మన శరీరంలోని అన్ని అవయవాల్లో కళ్లు చాలా ముఖ్యమైనవి. కళ్లు లేకపోతే మనం ఈ ప్రపంచంలో దేన్నీ చూడలేము. అందువల్ల కళ్లను సంరక్షించుకోవాలి. భగవంతుడు మనకు ప్రసాదించిన వరాల్లో కంటి చూపు కూడా ఒకటి. అయితే నేటి తరుణంలో చాలా మందికి పలు కారణాల వల్ల కంటి చూపు సమస్య వస్తున్నది. దీంతోపాటు ఇతర నేత్ర సమస్యలతోనూ చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి వారు కింద సూచించిన చిట్కాలను పాటిస్తే దాంతో కంటి చూపును పెంచుకోవడమే కాదు, కంటి సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే...
1. మన కళ్లు చాలా సున్నితమైనవి. కనుక వాటికి ఏ క్రీం పడితే అది రాయకూడదు. లేదంటే ఇన్ఫెక్షన్ బారిన పడతాయి. అలాగే కొందరు కళ్లలో డాక్టర్ సూచన లేకుండానే పలు రకాల ఐ డ్రాప్స్ వాడుతుంటారు. వాటితో దీర్ఘకాలంలో సమస్యలు వస్తాయి. కనుక వాటిని డాక్టర్ సూచన మేరకే వాడుకోవాలి. దీంతో కళ్లు సురక్షితంగా ఉంటాయి.
2. అర టీస్పూన్ కీరా రసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని కళ్లకు రాసుకుని అరగంట సేపు ఉంచి ఆ తర్వాత కడుక్కుంటే కళ్లు ఆకర్షణీయంగా ఉంటాయి.
3. కళ్లకు విశ్రాంతి ఎంతైనా అవసరం. తగినంత ఎక్కువ సేపు నిద్ర పోవడం వల్ల కళ్లకు రెస్ట్ దొరికి తాజాగా కనపడతాయి.
4. గ్లాస్ నీటిలో ఉసిరిపొడి నానబెట్టి ఉదయాన్నే ఈ మిశ్రమంతో కళ్లను కడుక్కుంటే తాజాగా మెరుస్తాయి. ఉసిరి అన్ని విధాలా ప్రయోజనకారే.కళ్ల చుట్టూ ఉండే ముడతలు పోవాలంటే పాల మీగడతో మసాజ్ చేసుకుంటే ముడతల నుండి విముక్తి పొందవచ్చు .
5. కొందరికి నిద్రలేమి, అలసట, ఇతర సమస్యల కారణంగా కళ్లు ఉబ్బినట్లు కనిపిస్తుంటాయి. ఇలాంటి వారు గుడ్డులోని తెల్ల సొనను కళ్ల అడుగున రాసుకోవాలి. పది నిమిషాల తరువాత కడిగేసుకుంటే ఆ సమస్య తగ్గుతుంది.