నిమ్మరసంతో ఏయే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో తెలుసా..?


Wed,June 13, 2018 02:41 PM

నిమ్మరసంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే. అలాగే ఫోలేట్, క్యాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్, మాంగనీస్, ప్రోటీన్, కాపర్ తదితర పోషకాలు కూడా నిమ్మరసంలో ఉంటాయి. ఇవి మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. జీర్ణ సమస్యలు

అజీర్ణం, మలబద్దకం తదితర జీర్ణ సమస్యలకు నిమ్మరసం బాగా పనిచేస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని పూర్తిగా పిండి తాగాలి. దీంతో విరేచనం సాఫీగా అవుతుంది. అలాగే తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.

2. దంత సమస్యలు

నిమ్మరసం దంతాలకు ఎంతగానో మేలు చేస్తుంది. దంతాలు పసుపు రంగులోకి మారకుండా చూస్తుంది. నోటి దుర్వాసన, నోట్లో బాక్టీరియా, చిగుళ్ల నుంచి రక్తస్రావం అవడం, దంతాలు, చిగుళ్ల నొప్పులు తదితర సమస్యలను నిమ్మరసం దూరం చేస్తుంది. ఉదయం దంతాలను తోముకునేటప్పుడు టూత్ పేస్ట్‌పై కొద్దిగా నిమ్మరసం చేర్చి దంతాలను తోముకోవాలి. దీంతో మంచి ఫలితం ఉంటుంది.

3. కేశాల సంరక్షణ

వెంట్రుకలను సంరక్షించడంలోనూ నిమ్మరసం బాగానే పనిచేస్తుంది. జుట్టు కుదుళ్లపై నిమ్మరసం బాగా పనిచేస్తుంది. చుండ్రు, వెంట్రుకలు రాలిపోడం, వెంట్రుకలు పల్చబడడం వంటి సమస్యలు పోతాయి. అందుకు ఏం చేయాలంటే.. కొద్దిగా నిమ్మరసం తీసుకుని జుట్టు కుదుళ్లకు తగిలేలా రాస్తూ బాగా మర్దనా చేయాలి. 30 నిమిషాల పాటు వేచి ఉన్నాక తలస్నానం చేయాలి. వారంలో 2, 3 సార్లు ఇలా చేస్తే వెంట్రుకలు నిగారింపును సంతరించుకుంటాయి. జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు బాధించదు.

4. అధిక బరువు

అధిక బరువును తగ్గించుకునేందుకు కూడా నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి ఉదయాన్నే పరగడుపునే తాగాలి. దీంతో కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.

5. కిడ్నీ స్టోన్స్

నిమ్మరసాన్ని తరచూ ఏదో ఒక రూపంలో తీసుకుంటుంటే కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. మళ్లీ అవి రాకుండా ఉంటాయి. కిడ్నీ స్టోన్లను కరిగించడంలో నిమ్మరసం బాగా పనిచేస్తుంది. నిమ్మరసంలో ఉండే సిట్రేట్ గుణాలు కిడ్నీ స్టోన్లను కరిగిస్తాయి. కిడ్నీ స్టోన్లు ఏర్పడకుండా చూస్తాయి.

6. ఒంట్లో నీరు చేరడం

కొందరికి అప్పుడప్పుడు ఒంట్లో నీరు ఎక్కువగా చేరుతుంటుంది. అందుకు అనేక కారణాలుంటాయి. అలాంటి వారి శరీరం లావుగా కనిపిస్తుంది. ఆయా భాగాల్లో వేళ్లతో నొక్కితే చర్మం లోపలికి పోతుంది. అలాంటి వారికి నిమ్మరసం బాగా పనిచేస్తుంది. వారు నిమ్మరసాన్ని ఏదో ఒక విధంగా రోజూ తీసుకుంటే శరీరంలో అధికంగా ఉన్న నీరు బయటికి పోతుంది. నిమ్మరసంలో ఉండే డై యురెటిక్ గుణాలు శరీరంలో అధికంగా ఉండే నీటిని బయటకు పంపుతాయి.

7. వ్యర్థాలు

శరీరాన్ని అంతర్గతంగా శుభ్రం చేసుకోవాలన్నా, లివర్, కిడ్నీలు శుభ్రం అవ్వాలన్నా అందుకు నిమ్మరసం బాగా పనిచేస్తుంది. శరీరంలో ఇన్‌ఫెక్షన్లను కలిగించే బాక్టీరియాను నిమ్మరసం నాశనం చేస్తుంది.

8. రోగ నిరోధక శక్తి

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, తరచూ ఇన్‌ఫెక్షన్లు, జలుబు, జ్వరం, దగ్గు బారిన పడే వారు రోజూ తమ ఆహారంలో నిమ్మరసాన్ని భాగం చేసుకుంటే ఫలితం ఉంటుంది. నిమ్మరసాన్ని రోజూ తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది.

5801

More News

VIRAL NEWS