శనివారం 29 ఫిబ్రవరి 2020
అన్ని ఫ్లూ జ్వరాలకీ ఒకే వ్యాక్సిన్‌!

అన్ని ఫ్లూ జ్వరాలకీ ఒకే వ్యాక్సిన్‌!

Feb 10, 2020 , 23:02:09
PRINT
అన్ని ఫ్లూ జ్వరాలకీ ఒకే వ్యాక్సిన్‌!

జలుబు, దగ్గులతో అతలాకుతలం చేసేది ఫ్లూ. ఇప్పటికే కొన్ని రకాల ఫ్లూ వైరస్‌లకి వ్యాక్సిన్లు ఉన్నాయి. కాని కొన్ని రకాల వైరస్‌ల వల్ల కలిగే ఫ్లూని ఏమీ చేయలేకపోతున్నాం. అయితే ఇప్పుడు అన్ని రకాల ఫ్లూ వైరస్‌లనూ నియంత్రించడానికి ఒకే వ్యాక్సిన్‌ను రూపొందించడానికి కసరత్తు జరుగుతోంది. జలుబుకు మందులు వాడితే వారంరోజుల్లో వాడకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుందని ఓ మాట ఉండనే ఉంది. అంటే జలుబును నియంత్రించే సరైన చికిత్స లేదని అర్థం. జలుబు కొన్ని వేల రకాల వైరస్‌లలో ఏదో ఒకదానివల్ల కలుగుతుంది. ఇవన్నీ ఫ్లూ వైరస్‌లే. అందుకే ఇన్ని రకాల వైరస్‌లకు వ్యాక్సిన్లు తయారుచేయడం కష్టమైంది. కాని ఇప్పుడు అన్నిటికీ కలిపి ఒకే వ్యాక్సిన్‌ను తీసుకొచ్చే పనిలో ఉన్నారు పరిశోధకులు. ఫ్లూ వైరస్‌ల ఉపరితలం మీద హీమాగ్లుటినిన్‌ అనే ప్రొటీన్‌ ఉంటుంది.

హోస్ట్‌ కణాలపై దాడి చేయడానికి ఇదే మార్గదర్శనం చేస్తుంది. ఈ ప్రొటీన్‌ వల్లనే వైరస్‌ మనల్ని ఇన్‌ఫెక్ట్‌ చేస్తుంది. ఈ హీమాగ్లుటినిన్‌లో తల (హెడ్‌), తోక (స్టాక్‌) అనే రెండు భాగాలుంటాయి. వీటిలో తల భాగం అన్ని వైరస్‌లలో ఒకేలా ఉండదు. కాని స్టాక్‌ మాత్రం దాదాపుగా ఒకేలా ఉంటుంది. అందువల్ల హీమాగ్లుటినిన్‌ స్టాక్‌ను టార్గెట్‌ చేస్తూ వ్యాక్సిన్‌ను తయారుచేయవచ్చని భావిస్తున్నారు సైంటిస్టులు. ఇందుకోసం కైమెరిక్‌ హీమాగ్లుటినిన్‌ అనే ప్రొటీన్‌ రకంపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ పరిశోధనలు విజయవంతం అయితే యూనివర్సల్‌ ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ రాక ఎంతో దూరంలో ఉండదంటున్నారు ప్రొఫెసర్‌ ఫ్లోరియన్‌ క్రామర్‌. 


logo