గ్రీన్ టీ ఎప్పుడు తాగితే మంచిదో తెలుసా..?


Mon,July 31, 2017 10:47 AM

నేటి తరుణంలో అధిక బరువును తగ్గించుకోవడం కోసం చాలా మంది తీసుకుంటున్న డ్రింక్స్‌లో గ్రీన్ టీ ఒకటి. దీని వల్ల ఒంట్లో ఉన్న కొవ్వు కరగడమే కాదు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అయితే మంచిదే కదా అని చెప్పి గ్రీన్ టీని నిత్యం మోతాదుకు మించి మాత్రం తాగకూడదు. ఈ క్రమంలో గ్రీన్ టీని అసలు రోజుకు ఎన్ని కప్పులు తాగాలి, ఎప్పుడు తాగాలి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రోజుకు 2-3 కప్పులు మాత్రమే...


గ్రీన్ టీని రోజుకు 2 లేదా 3 కప్పులు మాత్రమే తాగాలి. ఇంతకు మించిన మోతాదులో తాగకూడదు. తాగితే లివర్ డ్యామేజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. శరీరం విషతుల్యంగా మారుతుంది. ఒంట్లో వ్యర్థాలు పేరుకుపోతాయి. గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి.

పరగడుపునే అస్సలు వద్దు...


గ్రీన్ టీని పరగడుపునే అస్సలు తాగకూడదు. దానికి బదులుగా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే బెటర్. దీంతో ఒంట్లో ఉన్న విష పదార్థాలు మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతాయి. అయితే గ్రీన్ టీని పరగడుపునే తాగితే గ్యాస్, అసిడిటీ పెరిగిపోయి జీర్ణ సమస్యలు వస్తాయి.

భోజనం చేయడానికి ముందు, తరువాత...


గ్రీన్ టీ తాగాక కనీసం 30 నుంచి 45 నిమిషాలు ఆగాకే భోజనం చేయాలి. అలాగే భోజనం చేశాక కూడా అంతే సమయం పాటు వేచి ఉన్నాక మాత్రమే గ్రీన్ టీని తాగాలి. లేదంటే మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించలేదు. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం గ్రహించకుండా చేస్తాయి. దీనికి తోడు జీర్ణ సమస్యలు కూడా వస్తాయి.

రాత్రి పూట...


రాత్రి పూట పడుకోబోయే ముందు కొందరు గ్రీన్ టీ తాగుతారు. అలా అస్సలు చేయవద్దు. ఎందుకంటే గ్రీన్ టీ డైయురెటిక్‌గా పనిచేస్తుంది. కనుక నిద్రలో ఉన్నప్పుడు మూత్రం కోసం లేవాల్సి వస్తుంది. ఇది నిద్రను చెడగొడుతుంది. ఒత్తిడి పెంచుతుంది. కనుక రాత్రిపూట పడుకోబోయే ముందు గ్రీన్ టీ తాగరాదు.

7368

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles