మంగళవారం 11 ఆగస్టు 2020
Health - Jul 14, 2020 , 21:52:33

యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌.. ఆరోగ్యానికి బెటర్‌..

యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌.. ఆరోగ్యానికి బెటర్‌..

హైదరాబాద్‌: యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌.. మన దేశంలో సూపర్‌మార్కెట్లలో కనిపించే ఈ ద్రావణంతో ఆరోగ్యప్రయోజనాలెన్నో ఉన్నాయట. రోజూ ఒక యాపిల్‌ తింటే డాక్టర్‌కు దూరంగా ఉండవచ్చు అని వైద్యుల మాట. అయితే, యాపిల్‌ను క్రష్‌, స్వేదనం చేసి, పులియబెట్టిగా వచ్చే ఈ ద్రావణంతోనూ అంతకుమించి ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. చర్మ నిగారింపుకూ ఇది తోడ్పడుతుంది. ప్రపంచ ప్రఖ్యాత గ్రీకు వైద్యుడు హిపోక్రటీస్‌ ఈ యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను ఆరోగ్య సంరక్షణ టానిక్‌గా ప్రజలకు సిఫార్సు చేశారు.  దీంతో ముఖ్యంగా ఆరు రకాల ప్రయోజనాలున్నాయని హెల్త్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. 

1. జీర్ణక్రియకు సహాయపడుతుంది..

యాపిల్‌ సైడర్ వెనిగర్ ఆమ్ల రుచిని కలిగి ఉంటుంది. కానీ, ఇది కడుపులోని ఎసిడిటీ, అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్‌. మలబద్దకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే పెక్టిన్ ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది.

2.కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను తగ్గిస్తుంది..

యాపిల్‌ సైడర్ వెనిగర్‌లోని ఎసిటిక్ ఆమ్లం కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి, తగ్గించడానికి సహాయపడుతుందని 2006లో బ్రిటీష్‌ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం పేర్కొంది.  ప్రతి ఉదయం ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలిపి తాగితే కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ తగ్గుతాయని వివరించింది.  ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. దీంతో పేగులు శుభ్రపడి, జీర్ణవ్యవస్థ సాఫీగా ఉంటుంది. అలాగే, రక్తం నుంచి  కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది.  

3.రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది..

యాపిల్‌ సైడర్ వెనిగర్ ఇన్సులిన్ సున్నితత్వం, పనితీరును మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అందువల్ల డయాబెటిస్‌ ఉన్నవారికి యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ ఓ ఇంటి చిట్కాగా ఉపయోగపడుతుంది.

4.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది..

ఇది కొలెస్ట్రాల్, జీర్ణక్రియ, రక్తంలో చక్కెరపై అద్భుతాలు చేస్తుంది కాబట్టి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. యాపిల్‌ సైడర్ వెనిగర్ గుండె జబ్బులతో పోరాడగలదని విస్తృతంగా నమ్ముతారు. అయితే దీనిపై మరింత పరిశోధన అవసరం ఉందని సైంటిస్టులు పేర్కొంటున్నారు.

5.చర్మ నిగారింపునకు తోడ్పడుతుంది..

చాలా చర్మ సమస్యలు హార్మోన్లు, జీర్ణ వ్యవస్థ, రక్త మలినాలతో ముడిపడి ఉంటాయి. యాపిల్ సైడర్ వెనిగర్ ఈ మూడు సమస్యలను తగ్గించడంతోపాటు చర్మ నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే, దీన్ని నేరుగా చర్మంపై పూయకూడదు. ప్రతిరోజూ నీటిలో కలుపుకొని మాత్రమే తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. 

6.గొంతు నొప్పిని తగ్గిస్తుంది..  

యాపిల్‌ సైడర్ వెనిగర్ యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. అందుకే గొంతు నొప్పి తగ్గించేందుకు ఇది బాగా పనిచేస్తుంది. సగం టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్‌ను గోరువెచ్చని నీటితో కలిపి, దానితో గార్గిల్‌ చేయాలి. దీంతో గొంతునొప్పి అతివేగంగా తగ్గిపోతుంది.logo