శనివారం 08 ఆగస్టు 2020
Health - Jul 14, 2020 , 18:23:14

కరోనా నుంచి కోలుకున్నా.. కోల్పోనున్న రోగనిరోధకత

కరోనా నుంచి కోలుకున్నా.. కోల్పోనున్న రోగనిరోధకత

లండన్ : కొవిడ్19 మహమ్మారిని ఎదుర్కోవడంలో యాంటీబాడీలు తగ్గిపోతున్నాయి. దీంతో రోగ నిరోధక వ్యవస్థ పనితీరు తగ్గి కరోనా వైరస్ మళ్లీ మళ్లీ సోకే అవకాశం ఉన్నదని లండన్‌లోని కింగ్స్ కాలేజ్ పరిశోధకులు భావిస్తున్నారు.

లాంగిట్యూడినల్ ఎవాల్యుయేషన్ అండ్ డిక్లైన్ ఆఫ్ యాంటీబాడీ రెస్పాన్సెస్ ఇన్ సార్స్-కోవ్-2 (కొవిడ్-19) అనే అంశంపై లండన్ కు చెందిన కింగ్స్ కాలేజ్ పరిశోధకులు.. సెయింట్ థామస్ ఎన్ హెచ్ ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ లో చికిత్స పొందుతున్న 90 మందికి పైగా రోగులు, ఆరోగ్య కార్యకర్తల రోగనిరోధక ప్రతిస్పందనను విశ్లేషించారు. ఇదే ఫౌండేషన్ ట్రస్ట్ దవాఖానలో బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ మార్చిలో కరోనా వైరస్ పాజిటివ్ కు చికిత్స పొందారు.

కింగ్స్ కాలేజీకి చెందిన డాక్టర్ కేటీ డోర్స్ నేతృత్వంలో జరిపిన పరిశోధనలో.. వైరస్ ను నాశనం చేయగల యాంటీబాడీల స్థాయిలు కనుగొన్నారు. లక్షణాలు ప్రారంభమైన మూడు వారాల తరువాత క్షీణించడం ప్రారంభమైనట్లు గుర్తించారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న రోగుల్లో యాంటీబాడీల ప్రతిస్పందన తక్కువగా ఉండి.. కొన్ని నెలలు మాత్రమే ప్రాణాంతక వైరస్ నుంచి కాపాడేందుకు రోగనిరోధక శక్తిని కలిగిస్తుందని వీరు గుర్తించారు.

యాంటీబాడీలు కేవలం మూడు నెలల వ్యవధిలో తగ్గిపోతున్నాయంటే.. వ్యాక్సిన్ ప్రభావం సైతం అంతకాలానికే పని చేయవచ్చునని అభిప్రాయపడ్డారు. అంటే కొవిడ్-19 వ్యాక్సిన్ ఒక్కసారి తీసుకుంటే సరిపోదని, మళ్లీ మళ్లీ వ్యాక్సినేషన్ చేయాల్సి ఉంటుందన్నారు. కరోనా వైరస్ రెండోసారి సోకితే.. వారిలో తీవ్రత తక్కువగా ఉంటుందని, గతంలో ఎదుర్కొన్న అనుభవంతో యాంటీబాడీలు వైరస్‌పై మెరుగైన ప్రతిదాడి చేస్తాయని రీసెర్చ్ టీమ్‌లోని మరో డాక్టర్ భావిస్తున్నారు.

లక్షణాలు వెలువడిన మూడు నెలలపాటు రోగులు, ఆరోగ్య కార్యకర్తల్లో  యాంటీబాడీ స్థాయిలను పర్యవేక్షించిన మొదటి "లాంగిట్యూడినల్" పరిశోధన ఇదే. 65 మంది రోగులు, పాజిటివ్ తేలిన ఆరుగురు ఆరోగ్య కార్యకర్తల నుంచి పరీక్ష ఫలితాలను రాబట్టారు. మరో 31 మంది మార్చి, జూన్ నెలల మధ్య రెగ్యులర్ యాంటీబాడీ పరీక్షలు చేయించుకోవటానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చిన సిబ్బంది ఉన్నారు. చాలా మంది కరోనా వైరస్ సోకిన వ్యక్తుల్లో కొవిడ్-19 లక్షణాలు ప్రారంభమైన 10-15 రోజుల తరువాత సార్స్-కోవ్-2 కు యాంటీబాడీ ప్రతిస్పందనలను గుర్తించారు. 

కరోనావైరస్ తో పోరాడేందుకు వ్యాధి నిరోధక వ్యవస్థకు అనేక మార్గాలు ఉన్నాయి. అయితే యాంటీబాడీస్ రక్షణ ప్రధాన మార్గంగా ఉంటే.. సాధారణ జలుబు, ఇతర రకాల ఫ్లూ మాదిరిగానే ప్రజలు కాలానుగుణ తరంగాలలో తిరిగి సంక్రమించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.


logo