ఈ ఆసనాన్ని నిత్యం సాధన చేయడం వల్ల శరీరం తేలిక అవుతుంది. కాన్పు సులభం అవుతుంది. అయితే నిపుణుల సలహా, పర్యవేక్షణలోనే ఈ ఆసనం ప్రయత్నించాలని మరచిపోవద్దు.
ముందుగా తాడాసన స్థితిలో నిలబడాలి. మూడు అడుగుల ఎడం ఉండేలా రెండు కాళ్లనూ దూరంగా జరపాలి. తర్వాత రెండు చేతులను భుజాలకు సమాంతరంగా పైకి ఎత్తాలి.
ఇప్పుడు కుడిపాదాన్ని బయటకు, ఎడమపాదాన్ని లోపలికి చూసే విధంగా తిప్పాలి. కుడివైపు నిదానంగా వంగాలి. కుడిచేతిని చిత్రంలో చూపిన విధంగా బ్లాక్‌పై ఉంచాలి. ఇప్పుడు ఎడమకాలిని సాధ్యమైనంత వరకు పైకెత్తాలి. ఎడమ చేతిని కూడా పైకెత్తాలి. ఈ సమయంలో శ్వాసక్రియ నిదానంగా ఉండేలా చూసుకోవాలి.
ఈ ఆసన స్థితిలో పది నుంచి పదిహేను సెకండ్లు ఉండాలి. తర్వాత తాడాసన స్థితికి రావాలి. తిరిగి ఎడమవైపు కూడా ఇదే విధంగా ఆసనం వేయాలి. మరో పది నుంచి పదిహేను సెకండ్లు ఆసనంలో ఉండి, తాడాసన స్థితికి రావాలి.
లాభాలు: అర్ధచంద్రాసనం రక్తపోటును నియంత్రిస్తుంది. కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. శ్వాసక్రియ సజావుగా సాగేందుకు దోహదం చేస్తుంది. నార్మల్ డెలివరీకి తోడ్పడుతుంది.
చేయకూడనివారు: కండ్లు తిరుగుతున్న వాళ్లు ఈ ఆసనం వేయకూడదు. గర్భిణులు బ్లాక్స్ సాయంతోనే ప్రయత్నించాలి. వ్జైనా నుంచి రక్తస్రావం అవుతున్నా, వాంతులు అవుతున్న ఫీలింగ్ ఉన్నా ప్రయత్నించొద్దు.