అద్భుతమైన స్వరం.. సందర్భోచిత గాంభీర్యం.. భాషపై పట్టు.. ఉచ్ఛ్చారణలో స్పష్టతకు కాస్త శిక్షణ తోడైతే చాలు జీవితంలో తమకంటూ ప్రత్యేకతను సాధించుకోవచ్చు. నాటకం, రేడియో, టీవీ, సినిమా మాధ్యమం ఏదైనా కావొచ్చు తెరవెనుక స్వరంలో నుంచి జాలువారుతున్న స్క్రిప్టులోని అక్షరాలతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేయవచ్చు. అందం, తెలివితేటలు, అనుభవం అవసరం లేదు..భాషను పలకడం, పాడటం వస్తే చాలు వెన్నుతట్టి ప్రోత్సహిస్తామంటున్నది తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ. ఔత్సాహిక స్వరమాంత్రికుల ప్రతిభకు సానపెట్టి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నది.
నేటి ఆధునిక సాంకేతిక యుగంలో యూట్యూబ్ చానల్స్, లోకల్ చానల్స్ ప్రసారాలతో ఎంతో మంది స్వరమాంత్రికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పుకోవచ్చు. భాష మీద పట్టు, ఉచ్ఛారణలో స్పష్టత, భావ గాంభీర్యం తోడైతే సులువుగా ఈ రంగంలో రాణించడంతోపాటు ఆర్థికంగా నిలదొక్కుకోవడం అంతే సులభం. వినోద, విజ్ఞాన కార్యక్రమాలు, పల్లెలోని వింతలు, విశేషాలు, ప్రభుత్వ పథకాల విశ్లేషణ, సినీ నటుల స్వరాన్ని అనుకరించి డబ్బింగ్ చెప్పడం తదితర అంశాలను చెప్పటమే స్వరమాంత్రికుల ప్రత్యేకత. టెక్నాలజీ విప్లవంతో ఆధునికతకు తగ్గట్లుగా కొత్త హంగులతో వస్తున్న వివిధ చానెళ్లు, డబ్బింగ్ సీరియళ్లు, సినిమాలతో నేటి యువతకు అవకాశాలు మెండుగానే ఉన్నాయి.
తెలుగు, ఆంగ్ల భాషల్లో కొనసాగిన వాయిస్ ఓవర్, డబ్బింగ్, వాయిస్ యాక్టింగ్ శిక్షణకు ఉభయ తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాల నుంచి దరఖాస్తులు వెల్లువగా వచ్చాయి. ఔత్సాహికుల స్వరాన్ని, అర్హతలను పరిగణనలోకి తీసుకుని 24 మందిని శిక్షణకు ఎంపిక చేశారు. ఈ శిక్షణకు రమేశ్ కిషన్ గౌడ్‌తోపాటు తెలుగు భాషా పదాల ఉచ్చారణ తదితర విషయాలపై సమగ్రమైన శిక్షణను పాలకుర్తి సాకేతరాం శర్మ, శ్రీశ్రీ మహాప్రస్థానంపై మామిడి హరికృష్ణ కవితా సంకలనాలను తనదైన శైలిలో చదివి అభ్యర్థులకు మెళకువలను నేర్పారు. అంతర్జాతీయ యోగా థెరపిస్టు, యోగాగురువు షణ్ముక శివచంద్ర శ్వాసకు, ధ్వనికి, ఉచ్ఛారణకు యోగా ఎంత అవసరమో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రథమ మహిళా సౌండ్ ఇంజినీర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత డాక్టర సాజిదాఖాన్ సౌండ్ రికార్డింగ్, స్టూడియోలో టెక్నికల్ విషయాలపై సమగ్రంగా వివరించారు. ప్రముఖ డబ్బింగ్, వాయిస్ ఆర్టిస్ట్ కృష్ణవేణి వాయిస్ కల్చర్, పాజ్, పిచ్, వాల్యూమ్, స్పష్టత, లౌక్యం విషయాలను బోధించారు.
వాయిస్ యాక్టింగ్, డబ్బింగ్, వాయిస్ ఓవర్ అంశాలపై తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ప్రథమంగా శిక్షణ చేపట్టి తెలంగాణ థియేటర్ అండ్ మీడియా రిపర్టరీకి తోడ్పాటును అందించింది. ఇటీవల కాలంలో డబ్బింగ్ సీరియళ్లు, సినిమాలు వస్తున్న తరుణంలో యువతకు కొత్త ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నవరసాలను గొంతులోనుంచి పలికించే క్లిష్టమైన ప్రక్రియ వాయిస్ ఓవర్. ప్రసార మాధ్యమాలు, యూట్యూబ్ చానెళ్లు తదితర కమ్యూనికేషన్ విభాగం పెరిగిపోతున్న తరుణంలో ఔత్సాహికులకు శిక్షణ తోడైతే వారు మరింతగా రాణించవచ్చు. కరోనా కాలంలోనూ ఔత్సాహికులకు అవకాశం కల్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేశాం. -మామిడి హరికృష్ణ, భాషా సాంస్కృతిక శాఖ
భాష మీద పట్టు, ఉచ్ఛారణ స్పష్టతలో ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వాలని తెలంగాణ థియేటర్ అండ్ మీడియా రిపర్టరీ వ్యవస్థాపకుడు రమేశ్ కిషన్ గౌడ్ సంకల్పానికి భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తోడ్పాటును అందించారు. మట్టిలోని మాణిక్యాలను వెలికితీసి వారి ప్రతిభకు పదును పెట్టారు. మంచి స్వరం ఉండి అవకాశాలను అందిపుచ్చుకోలేని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన యువతను ఈ శిక్షణకు ఎంపిక చేశారు. కరోనా కాలంలో ప్రత్యక్ష తరగతులకు హాజరుకావడం సాధ్యంకాకపోవడంతో 30రోజుల శిక్షణా కాలాన్ని ఎంచుకొని 20రోజులు ఆన్లైన్ ద్వారా, 10రోజులు స్టూడియోలో ప్రాక్టికల్స్ చేపట్టి వారిలోని సృజనాత్మకతకు మెరుగులు దిద్దారు. వాయిస్ యాక్టింగ్, డబ్బింగ్, వాయిస్ ఓవర్ అంశాలపై వాచికాభినయం సిలబస్‌ను నిర్ధిష్టమైన ప్రణాళికతో రూపొందించారు.
టీవీల్లో, పత్రికల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్‌లుగా రాణించాలనుకునే వారికి అవకాశం అంటూ ప్రకటనలు చూసి అనేక సార్లు ఫోన్ చేశాను. వేలల్లో ఫీజలు చెల్లించాలని అనడంతో కట్టలేని స్థోమత. పాటలు పాడటం, ఇతరుల మాటలను అనుకరించడం వంటివి రోజూ చేస్తుండేవాడిని. ఎలాగైనా శిక్షణ తీసుకుని వాయిస్ ఓవర్,డబ్బింగ్లో రాణించాలనే కోరిక బలంగా ఉండేది. భాషా సాంస్కృతిక శాఖ ప్రకటనను చూసి, హైదరాబాద్‌కు వెళ్లకుండా ఆన్లైన్లోనే తరగతులకు హాజరయ్యా. 20రోజులు ఆన్లైన్ ద్వారా మెళకువలు నేర్పారు. 10రోజుల పాటు స్టూడియోలో ప్రాక్టీస్ చేశాం. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా రాణిస్తాననే నమ్మకం పెరిగింది.- మహేశ్, సూర్యాపేట
చిన్నప్పటి నుంచి పాటలు పాడే అలవాటు ఉండేది. అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే పెండ్లి అయ్యింది. పిల్లలు కుటుంబపరమైన భారంతో గాయనీగా, డబ్బింగ్ అర్టిస్ట్‌గా రాణించలేకపోయాననే భాద ఉండేది. ప్రైవేట్ టీచర్‌గా పని చేస్తున్నా. కరోనా మూలంగా పాఠశాలలు మూసివేయడంతో సమయాన్ని సద్వినియోగం చేసుకున్నా. పాటలు పాడడం, డబ్బింగ్ చెప్పడం ఓ ఫ్యాషన్‌గా ఉన్న నాకు ఈ శిక్షణ తరగతులు ఆ లోటును భర్తీ చేశాయి. నాలోని ప్రతిభతో జీవితంలో స్థిరపడాలనే నమ్మకం మరింతగా పెరిగింది. – కళావతి, ప్రైవేట్ టీచర్ (భద్రాచలం)
నిరంతర సాధనతోపాటు శిక్షకుల పర్యవేక్షణలో మెళకువలు నేర్చుకుంటే డబ్బింగ్లో రాణించవచ్చు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాంకేతికత పెరిగిన నేపథ్యంలో మధురమైన స్వరం సొంతమైతే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా స్థిరపడేందుకు ఇది ఒక మంచి సాధనం. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నా ఆలోచనకు తోడ్పాటును అందించి ఎంతో మందికి బాసటగా నిలిచింది. శిక్షణకు 600 మంది దరఖాస్తు చేసుకోగా వడకట్టి 24మందిని ఎంపిక చేశాం. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందిస్తున్నాం. వాచికాభినయంలో శిక్షణ పొందిన వారికి టీవి, సినిమాలు, ప్రసార మాధ్యమాలలో మంచి అవకాశాలు, ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. – రమేశ్ కిషన్‌గౌడ్, తెలంగాణ థియేటర్ అండ్ మీడియా రిపర్టరీ అధ్యక్షుడు