బీట్‌రూట్‌తో నీర‌సానికి చెక్‌..!


Sat,December 1, 2018 08:48 PM

తాజా కూర‌గాయ‌లు, పండ్ల‌ను తిన‌డం అల‌వాటు చేసుకుంటే అవే మ‌నకు ఆరోగ్యాన్ని అందిస్తాయి. మ‌న‌కు శ‌క్తిని, ఆరోగ్యాన్ని అందించే కూర‌గాయ‌ల జాబితాలో బీట్‌రూట్ కూడా ఒక‌టి. అయితే దీన్ని అంత సామాన్యంగా ఎవ‌రూ తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ బీట్‌రూట్ మ‌న‌కు చేసే మేలు గురించి తెలిస్తే క‌చ్చితంగా ఎవ‌రైనా బీట్‌రూట్‌ను తిన‌లేక‌పోయినా, క‌నీసం జ్యూస్ అయినా తాగుతారు. అలాంటి లాభాలు బీట్‌రూట్ వ‌ల్ల మ‌న‌కు క‌లుగుతాయి.

బీట్‌రూట్ జ్యూస్‌ను క‌నీసం రెండు రోజుల‌కు ఒక‌సారి ఒక గ్లాస్ చొప్పున తాగినా చాలు, దాంతో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. మ‌న దేశంలో మ‌హిళ‌లు ఎదుర్కొనే ముఖ్య స‌మ‌స్య ర‌క్త‌హీన‌త‌. ఐర‌న్ లోపం వ‌ల్ల ఇది వస్తుంది. అందుకు వారు రోజుకు ఒక క‌ప్పు బీట్‌రూట్ తింటే చాలు, శ‌రీరంలో ఐర‌న్ పెరుగుతుంది. ఫ‌లితంగా ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. బీట్‌రూట్ తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో హిమోగ్లోబిన్‌, ర‌క్తం పెరుగుతాయి. అలాగే శ‌రీరానికి కావ‌ల్సిన ఆక్సిజ‌న్ కూడా ల‌భిస్తుంది.

బీట్‌రూట్ జ్యూస్ తాగినా, ప‌చ్చి ముక్క‌ల‌ను తిన్నా నీర‌సం త‌గ్గుతుంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. నిత్యం యాక్టివ్‌గా ఉండాల‌ని కోరుకునే వారు త‌మ ఆహారంలో బీట్‌రూట్‌ను చేర్చుకోవాల‌ని వారు సూచిస్తున్నారు. బీట్ రూట్‌లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన విట‌మిన్ బి, సి లు పుష్క‌లంగా ఉంటాయి. దీని వ‌ల్ల హై బీపీ అదుపులో ఉంటుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. పిల్ల‌ల‌కు బీట్‌రూట్‌ను జ్యూస్ రూపంలో ఇస్తే బాగుంటుంది. వారికి పోష‌ణ స‌రిగ్గా అందుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.

3782
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles