బుధవారం 23 సెప్టెంబర్ 2020
Health - Jul 11, 2020 , 18:38:01

కళ్లపై ఒత్తిడిని తగ్గించే ఆరు చిట్కాలివే..

కళ్లపై ఒత్తిడిని తగ్గించే ఆరు చిట్కాలివే..

ముంబై: సర్వేంద్రియానాం నయనం ప్రధానం.. అనేది పెద్దల మాట. అందువల్ల కంటి ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. అయితే, ప్రస్తుత డిజిటల్‌ ప్రపంచంలో ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెస్‌ వాడడం తప్పనిసరి. కొవిడ్‌ నేపథ్యంలో వర్క్‌ ఫ్రం హోమ్‌ కల్చర్‌ పెరిగి, చాలామంది ల్యాప్‌టాప్‌లకు అతుక్కుపోతున్నారు. ఆన్‌లైన్‌ క్లాస్లుల పేరిట పిల్లలూ ఫోన్లతోపాటు ల్యాప్‌టాప్‌లు వాడుతున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ కళ్లు ఒత్తిడికి లోనవుతున్నాయి. కంటి సమస్యలు భయపెడుతున్నాయి. 

2018 లో బీఎంజే ఓపెన్ ఆప్తాల్మాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, డిజిటల్ పరికరాల వినియోగం వల్ల కళ్లపై ఒత్తిడి 50% కంటే ఎక్కువ మందిలో కనిపిస్తోంది. దీన్నే కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోం అంటారు. కళ్లు మండడం, చికాకు, అస్పష్టత, పొడిబారడంలాంటివి దీని బాహ్య లక్షణాలు, తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి అంతర్గత లక్షణాలు.  మీరు ఈ లక్షణాల్లో దేనినైనా ఎదుర్కొంటుంటే, ఈ సమయంలో మీ కళ్లపై ఒత్తిడిని తగ్గించుకునేందుకు మీరు ఆరు అలవాట్లను పెంచుకోవాలి. 

  • బ్రైట్‌నెస్‌ తగ్గించండి..

మీరు టీవీ చూస్తున్నా.. మీ కంప్యూటర్‌పై పనిచేస్తున్నా లేదా మీ మొబైల్ ఫోన్‌ చూస్తున్నాఅందులో మొదట బ్రైట్‌నెస్‌ తగ్గించండి. గదిలో షేడెడ్ లైట్లను ఉపయోగించండి. పనిఅయిపోయిన తర్వాత గదిలో లైట్లను ఆర్పేయండి. 

  • స్క్రీన్ సమయాన్ని తగ్గించండి.

 ప్రతిఒక్కరూ స్క్రీన్‌ సమయాన్నితగ్గించండి. కంప్యూటర్‌పై పని అయిపోగానే ఫోన్‌ చూడడం లాంటివి చేయకండి. ముఖ్యంగా పిల్లలు స్క్రీన్‌ సమయాన్ని చాలా తగ్గించాల్సి ఉంటుంది. 

  •  విరామం తీసుకోండి.. 

ప్రతి 20 నిమిషాల తర్వాత స్క్రీన్ నుంచి విరామం తీసుకోండి. ఇరవై సెకన్లపాటు 20 అడుగుల దూరంలో (కిటికీకి వెలుపల) ఉన్నఏదైనా వస్తువును చూడండి. దీనిని 20-20 నియమం అని కూడా అంటారు. మీకు వీలయినప్పుడు, ఐదు నిమిషాలు మీ కళ్లను మూసుకోండి. 

  • కంటి అద్దాలు వాడండి..

నేత్ర వైద్యుడిని సంప్రదించి, అతినీలలోహిత కిరణాలు, అదనపు కాంతి మొదలైన వాటి నుండి మీ కళ్లను రక్షించగల అద్దాలను తీసుకోండి. సరైన అద్దాలు పొందడం వల్ల మీ కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. ప్రత్యామ్నాయంగా, మీరు మీ పరికరాల కోసం యాంటీ గ్లేర్ స్క్రీన్ ప్రొటెక్టర్లను కూడా పొందవచ్చు. 

  • కళ్లను బ్లింక్‌ చేస్తూ ఉండండి..

మీరు స్క్రీన్‌పై ఎక్కువ దృష్టి పెడతారు. కాబట్టి ఎక్కువగా కళ్లను బ్లింక్‌ చేస్తూ ఉండాలి. కళ్లలో తేమను ఉత్పత్తి చేయడానికి ఇది అత్యంత అవసరం. కాబట్టి, స్క్రీన్‌ను చూసేటప్పుడు మీరు తరచుగా కంటిరెప్పలను మూస్తూ తెరుస్తూ ఉండాలి.

  •  కంటి చుక్కలు వేసుకోండి. 

నేత్ర వైద్యుడిని తరచూ సంప్రదిస్తూ ఉండాలి. వారు ఇచ్చే కంటి చుక్కలను వాడాలి.  తగినంత నీరు తాగుతూ, విటమిన్ ఏ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. దోసకాయముక్కలను చక్రాలుగా కోసం కళ్లపై ఉంచితే కంటి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo