శుక్రవారం 30 అక్టోబర్ 2020
Health - Oct 16, 2020 , 16:26:45

మన శరీరానికి క్రోమియం ఎందుకు అవసరమో తెలుసా..?

మన శరీరానికి క్రోమియం ఎందుకు అవసరమో తెలుసా..?

హైదరాబాద్ : మన శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాల్లో క్రోమియం కూడా ఒకటి. ఇది మినరల్స్ జాబితాకు చెందుతుంది. క్రోమియం వల్ల మన శరీరానికి అనేక ఉపయోగాలు ఉంటాయి. దీంతో శరీరంలోని క్లోమగ్రంథి విడుదల చేసే ఇన్సులిన్‌ను శరీరం సరిగ్గా ఉపయోగించుకుంటుంది. ఈ క్రమంలో టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. అలాగే మహిళల్లో రుతుక్రమం సరిగ్గా అవుతుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. అధిక బరువు తగ్గుతారు.

ఇక మనకు క్రోమియం అనేక పదార్థాల్లో లభిస్తుంది. ఆపిల్స్, అవకాడో, టమాటాలు, పిస్తా పప్పు, బ్రొకొలి, పసుపు, డార్క్ చాకొలెట్లు, గ్రీన్ టీ తదితర ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల మన శరీరానికి క్రోమియం అందుతుంది. 6 నెలల వయస్సు లోపు ఉన్న చిన్నారులకు నిత్యం 0.2 మైక్రోగ్రాముల క్రోమియం అవసరం. అదే 7-12 నెలల వయస్సు ఉన్న వారికి 5.5 మైక్రోగ్రాములు, 1-3 వయస్సుల వారికి 11 మైక్రోగ్రాములు, 4-6 వయస్సు వారికి 15 మైక్రోగ్రాములు, 9 - 13 ఏళ్ల వారికి 25 మైక్రోగ్రాములు, 14 నుంచి 50 ఏళ్ల లోపు వారికి 35 మైక్రోగ్రాముల క్రోమియం నిత్యం అవసరం అవుతుంది. అదే మహిళలకు అయితే 21 నుంచి 25 మైక్రోగ్రాముల వరకు, గర్భిణీలకు 30 మైక్రోగ్రాములు, పాలిచ్చే తల్లులకు 45 మైక్రోగ్రాముల వరకు నిత్యం క్రోమియం అవసరం అవుతుంది. ఇక వైద్యుల సలహాతో క్రోమియం ట్యాబ్లెట్లను కూడా తీసుకోవచ్చు. దీంతో క్రోమియం లోపం రాకుండా చూసుకోవచ్చు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.