైన కణజాలం. ఈ రక్తాన్ని శరీర భాగాల నుంచి గుండె, ఊపిరితిత్తులకు.., ఊపిరితిత్తుల నుంచి గుండె, ఇతర శరీర అవయవాలకు నిరంతరం ప్రసరింపచేసేవి రక్తనాళాలు. ఒక్కమాటలో చెప్పాలంటే శరీరంలోని అవయవాలన్నింటికీ రక్తాన్ని చేరవేసే అనుసంధానకర్తలు రక్తనాళాలు. శరీర భాగాల నుంచి చెడు రక్తాన్ని (ఆక్సిజన్‌ లేని) ఊపిరితిత్తులకు చేర్చాలన్నా, ఊపిరితిత్తుల నుంచి మంచి రక్తాన్ని (ఆక్సిజన్‌ ఉన్న) శరీర భాగాలకు అందించాలన్నా కీలకమైనవి రక్తనాళాలు. కాని మన అలవాట్ల వల్ల ఇవి దెబ్బతింటున్నాయి. మంచి రక్తాన్ని తీసుకెళ్లే ధమనులైనా, చెడు రక్తాన్ని పంపించే సిరలైనా.. ఏవైనా సమస్యల్లో పడొచ్చు. అంతేకాదు.. శోషరస వ్యవస్థలోని నాళాలు, గ్రంథులు కూడా సమస్యలకు లోనవ్వొచ్చు. ఈ అన్ని రకాల సమస్యలకు చికిత్సనందించే డాక్టర్లే వాస్కులర్‌ సర్జన్లు. 

సమస్యలివీ..

రక్తనాళ సంబంధ సమస్యలు రెండు రకాలు. ధమనుల్లో వచ్చే సమస్యలు, సిరల్లో వచ్చే సమస్యలు. ధమనుల్లో సమస్యలు వృద్ధులైనవాళ్లు, డయాబెటిస్‌ ఉన్నవాళ్లలో ఎక్కువగా కనిపిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్థుల్లో కనిపించే డయాబెటిక్‌ ఫూట్‌ లేదా గ్యాంగ్రిన్‌ సమస్య ఈ కోవలోదే. పెరిఫెరల్‌ రక్తనాళాల్లో (చర్మం కింద ఉపరితల రక్తనాళాల్లో) వచ్చే వేరికోస్‌ వీన్స్‌, కాలు లోపల లోతుగా ఉండే రక్తనాళాల్లో కనిపించే డీప్‌ వీన్‌ థ్రాంబోసిస్‌ సమస్యలు సిరల్లో కనిపించే వ్యాధులు. 

డయాబెటిక్‌ ఫూట్‌

డయాబెటిస్‌ ఉన్నవాళ్లలో డయాబెటిక్‌ ఫూట్‌ వచ్చి అది గ్యాంగ్రిన్‌గా మారుతుంది. డయాబెటిస్‌ అదుపు తప్పినప్పుడు, దీంతో పాటు రక్త ప్రసరణ కూడా తగ్గిపోయి డయాబెటిక్‌ న్యూరోపతి వస్తుంది. నరాలు సమస్యకు లోనవడం వల్ల స్పర్శ జ్ఞానం కూడా తగ్గుతుంది. ఇలాంటప్పుడు చిన్న పెద్ద తాకినా పెద్ద దెబ్బ అవుతుంది. డయాబెటిక్‌ న్యూరోపతి ఉన్నవాళ్లకు చర్మం పొడిబారిపోయి పెళుసులుగా పగిలిపోతుంది. ఇది కాస్తా పుండుగా మారుతుంది. దీన్నే డయాబెటిక్‌ ఫూట్‌ అంటారు. పుండు పెద్దదైనప్పుడు గ్యాంగ్రిన్‌గా మారుతుంది. సాధారణంగా మోకాలి కింది భాగంలోని కాలులోనే ఈ సమస్య ఎదురవుతుంది. డయాబెటిక్‌ ఫూట్‌ సమస్య ముందుగా వేలి నుంచి మొదలై పైకి వ్యాపిస్తుంది. డయాబెటిస్‌ ఉన్నవాళ్లలో రక్తప్రసరణ తక్కువగా ఉండడం వల్ల ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించి కాలు తీసేయాల్సిన పరిస్థితి ఉంటుంది. డయాబెటిస్‌తో పాటు ఇలా పెరిఫెరల్‌ వాస్కులర్‌ డిసీజ్‌ ఉంటే ఇన్‌ఫెక్షన్‌ రిస్కు పెరుగుతుంది. అందుకే చిన్న పుండు పెద్దదై గ్యాంగ్రీన్‌ ఏర్పడుతుంది. దాంతో కాలు తీసేయాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. 

లక్షణాలు

  • నడుస్తుంటే నొప్పి ఉంటుంది. అందువల్ల నాలుగడుగులు వేసి మళ్లీ కాసేపు ఆగి, తరువాత నడుస్తుంటారు. ఇలా నడిస్తే నొప్పి రావడాన్ని క్లాడికేషన్‌ పెయిన్‌ అంటారు. వీళ్లకు రెస్ట్‌లో ఉంటే నొప్పి ఉండదు. నడిస్తేనే నొప్పి వస్తుంది. నడిచినప్పుడు కాళ్లకు రక్తసరఫరా పెరగాలి. కానీ రక్తప్రసరణ తక్కువగా ఉండడం వల్ల సరఫరా పెరుగదు. అందువల్ల నొప్పి వస్తుంది. 
  • దీని తరువాత దశలో నడవకుండా రెస్ట్‌లో ఉన్నప్పుడు కూడా నొప్పి వస్తుంది. దీన్ని రెస్ట్‌ పెయిన్‌ అంటారు. 
  • డిస్కలరేషన్‌. అంటే చర్మం రంగు మారడం. ముందుగా కాలి వేలు నల్లగా మారుతుంది. ఆ తరువాత పుండు కనిపిస్తుంది. దీన్ని గ్యాంగ్రిన్‌ అంటారు. ఈ రెండు వేలు నల్లగా మారడం, పుండు ఏర్పడడం ఒకటి తరువాత ఒకటి కనిపించొచ్చు. లేదా ఒకేసారి రెండు లక్షణాలూ ఉండొచ్చు. 
  • 30 నుంచి 40 శాతం డయాబెటిస్‌ పేషెంట్లలో రక్త ప్రసరణ తక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్‌ వల్ల రక్తనాళాల్లో బ్లాక్స్‌ ఏర్పడేందుకు ఆస్కారం ఎక్కువ. అందుకే వాళ్లలో రక్తప్రసరణ తగ్గుతుంది. 
  • డయాబెటిస్‌ ఉన్నవాళ్లలో కాలు నొప్పి, మంటగా అనిపించడం, రెస్ట్‌ పెయిన్‌, చర్మం రంగు మారి కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను వాస్కులర్‌ స్పెషలిస్టును కలవాలి. 

చికిత్స

ముందు క్లినికల్‌ పరీక్షలు చేస్తారు. కాలిలో రక్తసరఫరాను తెలుసుకోవడానికి కాలికి కలర్‌ డాప్లర్‌ స్కాన్‌ చేస్తారు. ప్రెజర్‌ స్టడీస్‌ కూడా చేస్తారు. సమస్య తీవ్రంగా ఉంటే ఆంజియోగ్రామ్‌ చేసి తీవ్రతను బట్టి మందులా, సర్జరీయా అనేది నిర్ణయిస్తారు. రక్తనాళంలో ఏర్పడిన క్లాట్‌ చిన్నగా, పొడవు తక్కువగా ఉంటే స్టెంట్‌ వేస్తారు. పెద్దగా, పొడవుగా ఉంటే బైపాస్‌ సర్జరీ చేస్తారు. ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స చేస్తే కాలు తీసేయాల్సిన పరిస్థితి రాకుండా 60 శాతం వరకు నివారించవచ్చు. ఒకవేళ కాలు తీసేస్తే జీవితాంతం చికిత్సలో భాగంగా మందులు వాడాలి. ఇంకో కాలికి సమస్య రాకుండా ఫాలోఅప్‌, మెడిసిన్‌ తీసుకోవాలి. 

వేరికోస్‌ వీన్స్‌

ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిల్చుని చేసే ఉద్యోగాల్లో ఉన్నవాళ్లకు వేరికోస్‌ వీన్స్‌ సమస్య వస్తుంది. ఐటి ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, ట్రాఫిక్‌ పోలీస్‌లు, టీచర్లు, సెక్యూరిటీ గార్డుల వంటి ఉద్యోగాల్లో ఉండేవాళ్లకు వేరికోస్‌ వీన్స్‌ వచ్చే అవకాశం ఎక్కువ. 

ఎందుకొస్తుంది?

సిరల్లో రక్తం గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా శరీరం కింది భాగం నుంచి పై భాగానికి ప్రయాణిస్తుంది. అందుకే రక్తం తిరిగి కిందికి రాకుండా ఉండడం కోసం సిరల్లో కొన్ని కవాటాలు ఉంటాయి. ఈ కవాటాలు డ్యామేజి అయినప్పుడు వేరికోస్‌ వీన్స్‌ సమస్య వస్తుంది. నిరంతరం నిల్చుని, కూర్చుని ఉండేవాళ్లలో ఇలాంటి రిస్కు ఉంటుంది. కొన్నిసార్లు ఈ సమస్య 10 శాతం మందిలో వంశపారంపర్య కారణాల వల్ల కూడా రావొచ్చు. 15 ఏళ్ల కన్నా చిన్నవయసు వాళ్లలో రావడం చాలా అరుదు. 

లక్షణాలు

  • కాలు నొప్పి, కాలు వాచిపోతుంది. 
  • మజిల్‌ క్రాంప్స్‌. కండరం లాగినట్టుగా ఉంటుంది. 
  • చర్మంలో మార్పులు వస్తాయి. చర్మం కింద ఉండే రక్తనాళాలు బలహీనమై, ఉబ్బిపోతాయి. అందువల్ల అవి చర్మం పై నుంచి స్పష్టంగా కనిపిస్తాయి. 
  • ఈ లక్షణాల్లో ఏదో ఒకటి ఉన్నా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక నొప్పి, కాలి వాపు, రక్తనాళాలు పైకి కనిపించడం, చర్మంలో మార్పులు, పదే పదే పుండ్లు ఏర్పడి ఎంతకీ తగ్గకపోవడం లాంటి సమస్యల్లో ఏది ఉన్నా వెంటనే డాక్టర్‌ని కలవాలి. నొప్పి ఉన్నా లేకపోయినా డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. 

చికిత్స ఏంటి?

వ్యాధి నిర్ధారణ కోసం ముందుగా క్లినికల్‌గా పరీక్ష చేస్తారు. తరువాత కలర్‌ డాప్లర్‌ స్కాన్‌ చేస్తారు. ఈ స్కాన్‌లో వ్యాధి ఏ దశలో ఉందో తెలుస్తుంది. తొలి దశలో ఉన్నప్పుడు మందులు ఇస్తారు. తరువాతి దశల్లో సర్జరీ, ఇతర చికిత్సలు అవసరం అవుతాయి. వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు సర్జరీ ద్వారా రక్తనాళాలను ఓపెన్‌ చేసి చెడిపోయిన కవాటాన్ని తొలగిస్తారు. ఓపెన్‌ సర్జరీ లేకుండా లేజర్‌ కాంతి పంపించి చెడిపోయిన కవాటం ఉన్నచోట రక్తనాళాన్ని మూసివేస్తారు. గ్లూ ఇంజెక్షన్‌ థెరపీ ద్వారా కూడా ఓపెన్‌ అయిన రక్తనాళాన్ని బ్లాక్‌ చేయడం ద్వారా మూసివేస్తారు. 

ఓపెన్‌ సర్జరీ అయితే రెండు మూడు రోజులు హాస్పిటల్‌లో ఉండాల్సి వస్తుంది. ఆపరేషన్‌ తరువాత రెండు వారాలు పూర్తిగా విశ్రాంతిగా ఉండాలి. ఈ ఆధునిక చికిత్సలు పూర్తిగా డే కేర్‌ ప్రొసిజర్లుగా చేస్తారు. ఇవి ఓపెన్‌ సర్జరీ కాదు కాబట్టి రక్తస్రావం ఎక్కువగా ఉండదు. వీటికి జనరల్‌ అనెస్తీషియా అవసరం లేదు. లోకల్‌ అనెస్తీషియా చాలు. కాబట్టి చికిత్స తరువాత వెంటనే ఇంటికి వెళ్లిపోవచ్చు. విశ్రాంతి కూడా అవసరం లేదు. కాకపోతే కాళ్ల మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. 

ఈ చికిత్సల ద్వారా వేరికోస్‌ వీన్స్‌ని పూర్తిగా నయం చేయవచ్చు. అయితే ఆ తరువాత జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువసేపు కూర్చోవడం గానీ, నిల్చోవడం గానీ చేయొద్దు. మధ్య మధ్యలో కాళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. లేదా అటూ ఇటూ నడవాలి. పడుకునేటప్పుడు కాళ్ల దగ్గర దిండు పెట్టుకుని దానిమీద కాళ్లు ఉంచాలి. అంటే కాళ్లను కొంచెం పైకి పెట్టుకుంటే కాళ్లలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. 

డీప్‌ వీన్‌ థ్రాంబోసిస్‌ (డివిటి)

సిరల్లో రక్తం గడ్డలు (క్లాట్స్‌) ఏర్పడడాన్నే డీప్‌ వీన్‌ థ్రాంబోసిస్‌ లేదా డివిటి అంటారు. వయసు పెరిగిన వాళ్లకు, ఏదైనా సర్జరీ చేయించుకున్న తరువాత, రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు, క్యాన్సర్‌ పేషెంట్లలో ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కొందరిలో చిన్న వయసులో కూడా డివిటి రావొచ్చు. ఇందుకు కారణం జన్యుపరమైనది. జన్యులోపం వల్ల రక్తంలోని క్లాటింగ్‌ ఫ్యాక్టర్లు (రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే కారకాలు) ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో గడ్డలు ఏర్పడే సమస్య ఉంటుంది. ఇలాంటివాళ్లలో కూడా డీప్‌ వీన్‌ థ్రాంబోసిస్‌ కనిపిస్తుంది. 

లక్షణాలు

ఆరోజు రాత్రి బాగానే ఉంటారు. తెల్లవారి లేచి చూసేసరికి కాలు అంతా వాచిపోయి కనిపిస్తుంది. వాపుతో పాటు నొప్పి ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. సాధారణంగా మోకాలి కింద ఇలాంటి సమస్య వస్తుంది. అయితే కాలు మొత్తం లేదా చేతిలో కూడా ఇలా వాపు రావొచ్చు. ఇలా అకస్మాత్తుగా వాపు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ను కలవాలి. ఎందుకంటే కొన్నిసార్లు లోపల ఏర్పడిన గడ్డ (క్లాట్‌) హఠాత్తుగా చిట్లిపోవచ్చు. అలా బ్రేక్‌ అయిన గడ్డలు ఊపిరితిత్తులకు చేరి లంగ్‌ అటాక్‌ రావొచ్చు. దీన్నే లంగ్‌ ఎంబోలిజమ్‌ అంటారు. ఇది అత్యవసర పరిస్థితి. కాబట్టి ఈ సమస్యను అశ్రద్ధ చేయొద్దు. ఇలా సడెన్‌గా కనిపించే సమస్యను అక్యూట్‌ డివిటిగా పరిగణిస్తారు. అక్యూట్‌ డీప్‌ వీన్‌ థ్రాంబోసిస్‌ని నిర్లక్ష్యం చేస్తే క్రానిక్‌ డివిటికి దారితీస్తుంది. దీనివల్ల అల్సర్లు ఏర్పడుతాయి. ఈ పుండ్లు మానకుండా ఎక్కువ అవుతాయి. డివిటిని నిర్లక్ష్యం చేసిన వాళ్లలో కాలు వాపు, నొప్పితో పాటు ఇలా మానని పుండ్లు ఏర్పడితే ఆ స్థితిని పోస్ట్‌ థ్రాంబోటిక్‌ సిండ్రోమ్‌గా వ్యవహరిస్తారు. 

నిర్ధారణ

డివిటిని నిర్ధారణ చేయడానికి కలర్‌ డాప్లర్‌ స్కాన్‌ చేస్తారు. ఈ స్కాన్‌లో రక్తం గడ్డ ఎక్కువుందా, తక్కువుందా, ఏ స్థాయిలో ఉందనేది తెలుస్తుంది. క్లాట్‌ ఎక్కువగా ఉంటే థ్రాంబోలైసిస్‌ చేస్తారు. తీవ్రత తక్కువగా ఉంటే యాంటి కోయాగ్యులెంట్‌ (రక్తాన్ని పలుచబరిచే మందులు) ఇంజెక్షన్లు, టాబ్లెట్లు ఇస్తారు. చికిత్స కొంచెం కష్టమైనప్పటికీ సమస్యను ఎంత తొందరగా గుర్తించి చికిత్స చేస్తే ఫలితం అంత బాగుంటుంది. మెడికల్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తూ, వీనోగ్రామ్‌ ద్వారా డీప్‌ వీన్‌ స్టెంటింగ్‌ చేస్తారు. అంటే గుండె రక్తనాళంలో బ్లాక్స్‌ ఏర్పడినప్పుడు స్టెంట్‌ వేసి సరిచేసినట్టుగా, కాలి రక్తనాళంలో ఏర్పడిన క్లాట్‌ను తొలగించడానికి కూడా స్టెంట్‌ వేస్తారు. దీన్నే వీనోగ్రామ్‌ అంటారు. 

ప్రమాదంలో గాయపడితే.. 

రోడ్డు ప్రమాదాల్లో గాయపడినప్పుడు మోకాలిలో ఫ్రాక్చర్లు అయ్యే అవకాశం ఉంటుంది. రక్తనాళాలకు గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటప్పుడు ప్రాణాపాయం ఉంటుంది. పేషెంటును కాపాడడానికి వాస్కులర్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తారు. అంటే గాయపడిన రక్తనాళాన్ని తీసేసి, దాని స్థానంలో మరో రక్తనాళాన్ని అమరుస్తారు. ఈ కొత్త రక్తనాళాన్ని చర్మం కింద ఉపరితల భాగాల్లో ఉండే సిరల నుంచి తీసుకుంటారు. ఈ సిరను తీసుకెళ్లి ధమని స్థానంలో అమరుస్తారన్నమాట. ఈ చికిత్స వల్ల కాలు, చేయి తొలగించాల్సిన పరిస్థితిని నివారించవచ్చు. ప్రాణాపాయం నుంచి రక్షించవచ్చు.  కిడ్నీ ఫెయిల్యూర్‌ పేషెంట్లలో రెగ్యులర్‌గా డయాలసిస్‌ చేయాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు అవసరమయ్యే ఎవి ఫిస్టులాలు, పర్మనెంట్‌ కెథటర్లను అమర్చడంలో కూడా వాస్కులర్‌ సర్జన్లు కీలక పాత్ర పోషిస్తారు. 

క్యాన్సర్‌ పేషెంట్లలో...

శరీరంలోని శోషరస వ్యవస్థలో సమస్యలనే లింఫాటిక్‌ సమస్యలంటారు. సాధారణంగా లింఫ్‌ ఎడిమా సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ప్రైమరీ లింఫ్‌ ఎడిమా, సెకండరీ లింఫ్‌ ఎడిమా అని రెండు రకాలుగా ఉంటుంది. పుట్టుకతోనే జన్యుపరమైన కారణాల వల్ల వచ్చేది ప్రైమరీ లింఫ్‌ ఎడిమా. వీళ్లకు పుట్టుకతో శోషరస నాళం అభివృద్ధి చెందకపోవడమో (అప్లేషియా), లేక చిన్నగా ఉండడమో (హైపోప్లేషియా) జరుగుతుంది. దీనివల్ల లింఫాటిక్‌ ఎడిమా కనిపిస్తుంది. సెకండరీ లింఫ్‌ ఎడిమాకు మరేదైనా సమస్య కారణమవుతుంది. అంటే ఫైలేరియా ఇన్‌ఫెక్షన్‌, క్యాన్సర్‌ పేషెంట్లకు ఇచ్చే చికిత్స, సర్జరీ తరువాత ఈ సమస్య కనిపించవచ్చు. ఉదాహరణకు రొమ్ము క్యాన్సర్‌ ఉన్నవాళ్లకు సర్జరీ తరువాత, రేడియోథెరపీ అయినాక చేతిలో లింఫ్‌ ఎడిమా కనిపించొచ్చు. లింఫ్‌ గ్రంథులు వాచిపోవడం వల్ల చేయంతా వాపు కనిపిస్తుంది. సర్వికల్‌ క్యాన్సర్‌, గర్భసంచి క్యాన్సర్‌ లాంటి పెల్విక్‌ క్యాన్సర్ల చికిత్స తరువాత కాలిలో లింఫ్‌ ఎడిమా కనిపిస్తుంది. వీళ్లలో కాలు వాపు ఉంటుంది. లింఫ్‌ ఎడిమా సమస్య ఉన్నప్పుడు ముందుగా మందులు ఇస్తారు. మందులే కాకుండా కంప్రెషన్‌ బ్యాండేజ్‌ థెరపీ ద్వారా కూడా చికిత్స చేస్తారు. లింఫ్‌ ఎడిమా పంపు కూడా ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తున్నది. 


logo