e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home ఆరోగ్యం Cancer Treatment | క్యాన్సర్‌కు.. ‘అనుబంధ’ వైద్యం!

Cancer Treatment | క్యాన్సర్‌కు.. ‘అనుబంధ’ వైద్యం!

‘వరల్డ్‌ రోజ్‌ డే’ ప్రత్యేక వ్యాసం

వైద్య రంగంలో అనేక ఆవిష్కరణలు వస్తున్నాయి. అయినా, క్యాన్సర్‌ అన్న మాట వినిపించగానే ఒళ్లు జలదరిస్తుంది. ఇదేమీ చికిత్స లేని వ్యాధి కాదు. తొలిదశలోనే గుర్తిస్తే, అంతే తొందరగా వైద్యం ప్రారంభిస్తే, తప్పక నయం అవుతుంది. కొత్త జీవితం సాధ్యపడుతుంది. క్యాన్సర్‌ చికిత్సలో ‘అనుబంధ’ వైద్యం ప్రాధాన్యాన్ని ఇప్పుడిప్పుడే వైద్య ప్రపంచం గుర్తిస్తున్నది. ప్రధాన చికిత్సకు తోడుగా ఆయుర్వేదం, హోమియోపతి, యోగా తదితర సంప్రదాయ విజ్ఞానాలను జోడిస్తే, వ్యాధి తీవ్రతను తట్టుకోవడానికి సరిపడా శారీరక, మానసిక శక్తి లభిస్తుంది. రోగి త్వరగా కోలుకుంటాడు. దీన్నే ‘ఇంటెగ్రేటివ్‌ ఆంకాలజీ’ అంటారు. యశోద హాస్పిటల్‌కు చెందిన డాక్టర్‌ సచిన్‌ మార్దా రచన ‘అయామ్‌ అన్‌స్టాపబుల్‌ – టుగెదర్‌ వియ్‌ క్యాన్‌’ మనోబలంతో ఆ మహమ్మారిని జయించడం సాధ్యమేనంటుంది. దాదాపు పదకొండువేల మంది క్యాన్సర్‌ రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన డాక్టర్‌ సచిన్‌ తన పుస్తకంలో క్యాన్సర్‌ను గెలిచిన ధీమంతుల విజయగాథలతో పాటు, అనుబంధ వైద్య విధానాల ప్రాధాన్యాన్నీ వివరించారు. వరల్డ్‌ రోజ్‌ డే (సెప్టెంబరు 22) సందర్భంగా క్యాన్సర్‌ రోగులకు సాయంగా నిలిచే అనుబంధ చికిత్సల సంక్షిప్త పరిచయం..

- Advertisement -

క్యాన్సర్‌ రోగులకు.. శస్త్ర చికిత్స (సర్జికల్‌ ట్రీట్‌మెంట్‌), రేడియో థెరపీ, కీమో థెరపీ, టార్గెటెడ్‌ థెరపీ, హార్మోనల్‌ థెరపీ, ఇమ్యునోథెరపీ లాంటి వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఆధునిక వైద్యంలో భాగంకాని కొన్ని విధానాలు కూడా రోగికి ఊరటనిస్తాయి. క్యాన్సర్‌ క్రిమితో పోరాడే శక్తిని ప్రసాదిస్తాయి. వీటినే ‘అనుబంధ చికిత్సలు’ అంటారు. క్యాన్సర్‌ చికిత్స ద్వారా కలిగే దుష్ప్రభావాలను (సైడ్‌ ఎఫెక్ట్స్‌) నియంత్రించడానికి ఆధునిక వైద్యానికి వీటిని జోడించవచ్చు. కాకపోతే, ఇవి క్యాన్సర్‌ను నేరుగా నయం చేయలేవు. చికిత్స వల్ల వచ్చే నొప్పులను, అలసటను తగ్గిస్తాయి. రోగి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆహారం పోషణ, వ్యాయామం, యోగా, అరోమా థెరపీ, మ్యూజిక్‌ థెరపీ, ఆర్ట్‌ థెరపీ, మర్దన, ఉపశమన చిట్కాలు (రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌), ధ్యానం, ఆక్యుపంక్చర్‌.. ఇందులో కొన్ని.

సరిగమల వైద్యం
శ్రావ్యమైన సంగీతం చెవినపడితే మనసు తేలికవుతుంది. దాంతోపాటే, శరీరమూ నొప్పులను మరచి
పోతుంది. శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుదలలో, జీవన నాణ్యతను పెంచడంలో సంగీత చికిత్స కీలకపాత్ర పోషిస్తుంది. సంప్రదాయ వైద్యంతో పాటు సంగీతాన్ని కూడా ఉపయోగించినప్పుడు క్యాన్సర్‌ రోగులకు వివిధ ప్రయోజనాలు కలుగుతాయి. సంగీత చికిత్స కారణంగా హాస్పిటల్‌ వాతావరణం పట్ల ఉండే భయం తొలగిపోతుంది. శ్వాసక్రియ మెరుగుపడుతుంది. రక్తపోటు, హృదయ స్పందనల రేటు తగ్గుతుంది. ఉద్రేకాల నుంచి ఉపశమనం లభిస్తుంది. నొప్పి తీవ్రత తగ్గినట్టు అనిపిస్తుంది. ఉద్వేగాలు నియంత్రణలోకి వస్తాయి. ఆందోళనను అధిగమిస్తారు. గొంతెత్తి పాడినప్పుడు సైతం మనలోని ఒత్తిడి మటుమాయం అవుతుంది.

వ్యాయామం చేయాల్సిందే!
వ్యాయామం ప్రాధాన్యం తెలిసిందే. టైప్‌ 2 మధుమేహం, క్యాన్సర్‌, గుండె కవాటాలకు సంబంధించిన వ్యాధులు సహా మరెన్నో ముప్పులను దూరం చేస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్‌ రోగులు
చికిత్సకు వేగంగా స్పందించేలా, త్వరగా కోలుకునేలా, ఆరోగ్యం మెరుగుపడేలా ఉపకరిస్తుంది. క్యాన్సర్‌ చికిత్స సమయంలో వ్యాయామం శారీరక, భావోద్వేగ నాణ్యతనూ ప్రసాదిస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. వ్యాయామం కోసం, రోజుకు ఓ గంట సమయాన్ని మూడు భాగాలుగా విభజించుకోవాలి.

  • 20 నిమిషాలు .. ట్రెడ్‌మిల్‌/ స్విమ్మింగ్‌/ ఏరోబిక్స్‌/ ఏదైనా ఆట/ జుంబా లాంటివి.
  • 20 నిమిషాలు.. సూర్య నమస్కారాలు/ యోగాసనాలు/ ప్రాణాయామం.
  • మరో 20 నిమిషాలు.. ధ్యానం.

ఇలా క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల రోగిలో ఆశావాదం, ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరిగినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

ప్రకృతే వైద్యుడు.. నేచురోపతి
ప్రకృతిని మించిన వైద్యుడు లేడు. శరీరం తనంతట తాను స్వస్థత పొందడానికి దోహదపడే సహజసిద్ధమైన ఔషధాలు, విధానాలను ఉపయోగించుకొని చికిత్స అందించే పద్ధతే నేచురోపతి. వనమూలికలు, మర్దనా, ఆక్యుపంక్చర్‌, వ్యాయామం, పోషకాహారం ఇలా వివిధ రకాల చికిత్సలు ఇందులో భాగం. మనసు, శరీరం, ఆత్మ… వెరసి మొత్తంగా వ్యక్తికి చికిత్స అందించే లక్ష్యంతో సాగుతుందీ పద్ధతి. నేచురోపతి క్యాన్సర్‌ను తగ్గిస్తుందనడానికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. కానీ, క్యాన్సర్‌ చికిత్స సమయంలో దుష్ప్రభావాల ప్రభావాన్ని కట్టడిచేయడానికి, చికిత్స అనంతరం రోగి కోలుకోవడానికి, జీవన నాణ్యత మెరుగుపడటానికి సాయపడుతుంది.

ప్రాణశక్తికి.. ఆయుర్వేదం
ఆయుర్వేదం వేల ఏండ్ల చరిత్ర కలిగిన భారతీయ వైద్య విధానం. అంతర్గత శుద్ధి ప్రక్రియ, ప్రత్యేక ఆహారం, వనమూలికలు, మర్దన చికిత్స, యోగా, ధ్యానం.. ఆయుర్వేద చికిత్సలో ప్రధానంగా ఉంటాయి. వైద్యంలో భాగంగా ఇచ్చే మూలికా
కషాయాలు వ్యాధి లక్షణాలను తగ్గిస్తాయి, రోగ నిరోధకతను పెంచుతాయి, ఆందోళనను దూరం చేస్తాయి. క్యాన్సర్‌ చికిత్సలో తలెత్తే దుష్ప్రభావాలను కట్టడిచేయడంలో సాయపడతాయి. అయితే ఒక్క విషయం. కేవలం ఆయుర్వేదం ద్వారానే క్యాన్సర్‌ తగ్గుతుందని చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు లేవు. ఆయుర్వేదాన్ని ఆధునిక వైద్యానికి అనుబంధంగానే, అదీ క్యాన్సర్‌ నిపుణుడి (ఆంకాలజిస్ట్‌) సూచన మేరకే ఎంచుకోవాలి. సరైన పాళ్లలో తీసుకోకపోతే ఆయుర్వేద మందులలోని కొన్ని పదార్థాలు రోగికి హాని కలిగించే ఆస్కారమూ ఉంది.

జర్మనీ సంజీవని.. హోమియో!
ఎలాంటి దుష్ప్రభావాలూలేని అతికొద్ది వైద్య విధానాల్లో హోమియోపతి ఒకటని అంటారు. శరీరం తన రుగ్మతలను తానే నయం చేసుకోగలదని విశ్వసించే వైద్యం ఇది. జర్మనీలో ఆవిర్భవించిందీ విధానం. చాలా కొద్దిమొత్తంలో మొక్కలు, ఖనిజాలు లాంటి ప్రకృతి సిద్ధమైన పదార్థాలను ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు.
అలర్జీలు, పార్శపునొప్పి, దీర్ఘకాలిక అలసట, రుమటాయిడ్‌ కీళ్లనొప్పులు, ఆస్తమా, చర్మ సంబంధ అలర్జీలు, వికారం, దగ్గు, జలుబు, కుంగుబాటు, ఒత్తిడి, ఆందోళన లాంటి మానసిక రోగాల చికిత్సలో హోమియోపతిని ఉపయోగిస్తారు. కానీ, హోమియో ఒక్కటే క్యాన్సర్‌ను నయం చేస్తుందనేందుకు శాస్త్రీయమైన ఆధారాలేవీ లేవు. అనుబంధ వైద్యంగా మాత్రం నిరభ్యంతరంగా అనుసరించవచ్చు. రోగులు కూడా హోమియో పట్ల సానుకూలంగా స్పందించడం విశేషం. ఈ ప్రభావాన్ని ‘ప్లాసిబో ఎఫెక్ట్‌’గా అభివర్ణించేవారూ ఉన్నారు.

సుగంధ వైద్యం.. అరోమా థెరపీ
పరిమళ ద్రవ్యాల స్నానం, ఔషధీకృతమర్దనతోనే అసలు చికిత్స మొదలవుతుందని అంటారు హిపోక్రేట్స్‌. అరోమా థెరపీని తైల చికిత్స అనీ అంటారు. ప్రకృతి ప్రసాదించిన మొక్కల కషాయాలను చికిత్సలో ఉపయోగించడం ఈ థెరపీ ప్రత్యేకత. శరీరం, మనసు, ఆత్మ.. ఈ మూడిటిని ఉత్తేజపరచడానికి, శారీరక, భావోద్వేగపరమైన స్వస్థత చేకూర్చడానికి.. సుగంధ తైలాలను వైద్యపరంగా ఉపయోగించుకుంటారు. నొప్పి నుంచి ఉపశమనం కలిగించి, నాణ్యమైన నిద్రను అందించడం ద్వారా అరోమా థెరపీ క్యాన్సర్‌ రోగికి ఊరటనిస్తుంది. ఒత్తిడితోపాటు కుంగుబాటునూ దూరం చేస్తుంది. రోగిలో ఆందోళన, నొప్పి, వికారం, వాంతి తదితరాలను తగ్గించడానికి క్యాన్సర్‌ చికిత్సకు అరోమా థెరపీని జోడించుకోవచ్చు.

ఆహారమే ఔషధం
మన ఆహారమే మనకు ఔషధం. బలవర్ధకమైన భోజనం శరీర వృద్ధికి ఆలంబనగా నిలుస్తుంది. రోగ నిరోధకతను పెంచి స్వస్థతకు బాటలు వేస్తుంది. ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, మంచి కొవ్వులు, నీళ్లు, విటమిన్లు, మినరల్స్‌ క్యాన్సర్‌ చికిత్స సమయంలో రోగికి చాలా అవసరం. కండరాలు బలోపేతం కావడానికి, ఇన్ఫెక్షన్లను అడ్డుకోవడానికి, కణజాలాలకు మరమ్మతు చేయడానికి ప్రొటీన్లు ఉపయోగపడతాయి. భారతీయ వంటకాల్లో ఉపయోగించే దినుసులు క్యాన్సర్‌ను వ్యతిరేకించే లక్షణాలను కలిగి ఉంటాయి. చికిత్స సమయంలో రోగికి ఇచ్చే కొన్నిరకాల మందులు వ్యాధి నిరోధక వ్యవస్థను బలహీనం చేస్తాయి. ఇన్ఫెక్షన్‌ ముప్పును పెంచుతాయి. ఈ సమయంలో ఆహారంలోని పోషకాలు చుట్టూరక్షణ కవచమై నిలుస్తాయి.

కళాత్మకం.. ఆర్ట్‌ థెరపీ
ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తి ఆర్ట్‌ థెరపీకి ఉంది. సృజనాత్మకమైన కళను మానసిక, శారీరక, భావోద్వేగపరమైన ఆరోగ్యం మెరుగు పరుచుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. నలుగురితో పంచుకోవడానికి వీలుకాని ఆలోచనలు, ఉద్వేగాలు, వ్యక్తీకరణలను కళల ద్వారా సున్నితంగా వ్యక్తం చేయవచ్చు. హాస్పిటల్‌ గోడలపై కనిపించే కళాత్మక చిత్రాలు రోగుల్లో తాము సురక్షితమైన వాతావరణంలో ఉన్నామన్న భావనను కలిగిస్తాయి. అలా, పాజిటివ్‌ మైండ్‌సెట్‌ను అలవర్చుకోవడానికి సహకరిస్తుంది ఆర్ట్‌ థెరపీ. బొమ్మలు గీయడమో, చూడటమో మాత్రమే కాదు.. మనసులోని భావాలను కాగితం మీద పెట్టినప్పుడు కూడా మనసుకు సాంత్వన కలుగుతుందంటారు మానసిక నిపుణులు.

ముగింపు
‘ప్రధాన చికిత్స.. అనుబంధ చికిత్సలు..ఇవి మాత్రమే సరిపోవు.క్యాన్సర్‌ రోగికి మరోఔషధమూ కావాలి.అదే ప్రేమ’చెప్పాడు వైద్యుడు.‘అదీ పనిచేయకపోతే?’అడిగాడు రోగి బంధువు.ఒక్క క్షణం నిశ్శబ్దం. ఆ తర్వాత వైద్యుడి సమాధానం..‘డోసేజీ పెంచండి.ఇంకొంత ప్రేమను అందించండి’

డాక్టర్‌ సచిన్‌ మార్దా
సీనియర్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌,
యశోద హాస్పిటల్‌
సోమాజిగూడ

… చింతలపల్లి హర్షవర్ధన్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement