గురువారం 02 ఏప్రిల్ 2020
Health - Feb 07, 2020 , 14:21:52

చలికాలంలో పిల్లల ఆరోగ్యాన్ని కాపాడండిలా..!

చలికాలంలో పిల్లల ఆరోగ్యాన్ని కాపాడండిలా..!

చలికాలం వచ్చిందంటే చాలు.. పెద్దలకే కాదు.. పిల్లలకూ శ్వాస కోశ సమస్యలు ఎదురవుతుంటాయి. దగ్గు, జలుబు, జ్వరం తదితర అనారోగ్య సమస్యలు పెద్దల కన్నా పిల్లల్నే ఎక్కువగా ఇబ్బందులకు గురిచేస్తాయి. ఈ క్రమంలో పిల్లల ఆరోగ్యాన్ని కాపాడడం చాలా అవసరం. కింద సూచించిన పలు సలహాలను పాటిస్తే చలికాలంలో పిల్లల్ని ఇన్‌ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యల బారి నుంచి కాపాడవచ్చు. మరి ఆ సలహాలు, సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

  1.  చలికాలంలో పిల్లలు పొద్దున్నే నిద్ర లేవడానికి బద్దకిస్తుంటారు. ఈ సమస్య లేకుండా చేయాలంటే.. పిల్లల్ని రాత్రిపూట త్వరగా పడుకోబెట్టాలి. అలాగే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలను రాత్రి పూట ఇవ్వాలి. దీంతోపాటు పాలను కూడా తాగించాలి. దీంతో చక్కగా నిద్ర పడుతుంది. ఉదయాన్నే ఉత్సాహంగా నిద్ర లేస్తారు.
  2.  చలికాలంలో రాత్రి లేదా పగలు ఎప్పుడైనా సరే పిల్లలు బయటకు వెళ్తుంటే ఉన్ని దుస్తులు వేయాలి. ఈ కాలంలో ఐస్‌క్రీములు, కూల్ డ్రింక్‌లు వంటివి కొనివ్వడం మానేయాలి.
  3. పిల్లల తలను కప్పి ఉంచేలా స్వెటర్, మంకీ క్యాప్‌లను ధరింపజేయాలి. చలికి పాదాలు పగలకుండా ఉండేందుకు సాక్సులు, షూ ధరింపజేయాలి. చేతులకు గ్లోవ్స్ వేయాలి.
  4.  పిల్లల ఆహారం విషయంలో చలికాలం జాగ్రత్తగా ఉండాలి. వారికి వీలైనంత వరకు వేడిగా ఉండే ఆహారాలను ఇవ్వాలి. మధ్యాహ్నం లంచ్ కూడా వేడిగా ఉండేలా హాట్ బాక్స్‌లో పెట్టి పంపాలి.
  5.  వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండేందుకు యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను ఇవ్వాలి. తాజా కూరగాయలు, ఆకు కూరలు, సూప్స్, క్యారెట్లు, టమాటాలతో వండిన ఆహారాలను ఇవ్వాలి. నట్స్ వంటి వాటిని తినిపించాలి.
  6. చలికాలంలో పిల్లల చర్మం మరింత ఎక్కువగా పగులుతుంది. దాన్ని నివారించేందుకు మాయిశ్చరైజింగ్ క్రీములను రాయాలి.
  7. చలికాలం అయినా సరే పిల్లలకు ఉదయం, సాయంత్రం స్నానం చేయించాలి. దీని వల్ల శరీరంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి పోతాయి. చర్మం పగలకుండా ఉంటుంది.


logo