వేసవిలో పిల్లలకు తరచూ ముక్కునుంచి రక్తం కారడం గమనిస్తుంటాం. ఇలాంటప్పుడు పెద్దలు చాలా ఆందోళన చెందుతుంటారు. ఏదో జరిగిపోయిందని భయపడుతుంటారు. కానీ, అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనికి చాలా సందర్భాల్లో ఈ సమస్య తేలికగానే పరిష్కారం అవుతుంది. ముక్కునుంచి రక్తం కారడం అన్నది అనేక వ్యాధులలో కనిపించే ఒక ప్రాథమిక లక్షణం. అంతేకానీ, దానంతట అది ఓ వ్యాధి కాదు. ముక్కు దూలం కింది, ముందు భాగంలో చిన్నచిన్న రక్తనాళాలు అనేకం ఒక దానితో ఒకటి కలిసిపోతాయి. దీన్ని ‘లిటిల్స్ ఏరియా’ అంటారు. ఇవి చాలా మృదువుగా ఉంటాయి. మనం పీల్చిన గాలి మొదట ఈ భాగానికే తాకుతుంది. దీంతో వాతావరణంలోని మార్పుల దుష్ర్పభావం ఇక్కడే తీవ్రంగా ఉంటుంది.
రకరకాల కారణాలవల్ల ముక్కునుంచి రక్తం కారుతుంది. కొన్నిసార్లు ఒకవైపు నుంచే కారుతుంది. మరికొన్నిసార్లు రెండువైపుల నుంచీ కారవచ్చు. ఈ సమస్య ఏడాదిలోపు చిన్నారుల్లో చాలా అరుదు. స్కూలు వయసున్న పిల్లల్లో తరచుగా కనిపిస్తుంది. యుక్తవయసు రాగానే తగ్గిపోతుంది. పిల్లల్లో ముక్కునుంచి వచ్చే రక్తం నోట్లోకి వెళ్లి కొన్నిసార్లు వాంతిరూపంలో బయటకు వచ్చేస్తుంటుంది. కడుపులోకి వెళ్లే రక్తం మలం ద్వారా బయటకు వెళ్తుంది.
కారణాలు:
పిల్లలు తరచుగా ముక్కులో వేలు పెట్టి గిల్లడం వల్ల రక్తనాళాలు చిట్లి రక్తం కారుతుంది. ఇతర గాయాలు, ముక్కుకు వచ్చే ఇన్ఫెక్షన్స్ జలుబు, సైనుసైటిస్, బలంగా ముక్కు చీదడం, ముక్కులో పెన్సిళ్లు, రబ్బర్లు, పుల్లలు పెట్టుకోవడం, ఎడినాయిడ్, తీవ్రమైన చలి, వేడి, ముక్కులో కండరం పెరగడం (పాలిప్), మీజిల్స్, టైఫాయిడ్, రక్త సంబంధ వ్యాధులలోకూడా ముక్కునుంచి రక్తం కారుతుంది.
వైద్యం:
చాలాసార్లు ఈ సమస్య దానంతటదే ఆగిపోతుంది. అలా ఆగనప్పుడు రక్తం కారుతున్నవైపు ముక్కును బొటనవేలితో ఐదు నిమిషాలపాటు నొక్కి మూసి వేయాలి. తల కొంచెం ముందుకు వంచడం వల్ల రక్తం నోట్లోకి వెళ్లకుండా ఆపవచ్చు. కడుపులోకి వెళ్లకుండా ఉండాలంటే రక్తం ఆగే వరకు పిల్లలను పడుకోకుండా చూసుకోవాలి. ముక్కు దగ్గరగా ఐస్పెట్టి గాలి పీల్చడం, ముక్కుచుట్టూ ఐస్‌బ్యాగ్ ఉంచడం, నోటితో గాలి పీల్చడం వల్ల రక్తం కారడం త్వరగా ఆగిపోతుంది. వాతావారణం వేడిగా ఉన్నప్పుడు గదిని చల్లగా ఉంచడం, ముక్కులో స్లైన్ డ్రాప్స్ వేయడం చేయాలి. ఇన్ని ప్రయత్నాలు చేసినా రక్తం కారడం ఆగకపోతే, నోస్ స్పెషలిస్ట్ డాక్టర్‌ను సంప్రదించాలి. మందులతోనూ సమస్య పరిష్కారం కానప్పుడు వైద్యులు ముక్కులోని రక్తనాళాలపై ఒత్తిడి కలిగేలా పాక్ చేయడం గాని, కాటరీ వైద్యం గాని చేస్తారు. పిల్లల గోళ్లు పెరగకుండా తరచూ కత్తిరించడం మంచిది.
డాక్టర్ కర్రా రమేష్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు