శుక్రవారం 04 డిసెంబర్ 2020
Health - Oct 19, 2020 , 19:49:03

వీరు నవరాత్రి ఉపవాసాలు ఉండకపోవడమే మంచిదట..!

వీరు నవరాత్రి ఉపవాసాలు ఉండకపోవడమే మంచిదట..!

న్యూఢిల్లీ: ఇవి దుర్గా అమ్మవారి నవరాత్రులు. చాలామంది ఉపవాసాలు ఉంటారు. అయితే, అధిక ప్రమాదం ఉన్న కొవిడ్‌-19 రోగులు ఉపవాసం ఉండకపోవడమే ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. ఉపవాసం వల్ల సహజమైన రక్షణ విధానం, అలాగే, శరీరం అనుకూల రోగనిరోధక ప్రతిస్పందనలు తగ్గుతాయని డాక్టర్లు పేర్కొంటున్నారు. 

‘కరోనా పాజిటివ్‌ వచ్చినవారు లేదా ఇన్ఫెక్షన్‌ నుంచి కోలుకుంటున్న వ్యక్తులు నవరాత్రి లేదా కార్వాచౌత్‌ సమయంలో ఉపవాసం ఉండకూడదు. వీరితోపాటు వైరస్‌బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్న వృద్ధులు, డయాబెటిస్, రక్తపోటు లేదా ఇతర కొమొర్బిడిటీ ఉన్నవారు, గర్భిణులు, పాలిచ్చే మహిళలు ఉపవాసం ఉండకపోవడమే మంచిది.’ అని న్యూఢిల్లీలోని ఇండియన్‌ స్పైనల్‌ ఇంజురీస్‌ సెంటర్‌ ఇంటర్నల్‌ అండ్‌ రెస్పిరేటరీ మెడిసిన్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ విజయ్‌దత్తా సూచించారు.  

ఫ్రైలకు దూరంగా ఉండాలి..

నవరాత్రి ఉత్సవం ఇప్పటికే ప్రారంభమైంది. అక్టోబర్ 25 వరకు కొనసాగుతుంది. కార్వా చౌత్ నవంబర్ 4నుంచి ప్రారంభమవుతుంది. కాగా,  ఉపవాసం ఉండేవారు మంచి ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు న్యూఢిల్లీలోని ఆకాశ్‌ హెల్త్‌కేర్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ రాకేశ్‌ పండిట్‌. ఫ్రై, డీప్‌ ఫ్రై ఆహారానికి దూరంగా ఉండాలన్నారు. పండ్లను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ప్యాకేజ్డ్‌ పండ్ల రసాల జోలికి పోవద్దని చెబుతున్నారు. అరటి, దానిమ్మ, బొప్పాయి, ఆపిల్‌, బెర్రీలను తీసుకోవాలని అంటున్నారు. వాల్‌నట్‌, బాదాం, పిస్తాలాంటి డ్రైఫ్రూట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటున్నారు. కూరగాయలు లేదా పనీర్‌ మల్టీగ్రెయిన్‌ చపాతీతో కూడిన తేలికపాటి భోజనాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. 

గర్భిణులు, పాలిచ్చే తల్లులు జాగ్రత్తగా ఉండాలి..

గర్భిణులు, పాలిచ్చే మహిళలు ఇలాంటి పరిస్థితుల్లో ఉపవాసం ఉండొద్దని వైద్యులు సూచించారు. రోజంతా ఉపవాసం సహజ జీవక్రియకు ఆటంకం కలిగిస్తుందని, ఇది హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుందన్నారు. అలాగే, ఇది ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, వికారం,  అసౌకర్యానికి దారితీస్తుందని వారు హెచ్చరించారు. న్యూఢిల్లీలోని సీడ్స్‌ ఆఫ్‌ ఇన్నోసెన్స్ సీనియర్ గైనకాలజిస్ట్ అండ్‌ ఫెర్టిలిటీ నిపుణులు గౌరీ అగర్వాల్ మాట్లాడుతూ, ఉపవాసం ఉన్న రోజు మొత్తం గర్భిణుల రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుందన్నారు. ఇది సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. ఒకవేళ కచ్చితంగా ఉండాలనుకునేవాళ్లు తాజా పండ్లరసాలు, కొబ్బరి నీళ్లు, పాలు లేదా తాజా ద్రవపదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.