శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - Sep 01, 2020 , 20:01:17

గర్భిణీలకు మేలు చేసే గుమ్మడికాయ !

 గర్భిణీలకు మేలు చేసే గుమ్మడికాయ !

హైదరాబాద్: గర్భిణీలు ఏది తినాలన్నా పదిసార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో తినే ఆహారం లోపల ఉండే శిశువు మీద  ఎటువంటి ప్రభావం చూపిస్తుందనే సందేహం కలుగుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో  గుమ్మడికాయ తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఇది అధిక పోషకాలు కలిగిన కూరగాయ. గర్భధారణ సమయంలో గుమ్మడికాయ లేదా దాని విత్తనాలను తినడం వల్ల కడుపు తిమ్మిరిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఇనుము, కాల్షియం, నియాసిన్, భాస్వరం ఉంటాయి. తల్లికీ ,బిడ్డకు  అవసరమైన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. గుమ్మడికాయలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటుంది.

ఇది గర్భిణీ స్త్రీల జీర్ణక్రియకు సహాయపడుతుంది. ప్రేగు కదలికలు సరిగా లేకపోవడం వల్ల మలబద్దకాన్ని నివారిస్తుంది. గుమ్మడికాయ తినడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. గుమ్మడికాయ కొంతమందిలో అలెర్జీని కలిగిస్తుంది. పెద్ద మొత్తంలో గుమ్మడికాయను తిన్నప్పుడు తలనొప్పి, కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలను కలిగించే మార్గాలు ఉన్నాయి. కాబట్టి మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

  గర్భధారణ సమయంలో గుమ్మడికాయ తినడం వల్ల ప్రేగులలోని పురుగులను తొలగించి కడుపును శుభ్రపరుస్తుంది. దురద , తామర వంటి వాటిని తగ్గిస్తుంది. గర్భధారణ సమయంలో వచ్చే కడుపు నొప్పిని కూడా నిర్ములిస్తుంది. గర్భధారణ సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి గుమ్మడికాయ ఎంతో సహాయపడుతుంది. అయితే గుమ్మడికాయను స్వీట్లలో కాకుండా విడిగా ఉడికించి తినాలి.


logo