ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Health - Jul 12, 2020 , 18:26:05

మూడు ఆరోగ్యకర అలవాట్లతో నూరేళ్లు బతకొచ్చు..!

మూడు ఆరోగ్యకర అలవాట్లతో నూరేళ్లు బతకొచ్చు..!

హైదరాబాద్‌: ప్రస్తుతం మానవుడి సగటు వయస్సు 60 నుంచి 70 ఏళ్లని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, ఓ మూడు ఆరోగ్యకర అలవాట్లను క్రమంతప్పకుండా పాటించేవారు వందేళ్లు ఆరోగ్యంగా జీవిస్తున్నట్లు ఓ తాజా అధ్యయనంలో తేలింది. వందేళ్లు జీవిస్తున్నవారిలో ఆరోగ్యకరమైన జీవనశైలి, జీవితం పట్ల వారికున్న సానుకూల దృక్పథం అగ్రస్థానంలో ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. చాలాకాలంగా అనుకుంటున్నట్లు జన్యువులు ఇందుకు కారణం కావడం లేదని తేల్చారు. జన్యువులు మనిషి చుట్టూ ఉన్న పర్యావరణం, జీవనశైలిలా దీర్ఘాయువులో పెద్దగా పాత్ర పోషించలేవని గుర్తించారు. నిండు నూరేళ్ల జీవితానికి తోడ్పడుతున్న మూడు ఆరోగ్యకర అలవాట్లను వివరించారు.  

1. ఆరోగ్యకరమైన ఆహారం..

ఆరోగ్యకరమైన, సమతులాహారం మంచి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. పిండి పదార్థాలు, ప్రోటీన్లు, అసంతృప్త కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, నీరు ఉన్న ఈ ఏడింటిని సమతులాహారం అంటాం. శరీరంలోని వివిధ జీవక్రియ చర్యల్లో నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగేలా చూసుకోవాలి. అలాగే, అతిగా తినడం వెంటనే మానేయాలి. ఇది ఊబకాయానికి దారితీస్తుంది. అలాగే, దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది. కేలోరిక్ పరిమితిని పాటించాలి. రోజూ మనకు ఎన్ని కేలరీల ఆహారం అవసరం? ఎన్ని కేలరీలు ఖర్చు చేస్తున్నాం అనేది చెక్ చేసుకోవాలి. అవసరమైతే డైటీషయన్‌ సలహాలు పాటించాలి. ఇది దీర్ఘాయువును ప్రోత్సహించడానికి ఒక అద్భుతమైన మార్గం. ఇది బరువు తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

2. క్రమంతప్పకుండా వ్యాయామం చేయండి..

క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల కండరాలు బలంగా మారుతాయి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్‌తో సహా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్నిఇది తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. నిరాశను తగ్గిస్తుంది. మానసిక స్థితి బాగుంటుంది. రోజూ కనీసం 30 నిమిషాల మితమైన, శక్తివంతమైన వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో అధిక వ్యాయామం మంచికంటే ఎక్కువ హాని కలుగజేస్తుంది. 5-10 నిమిషాల దినచర్యతో నెమ్మదిగా వ్యాయామాన్ని ప్రారంభించాలి. వ్యవధి, తీవ్రతను క్రమంగా పెంచాలి.

3. థింక్‌ పాజిటివ్‌..

సానుకూల దృక్పథం మీ మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఇది నిరాశ,  వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యూఎస్‌ఏలో ఇటీవల చేసిన 35 ఏళ్ల అధ్యయనం ఆశావాదం, మరణాల రేటు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని చూపించింది. మరోవైపు, ఒత్తిడి, ఆందోళన వివిధ రోగలక్షణ పరిస్థితులను ప్రేరేపిస్తాయి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామాలు, ధ్యానం చేయాలి. మంచి ఆలోచనలే ఉత్తమ ఆరోగ్యానికి రాచబాటలా నిలుస్తాయి.   


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo