రాగులను రోజూ తీసుకుంటే కలిగే అద్భుతమైన లాభాలు ఇవే తెలుసా..?


Sat,March 10, 2018 12:54 PM

చిరు ధాన్యాల్లో రాగులకు ప్రత్యేక స్థానం ఉంది. వీటి పిండితో రొట్టెలు చేసుకుని తినవచ్చు. కొందరు జావ తయారు చేసుకుని తాగుతారు. అయితే ఎలా తిన్నా రాగులు మాత్రం అనేక లాభాలను అందిస్తాయి. రాగి పిండితో చేసిన రొట్టెలను తింటున్నా, రాగి జావ రోజూ తాగినా లేదంటే రాగి ముద్దలను తిన్నా మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి కావల్సిన ముఖ్య పోషకాలు అందుతాయి. మరి రాగులతో మనకు కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..!

1. కాల్షియం
రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల రాగులతో 344 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. ఇది మన శరీరంలో ఎముకలు, దంతాలకు ఉపయోగపడుతుంది. దంతాలు, ఎముకలు దృఢంగా మారుతాయి. కీళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి. ఎదిగే పిల్లలకు చాలా మేలు చేస్తుంది. వారిలో ఎముకలు దృఢంగా ఉంటాయి.

2. మధుమేహం
రాగుల గ్లయిసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. దీంతో దీని ఆహారం రక్తంలో నెమ్మదిగా కలుస్తుంది. ఫలితంగా గ్లూకోజ్ అంత త్వరగా ఎక్కువ స్థాయికి చేరదు. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అంతేకాకుండా రాగుల్లో పాలీఫినాల్స్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మధుమేహాన్ని అదుపు చేస్తాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి.

3. చర్మం
రాగుల్లో చర్మానికి మేలు చేసే మిథియోనైన్, లైసిన్ వంటి అమైనో యాసిడ్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ముడతలు పడనీయకుండా చూస్తాయి. దీంతో వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావు. అలాగే పాడైపోయిన చర్మ కణాలు పునరుద్ధరింపబడతాయి. దీంతో చర్మంపై మచ్చలు తగ్గిపోతాయి.

4. విటమిన్ డి
సూర్యకాంతి ద్వారా మనకు విటమిన్ డి లభిస్తుందని తెలిసిందే. అయితే రాగుల్లో కూడా ఈ విటమిన్ ఉంటుంది. నిత్యం రాగులను ఏదో ఒక రూపంలో తీసుకుంటే దాంతో విటమిన్ డి లోపం సమస్యను అధిగమించవచ్చు.

5. రక్తహీనత
రక్తహీనత సమస్యతో బాధపడే వారికి రాగులు చక్కని ఔషధం అని చెప్పవచ్చు. వీటిల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం ఎక్కువగా తయారు అయ్యేలా చేస్తుంది. దీంతో రక్త హీనత సమస్య పోతుంది.

6. మానసిక సమస్యలు
ఆతురత, డిప్రెషన్, నిద్రలేమి, మానసిక ఒత్తిడి తదితర సమస్యలను నయం చేసే గుణాలు రాగుల్లో ఉన్నాయి. తలనొప్పిని కూడా ఇవి తగ్గిస్తాయి. శరీరానికి ప్రశాంతతను చేకూరుస్తాయి.

7. బరువు
రాగులను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే బరువు తగ్గవచ్చని వైద్యులు చెబుతున్నారు. వీటిల్లో ఉండే ఫైబర్ కడుపులో ఎక్కువ సేపు ఉంటుంది కనుక అంత త్వరగా ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గవచ్చు.

8. ఇతర లాభాలు
రాగులను నిత్యం ఏదో ఒక విధంగా తీసుకోవడం వల్ల బీపీ తగ్గుతుంది. గుండె సమస్యలు రావు. జీర్ణ సమస్యలు పోతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వేసవిలో దాహం సమస్య తీరుతుంది. రాగుల్లో ఉండే అయోడిన్ థైరాయిడ్ సమస్యలకు చెక్ పెడుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

10081

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles