టైప్ 2 డయాబెటిస్‌ను అదుపులో ఉంచే చిట్కాలు..!


Mon,June 18, 2018 04:11 PM

శరీరంలో క్లోమ గ్రంథి ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌ను శరీరం సరిగ్గా ఉపయోగించుకోకపోతే రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరిగి టైప్ 2 డయాబెటిస్ సమస్య వస్తుందని అందరికీ తెలిసిందే. ఇందుకు అనేక కారణాలుంటాయి. వ్యాయామం చేయకపోవడం, రోజూ తగినంత నిద్రపోకపోవడం, రాత్రిపూట మేల్కొని ఉండడం, అతిగా తినడం తదితర అనేక అంశాలు టైప్ 2 డయాబెటిస్ రావడానికి కారణమవుతాయి. ఈ క్రమంలో ఈ వ్యాధి బారిన పడిన వారు వైద్యులను సంప్రదించి తగు రీతిలో మందులను వాడుకోవాలి. అలాగే నిత్యం వ్యాయామం చేయడంతోపాటు సరైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి. ఇక టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు కింద సూచించిన పలు చిట్కాలను పాటిస్తే డయాబెటిస్‌ను మరింత చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. రాగి పాత్రలో రాత్రి పూట నీటిని పోసి రాత్రంతా ఆ పాత్రను అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ రాగి పాత్రలో ఉండే నీటిని పరగడుపునే తాగాలి. ఇలా చేయడం వల్ల డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.

2. స్వీట్లు, పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం, పాల ఉత్పత్తులు తీసుకోవడం తగ్గించాలి. వాటికి బదులుగా తాజా పండ్లు, కూరగాయలను తినాలి. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.

3. నిత్యం తినే ఆహారంలో పసుపును ఎక్కువగా వాడాలి. పసుపు డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది.

4. అర టీస్పూన్ బిర్యానీ ఆకు చూర్ణం, అర టీస్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్‌లను తీసుకుని బాగా కలిపి మిశ్రమంగా చేయాలి. ఈ మిశ్రమాన్ని రోజూ రెండు సార్లు ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తీసుకోవాలి. ఇలా చేస్తే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది.

5. రాత్రి పూట గుప్పెడు మెంతులను తీసుకుని నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని తాగి అనంతరం ఆ మెంతులను తినేయాలి. పరగడుపునే వాటిని తినాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల షుగర్ వ్యాధి కచ్చితంగా అదుపులోకి వస్తుంది.

6. రోజూ ఉదయాన్నే పరగడుపున ఒక టీస్పూన్ అల్లం రసం సేవించాలి. అల్లంలో ఉండే ఔషధ గుణాలు షుగర్ వ్యాధిని తగ్గిస్తాయి.

3626

More News

VIRAL NEWS