సోమవారం 13 జూలై 2020
Health - May 14, 2020 , 16:55:43

కరోనా: సౌదీకి 835 మంది భారతీయ వైద్యులు

కరోనా: సౌదీకి 835 మంది భారతీయ వైద్యులు

హైదరాబాద్: సౌదీ అరేబియా ప్రభుత్వం కరోనా చికిత్స కోసం వైద్యులను పంపాలని చేసిన విజ్ఞప్తిని భారత్ మన్నించింది. 835 మంది వైద్యులు అక్కడికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసింది. తొలిబ్యాచ్ వైద్యులు, నర్సులు బుధవారం ప్రత్యేక విమానంలో కేరళ నుంచి సౌదీ బయలుదేరి వెళ్లారని అధికారవర్గాలు తెలిపాయి. కరోనా కల్లోలం నేపథ్యంలో యూఏఈ తర్వాత భారత్ వైద్యులను పంపిన రెండో దేశం సౌదీ అరేబియానే. ఇటీవల విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ పశ్చిమాసియా దేశాల మంత్రులతో జరిపిన టెలిఫోన్ సంబాషణల్లో వైద్యుల కొరత అంశం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. ఆ దేశాల్లో పనిచేసే అనేకమంది భారతీయ వైద్యులు ప్రస్తుతం స్వస్థలాల్లో ఉంటున్నారు. వారిని పంపితే తమకు వెసులుబాటు అవుతుందని పలువలురు సూచించారు. ఈ విజ్ఞప్తిని సానుభూతితో పరిశీలిస్తామని మంత్రి జైశంకర్ వారికి చెప్పినట్టు తెలిసింది. మొత్తం 835 మంది వైద్యసిబ్బందిని తరలించేందుకు సౌదీ విమానయాన సంస్థ 'సౌదియా' కోచ్చికి నాలుగు ప్రత్యేక విమానాలు నడుపుతున్నది. అందులో మొదటి విమానం 13న బయలుదేరివెళ్లింది. భారతీయ వైద్య సిబ్బంది తమ విధుల్లో చేరేందుకు తిరిగి సౌదీ వస్తున్నారు అని సౌదీలోని భారత రాయబారకార్యాలయం ట్విట్టర్లో తెలిపింది. అనేక పశ్చిమాసియా దేశాలకు భారత్ మందులు కూడా సరఫరా చేస్తున్నది.


logo