శనివారం 05 డిసెంబర్ 2020
Health - Oct 30, 2020 , 19:11:54

చలికాలంలో ఈ ఏడు పండ్లు తినాల్సిందే..!

చలికాలంలో ఈ ఏడు పండ్లు తినాల్సిందే..!

హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో రోగనిరోధక శక్తి తప్పనిసరైంది. ఇమ్యూనిటీ పవర్‌ ఉన్నవారికి కరోనాతోపాటు ఫ్లూ, ఇతర వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ. ఇందుకోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన పనిలేదని నిపుణులు పేర్కొంటున్నారు. మార్కెట్లో లభించే సీజనల్‌ ఫలాలు తింటే సరిపోతుందని సూచిస్తున్నారు. ఈ ఏడు పండ్లను తింటే రోగనిరోధకశక్తి ఆటోమేటిక్‌గా పెరుగుతుందని చెబుతున్నారు. 

1. జామ

తీపి, రుచికరమైన జామపండ్లు ఈ సీజన్‌లో విరివిగా లభిస్తాయి. ఇందులో విటమిన్ ‘సి’, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. కణాల నష్టాన్ని నివారిస్తాయి. ఇందులో పీచుపదార్థం కూడా ఎక్కువగానే ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చూస్తుంది. రక్తంలో చక్కెరస్థాయిని నియంత్రిస్తుంది. 

2. పియర్స్‌..

ఇది లేత ఆకుపచ్చరంగులో మృదువుగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు దీన్ని ఇష్టంగా తింటారు. దీన్ని క్రమంతప్పకుండా తీసుకుంటే పేగులు శుభ్రపడతాయి. ఇందులో విటమిన్‌ ‘ఇ’, ‘సి’, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. 

3. నారింజ

నారింజలాంటి సిట్రస్‌ పండ్లు సీజనల్‌ అంటువ్యాధుల ప్రమాదాన్ని నివారించగలవు. ఇందులో విటమిన్‌ ‘సి’, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. దీర్ఘకాలిక రోగాలు రాకుండా కూడా చూస్తుంది. నారింజరసం ప్రతిరోజూ తాగితే ఉత్సాహంగా ఉండవచ్చు.

4. ఆపిల్స్..

ఆపిల్స్‌ను చలికాలంలో తీసుకోవడం వల్ల చాలా రోగాలకు చెక్‌ పెట్టవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. పెక్టిన్ ఫైబర్, విటమిన్ ‘సి’, ‘కే’ ఇందులో సమృద్ధిగా ఉంటాయి. అందుకే ప్రతిరోజూ ఒక ఆపిల్‌ తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. 


5. మోసాంబి

మోసాంబి లేదా బత్తాయి.. నారింజ, పోమెలోస్ యొక్క సిట్రస్ కుటుంబానికి చెందినది. ఇందులో విటమిన్‌ ‘సి’ సమృద్ధిగా ఉంటుంది. ఇందులో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. అయితే, అన్‌స్ట్రైన్డ్ జ్యూస్ తాగితే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

6. దానిమ్మ

దానిమ్మ రూబీ ఎరుపులో మెరిసిపోతూ ఉంటుంది. దీన్ని అనార్‌ అని పిలుస్తారు. తీయగా ఉంటుంది. ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా రక్షణ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. రక్తాన్ని గడ్డకట్టకుండా చూస్తుంది. బీపీని నియంత్రణలో ఉంచుతుంది. గుండెకు చాలా మంచింది. బరువు తగ్గాలనుకునేవారు దీన్ని తినాలి. చర్మ సంరక్షణకు తోడ్పడుతుంది.  


7.ఆలుబుఖారా(ప్లం)

ప్లం లేదా ఆలుబుఖారాలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్‌ రాకుండా నివారిస్తుంది. రోజూ ఆల్‌బుఖారా తింటే ఫ్లూ, జ్వరం రాకుండా చూస్తుంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.