చర్మాన్ని సంరక్షించుకోవాలంటే వీటిని తినాలి..!


Sun,July 15, 2018 12:07 PM

మనం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని అందరికీ తెలిసిందే. పౌష్టికాహారం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. శరీర నిర్మాణం సరిగ్గా జరుగుతుంది. అలాగే అన్ని అవయవాలు సంరక్షింపబడతాయి. అయితే నిత్యం మనం సరైన ఆహారాన్ని తీసుకోకపోతే ఆరోగ్యంపైనే కాదు, మన చర్మంపైన కూడా ఆ ప్రభావం పడుతుంది. కనుక ఎవరైనా కింద సూచించిన విధంగా పలు ఆహారాలను తరచూ తీసుకుంటే దాంతో ఆరోగ్యం సంరక్షింపబడుతుంది. మరో వైపు చర్మం కూడా సురక్షితంగా ఉంటుంది. మరి చర్మ సంరక్షణకు మనం తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. వీటి వల్ల చర్మం ఎప్పుడూ తేమతో ఉంటుంది. పొడిగా మారదు. అలాగే చర్మం మృదువుగా ఉంటుంది. పొడి చర్మం సమస్యతో ఇబ్బంది పడేవారు చేపలను ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.

2. అవకాడాల్లో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. వయస్సు మీద పడడం కారణంగా వచ్చే ముడతలు తగ్గుతాయి. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. తరచూ అవకాడోలను తీసుకుంటే చర్మ సమస్యల నుంచి బయట పడవచ్చు.

3. చర్మాన్ని సంరక్షించుకునేందుకు నిత్యం కొన్ని వాల్‌నట్స్‌ను తీసుకోవాలి. వీటిల్లో ఉండే ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు చర్మంపై వచ్చే వాపులను తగ్గిస్తాయి. సోరియాసిస్ సమస్యను తగ్గిస్తాయి. వాల్‌నట్స్‌లో ఉండే జింక్ చర్మాన్ని సంరక్షిస్తుంది.

4. పొద్దు తిరుగుడు విత్తనాల్లో సెలీనియం, జింక్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మానికి ఎల్లప్పుడూ తేమను అందిస్తాయి. చర్మం మృదువుగా ఉండేలా చేస్తాయి. చర్మంపై ఏర్పడే ముడతలు తగ్గుతాయి.

5. టమాటాల్లో విటమిన్ సి, కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. దీంతోపాటు బీటా కెరోటిన్, లైకోపీన్‌లు ఉంటాయి. ఇవి సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల బారి నుంచి మన చర్మాన్ని సంరక్షిస్తాయి.

6. నిత్యం గ్రీన్ టీని తాగినా చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. గ్రీన్ టీ తాగడం వల్ల చర్మంపై ఉండే ముడతలు పోతాయి. చర్మం మృదువుగా మారుతుంది.

3208

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles