శుక్రవారం 22 జనవరి 2021
Health - Jan 12, 2021 , 01:36:29

దాదానూ.. వదలదా?

దాదానూ.. వదలదా?

వయసు 48. అయిదడుగులా 11 అంగుళాల ఎత్తు. 68 కిలోల బరువు. కండలు తిరిగిన దేహం. ఎప్పుడూ ఇంటి వంటే. సాయంత్రం ఆరు తర్వాత కార్బొహైడ్రేట్లు ముట్టుకోడు.కోడిగుడ్డు, పండ్లు, కూరగాయలు, గింజలు... ఇవే తన ప్రధాన ఆహారం. రోజూ వ్యాయామం తప్పనిసరి. ఉదయాన్నే 40 నిమిషాల పాటు రన్నింగ్‌ చేస్తాడు. కానీ, ఆ రోజు జిమ్‌లో వర్కవుట్‌ పూర్తి కాగానే హఠాత్తుగా కింద పడిపోయాడు. అత్యవసరంగా ఆంజియోప్లాస్టీ చేయాల్సి వచ్చింది. కారణం..గుండెపోటు! ఎవరో అర్థమైందిగా.. టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ. 

ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించే గంగూలీకే గుండెపోటు వస్తే, ఇక ఒక పద్ధతి లేకుండా బతికేవారి సంగతి ఏమిటి? శారీరక శ్రమ లేనివాళ్ల పరిస్థితి ఇంకెలా ఉండాలి? అసలు, ఫిట్‌గా ఉండే గంగూలీ లాంటి క్రీడాకారులకు గుండెపోటు ఎందుకు వస్తుంది? ఆరోగ్య సూత్రాలు పాటించినా, ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఉందా?.. సామాన్యుల బుర్రల నిండా ఎన్నో ప్రశ్నలు.అప్పుడెప్పుడో కపిల్‌ దేవ్‌. ఇప్పుడు గంగూలీ. అదృష్టవశాత్తు గంటలోపే వైద్య సహాయం అందింది. స్టెంట్‌ వేయించుకుని ప్రమాదం నుంచి బయట పడగలిగారు. ఆస్ట్రేలియన్‌ బాట్స్‌మన్‌ ఫిలిప్స్‌ కూడా అంతే! వ్యాయామం చేస్తూ చేస్తూ ‘కార్డియాక్‌ డెత్‌'కి గురయ్యాడు. మరో ఆస్ట్రేలియన్‌ ప్లేయర్‌ డీన్‌ జోన్స్‌ ఇటీవలే అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోయాడు. వీళ్లందరూ అంతకుముందు వరకూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎటువంటి జీవనశైలి సమస్యలూ లేవు. అంతేగాక, వీళ్లందరి వయసూ 35 ఏండ్ల పైమాటే. వ్యాయామం నిస్సందేహంగా మంచిదే. కానీ, అతిగా చేస్తే కొన్నిసార్లు గుండెపోటుకు కారణం కావొచ్చు. అప్పటికే ఏవైనా గుండె సమస్యలు లోపల దాగి ఉంటే, ఆకస్మిక మరణానికీ దారితీయవచ్చు. 

కనిపించని శత్రువు.. గుండెపోటు

కార్డియోమయోపతి ఉన్నవాళ్లకు గుండె కండరం వాచిపోతుంది. దీన్ని ‘హైపర్‌ట్రోపీ కార్డియోమయోపతి’ అంటారు. సాధారణంగా ఇది పుట్టుకతోనే ఉండవచ్చు. తీవ్రస్థాయి వ్యాయామం వల్ల కూడా రావచ్చు. ఈ సమస్య ఉన్నవాళ్లలో ఎటువంటి లక్షణాలూ కనిపించవు. కాబట్టి, ఇబ్బంది తెలియదు. అలాంటివారు, తీవ్ర స్థాయిలో వ్యాయామం చేస్తే ఆకస్మిక మరణం సంభవించే ప్రమాదం ఉంటుంది. 

కొందరికి పుట్టుకతోనే ‘ప్రొలాంగ్డ్‌ క్యుటి’ ఉండవచ్చు. దీనికి జన్యుపరమైన కారణాలు ఉంటాయి. ఈ సమస్యను ఈసీజీ ద్వారా గుర్తించవచ్చు. చాలాసార్లు కాకతాళీయంగా బయటపడుతుంది. దీనివల్ల గుండె విద్యుత్‌ ప్రసారాల్లో అసాధారణత ఏర్పడుతుంది. ఈసీజీలో చూసినప్పుడు, క్యుటి ఇంటర్వెల్‌ ఎక్కువ సేపు ఉంటుంది. అయితే, ఈసీజీలో ఈ మార్పులను గుర్తించాలంటే నైపుణ్యం అవసరం. ఈ మార్పులను సకాలంలో గుర్తిస్తే సరైన చికిత్స చేయవచ్చు. ‘కార్డియాక్‌ డెత్‌'ను నివారించవచ్చు.

కొందరిలో జన్యుపరమైన కారణాల వల్ల ‘మయోకార్డియల్‌ బ్రిడ్జ్‌' అనే సమస్య వస్తుంది. వీళ్లకు క్రోమోజోమ్‌ అనాలిసిస్‌ టెస్టు చేస్తే తప్ప కారణం తెలియదు. కరొనరీ ధమనులు గుండె కండరం (మయోకార్డియమ్‌) మీదుగా వెళ్లడం వల్ల అక్కడో బ్రిడ్జిలా ఏర్పడుతుంది. సాధారణంగా రోగిలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. కానీ, కొందరిలో దీని ప్రభావం వల్ల గుండెనొప్పి, ఏంజైనా ఉంటాయి. 

అసలు కారణం ఇదే

రక్తనాళంలో మూడు రకాల పొరలు ఉంటాయి. బయటి పొర, మధ్యలోది.. మీడియా, దానికన్నా లోపల ఉన్నది.. ఇంటిమా. ఇంటిమా (లోపలి పొర), మీడియా (మధ్య పొర)కి మధ్యలో క్యాల్షియం పేరుకుపోతుంది. ఇది క్రమంగా పెరుగుతూ ఉండటంతో ఇంటిమా గట్టిపడుతుంది. దాంతో, అక్కడ ఫైబ్రస్‌ (గట్టి) కణజాలం ఏర్పడుతుంది. ఈ కణజాల పొర చిట్లినప్పుడు రక్తం బయటికి వచ్చి, రక్తనాళపు లూమెన్‌లోకి వస్తుంది. ప్లేట్‌లెట్ల చర్యలవల్ల అది గట్టిపడుతుంది. ఇది రక్తప్రసారానికి అడ్డంకిగా తయారవుతుంది. గుండెపోటు రావడం వెనుక ఇంత తతంగం ఉంది. ఫైబ్రస్‌ పొర చిట్లనంతవరకూ, రక్తనాళంలో కొవ్వు పేరుకుపోయినా సమస్య కాదు. ఈ కొవ్వు జన్యుపరమైన కారణాలున్నవాళ్లకు సాధారణంగా 16 ఏండ్ల వయసులోనే ఏర్పడుతుంది. వయసుతో పాటు ఆ కొవ్వు కూడా పెరుగుతూ పోతుంది. వాళ్లు క్రీడాకారులైతే తీవ్రమైన కసరత్తులు చేయడం వల్ల ఈ ఫైబ్రస్‌ పొర, అంచులవైపు కాకుండా మధ్యలో చిట్లే ప్రమాదం ఉంది. దీంతో సడెన్‌ ‘కార్డియాక్‌ డెత్‌' అవుతుంది. చాలా సందర్భాల్లో ఇది ఆంజియోగ్రామ్‌లోనే బయటపడుతుంది. ఆంజియోగ్రామ్‌ చేసేటప్పుడు ఆప్టికల్‌ కోహెరెన్స్‌ టోమోగ్రఫీ (ఓసీటీ) ద్వారా ఒక ఎండోస్కోప్‌ లాంటి పరికరాన్ని రక్తనాళంలోకి పంపి పరీక్షిస్తారు. క్రీడాకారులకు ఓసీటీ చేసినప్పుడు ఆ ఫైబ్రస్‌ గడ్డ (ప్లేక్‌) చిట్లిపోయి ఉంటుంది. పరీక్ష చేయించుకుంటే ముందు జాగ్రత్త పడేందుకు వీలుంటుంది. 

పుట్టుకతో సమస్య ఉంటే..

 •  క్రీడాకారులు తరచూ కార్డియాక్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా, 30 దాటిన తర్వాత తప్పనిసరి.
 • ఫాస్టింగ్‌ షుగర్‌, లిపిడ్‌ టెస్టులు, ఈసీజీ, 2డి ఎకో చేయించాలి.
 • ప్రొలాంగ్డ్‌ క్యుటి, బీటింగ్‌ అబ్‌నార్మాలిటీ ఉంటే హోల్డర్‌ సిస్టమ్‌ పెట్టి, చిన్న ఈసీజీతో 24 నుంచి 48 గంటలపాటు మానిటర్‌ చేస్తారు. 
 •  లూప్‌ రికార్డర్‌ టెస్ట్‌కూడా ముఖ్యమే. ఇందులో చిన్న చిప్‌ని క్లావికల్‌ ఎముక కింద పెట్టి హృదయ స్పందనను మానిటర్‌ చేస్తారు. దీనివల్ల ప్రమాదాన్ని ముందే తెలుసుకోవచ్చు. 
 • రక్తనాళంలోని ఇంటిమా మందం అయిందో లేదో తెలుసుకోవడానికి కెరొటిడ్‌ ఆర్టరీ థికెనింగ్‌ పరీక్షిస్తే సరిపోతుంది. ఇది మెడ దగ్గరినుంచి మెదడుకు వెళ్తుంది. 
 • మెడ దగ్గర ఉండే కెరొటిడ్‌ ఆర్టరీని అల్ట్రాసౌండ్‌ ద్వారా పరీక్షిస్తే రక్తనాళం లోపలి గోడలు ఎంత మందం అయ్యాయో తెలుస్తుంది. 
 • హెచ్‌ఎస్‌సీఆర్‌పీ .. అంటే, హై సెన్సిటివ్‌ సీఆర్‌ ప్రొటీన్‌ ఎక్కువగా ఉంటే, సమస్య ఉందని అర్థం. రిస్కు ఎక్కువగా ఉన్నవాళ్లు ముందే ఈ టెస్టు చేయించుకుంటే జాగ్రత్తపడవచ్చు. 
 • మల్టీ ైస్లెస్‌ సీటీ స్కాన్‌ - ఇది చాలా ముఖ్యమైన పరీక్ష. దీన్లో క్యాల్షియం స్కోర్‌ చెక్‌ చేస్తారు. 400 కన్నా ఎక్కువ ఉంటే, వంద శాతం రిస్కు ఉన్నట్టే. ఇలాంటప్పుడు, గుండెపోటు రాకుండా వెంటనే చికిత్స మొదలుపెడతారు. ఆంజియోగ్రామ్‌ కూడా చేస్తారు. అవసరమైతే స్టెంట్‌ వేస్తారు. ఒకసారి గుండెపోటు వచ్చిన రెండు మూడేండ్ల తర్వాత కూడా ఈ స్కాన్‌ చేస్తారు. 35 ఏండ్ల్లు దాటిన క్రీడాకారుల్లో కూడా ఈ పరీక్షద్వారా ప్రమాదాన్ని నివారించవచ్చు. 

వ్యాయామం..  గుండెపోటు

రోజూ వ్యాయామం చేయడం ద్వారా డయాబెటిస్‌, బీపీ, బీఎంఐ, ఎల్‌డీఎల్‌ లాంటి వాటిని నియంత్రణలో పెట్టుకోవచ్చు. హెచ్‌డీఎల్‌ స్థాయిని పెంచుకోవచ్చు. ఒత్తిడినుంచి ఉపశమనం పొందవచ్చు. కానీ, ఏ రకమైన వ్యాయామం చేస్తున్నాం, ఎంత తీవ్రంగా చేస్తున్నాం, మన శారీరక పరిస్థితి ఏమిటి? అనేవాటిని బట్టి ఆ ప్రభావం ఉంటుంది. వెయిట్‌ లిఫ్టింగ్‌ చేసేవాళ్లలో కన్నా, సైక్లింగ్‌ చేసేవాళ్లలో గుండెపోటు రిస్కు తక్కువగా ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. కార్డియోమయోపతి లాంటి గుండె జబ్బులు ఉన్నప్పుడు బయటికి లక్షణాలు కనిపించవు. కాబట్టి, ఉన్నట్టు కూడా తెలియదు. క్రీడాకారుల వ్యాయామం తీవ్రస్థాయిలో ఉంటుంది. దీంతో సమస్య మరింత జటిలమై గుండెపోటు రావచ్చు. తీవ్ర స్థాయిలో వ్యాయామాలు చేయడం వల్ల సైటోకైన్స్‌ ఎక్కువగా విడుదలై కూడా, గుండెకు నష్టం వాటిల్లవచ్చు. అంతేకాదు, వ్యాయామం వల్ల డీహైడ్రేట్‌ అవుతారు. దాంతో ఎలక్ట్రొలైట్‌లు సమతౌల్యం కోల్పోతాయి. దాంతో క్లాటింగ్‌ టెండెన్సీ పెరుగుతుంది. పొటాషియం ఎక్కువైనా, తక్కువైనా ప్రాణాపాయం ఉంటుంది. తీవ్రమైన వ్యాయామం వాసో స్పాస్మ్‌కు కూడా దారితీస్తుంది. అంటే కరొనరీ ధమని బిగుసుకుపోయి (స్పాస్మ్‌), రక్తసరఫరాకు ఆటంకం ఏర్పడి, గుండెపోటు వస్తుంది. ఇది ఆడవాళ్లలో అధికం. చలికాలంలో కూడా ఉదయాన్నే గుండెపోట్లు ఎక్కువ. రక్తనాళాలు బిగుసుకు పోవడమే ఇందుకు కారణం. 

ఒత్తిడి.. అతిపెద్ద శత్రువు

గుండెకు ప్రధాన శత్రువు ఒత్తిడి. గెలుపోటముల పడవలపై ప్రయాణించే క్రీడాకారులకు సహజంగానే ఒత్తిడి ఎక్కువ. గంగూలీ లాంటి వ్యక్తికి అయితే..  మరింత ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు అడ్రినలిన్‌, నార్‌ అడ్రినలిన్‌ హార్మోన్లు పెరుగుతాయి. ఈ హార్మోన్లు సాధారణ మోతాదులో ఉంటే పరవాలేదు. కానీ అదే పనిగా పెరుగుతూ ఉంటే మాత్రం, గుండెపై ప్రభావం ఉంటుంది. రక్తం గడ్డకట్టి, క్లాట్‌ ఏర్పడి, రక్తనాళంలోని ప్లేక్‌ చిట్లిపోవడానికి ఇది కారణమవుతుంది. దాంతో అక్యూట్‌ మయోకార్డియాల్‌ ఇన్‌ఫ్రాక్షన్‌ (గుండెపోటు)కు దారితీస్తుంది. స్ట్రెస్‌ హార్మోన్లు గుండె కండరం మీద ప్రభావం చూపిస్తాయి. తద్వారా, వీటీవీఎఫ్‌ (వెంట్రిక్యులార్‌ టాకికార్డియా వెంట్రిక్యులర్‌ ఫిబ్రిలేషన్‌) వస్తాయి. రక్తనాళం మూసుకుపోవడం వల్ల, వెంట్రిక్యులర్‌ ఫిబ్రిలేషన్‌ తలెత్తి సడెన్‌ కార్డియాక్‌ డెత్‌ అవుతుంది. వెంటనే సీపీఆర్‌ ఇచ్చి, వైద్యసహాయం అందించడం ద్వారా ప్రాణాపాయాన్ని నివారించవచ్చు. 

చికిత్స

 • అన్ని కార్డియాక్‌ సమస్యల లాగానే వీటికీ చికిత్స ఉంటుంది. రక్తం పలుచబడటానికి యాంటీ ప్లేట్‌లెట్‌లు (రక్తాన్ని పలుచన చేసే మందులు) ఇస్తారు. అయితే, బ్లడ్‌ థిన్నర్లవల్ల  సులువుగా రక్తస్రావం అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి, ఒంటిమీద గాయాలు కాకుండా జాగ్రత్త పడాలి. 
 • కొలెస్ట్రాల్‌ తగ్గడానికి స్టాటిన్స్‌ ఇస్తారు. ఎల్‌డీఎల్‌ 70 కన్నా ఎక్కువ ఉంటే మందులు వాడాలి. 
 • ఒకసారి గుండెపోటు వచ్చిన తరువాత, మళ్లీ ఆడాలా వద్దా అనేది నిర్ధారించడానికి రికవరీ తర్వాత.. 2డి ఎకో, టీఎంటీ పరీక్షలు చేస్తారు. పర్‌ఫ్యూజన్‌ స్కాన్‌ కూడా చేస్తారు. దీనిద్వారా గుండె మొత్తానికీ రక్తసరఫరా సక్రమంగా జరుగుతున్నదా లేదా అన్నది పరీక్షిస్తారు. 
 • చికిత్స తరువాత, లూప్‌ రికార్డర్‌ద్వారా హృదయ స్పందన మెరుగుపడిందో లేదో గమనిస్తారు. 

డాక్టర్‌ వి. సూర్యప్రకాశ్‌ రావు

సీనియర్‌ కన్సల్టెంట్‌ కార్డియాలజిస్ట్‌

కేర్‌ హాస్పిటల్స్‌ ,హైదరాబాద్‌


logo