గురువారం 25 ఫిబ్రవరి 2021
Health - Jan 25, 2021 , 13:29:15

దేశంలో ఊబకాయులు పెరుగుతున్నారు..

దేశంలో ఊబకాయులు పెరుగుతున్నారు..

దేశంలో పోషకాహార లోపంతోపాటు ఊబకాయం పెరిగిపోతున్నది. దేశవ్యాప్తంగా 45 ఏండ్లలోపు వారిలో దాదాపు 25 కోట్ల మంది పోషకాహార లోపంతోగానీ, ఊబకాయంతోగానీ బాధపడుతున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక స్పష్టం చేస్తున్నది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) ను విడుదల చేసింది. ఈ బీఎంఐ దేశ జనాభాలో ఎంత మందికి సరైన పోషకాలు లభిస్తున్నాయో వెల్లడిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఊబకాయుల సంఖ్య ఎక్కువే ఉన్నదని నివేదిక హెచ్చరిస్తున్నది.

బీఎంఐ డాటా ప్రకారం, భారతదేశంలో నివసిస్తున్న 45 సంవత్సరాల లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి జనాభాలో సగం మంది పోషక లోపం లేదా అధిక బరువు కలిగి ఉన్నారు. 45 ఏండ్ల వయసు దాటిన వారిలో దాదాపు 21 శాతం మంది అధిక బరువు కలిగి ఉండగా.. 7 శాతం ఊబకాయంతో బాధపడుతున్నారు. ఈ నివేదిక ప్రకారం, పోషకాలు లేని ప్రజలు చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అధిక బరువు విషయానికొస్తే.. ఎక్కువ మంది మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తున్నది. 

బాడీ మాస్ ఇండెక్స్‌ అంటే ఏమిటి?

ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. పురుషుల బరువు, వయస్సు ప్రకారం 5 కిలోల నుంచి 65 కిలోల మధ్య ఉండాలి. మహిళలు బరువు 5 నుంచి 60 కిలోలలోపు ఉండాలి. ఈ ప్రాతిపదికన, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచికను తయారు చేస్తుంది. వివిధ వయసుల వారికి బరువును కేటాయించడం ద్వారా అధిక బరువు లేదా తక్కువ బరువు డేటాను ఇవ్వగలుగుతారు. దీనిని బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ) అంటారు. భోపాల్‌లోని డైటీషియన్ డాక్టర్ నిధి పాండే తెలిపిన వివరాల ప్రకారం, అధిక బరువు, పోషకాహార లోపం ఉండటం ప్రమాదకరం. పోషకాహార లోపానికి చాలా కారణాలు ఉండగా.. పేదరికం వాటిలో ఒకటి కావచ్చు. అధిక బరువు ఉండటానికి ఒకే ఒక కారణం.. ఆహారం పట్ల అజాగ్రత్తగా ఉండటమే అని గుర్తించాలి.

వ్యాధులకు కారణం పోషకాహార లోపం

పోషకాహార లోపానికి ఖచ్చితంగా పేదరికమే పెద్ద కారణం. అయితే ఇదే చివరి కారణం కాదని ముంబైకి చెందిన పోషకాహార నిపుణులు దేవేష్ భార్గవ అంటున్నారు. నిరక్షరాస్యత కారణంగా ప్రజల్లో పోషకాహారం గురించి పెద్దగా అవగాహన లేదు. అటువంటి వ్యక్తుల కోసం ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకుంటుందో.. వాటి ప్రయోజనాన్ని ఎలా పొందాలో వారికి తెలియదంట. ఆహార భద్రతలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ప్రాథమిక ఆహార పదార్థాలను అందిస్తున్నాయి. కమ్యూనిటీ సెంటర్లలో పోషకాలు, మందులు, ఇంజెక్షన్లు ఉచిత ఇచ్చేటువంటి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. అలాగే, అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడానికి ఉచిత ఏర్పాట్లు కూడా చేశారు. ఎక్కడైనా, ఎవరైనా... బరువు, రక్త పరీక్షలు ఉచితంగా చేసుకోవచ్చు. 

పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల్లో ముఖ్యంగా టీబీ, రక్తహీనతతోపాటు సుఖవ్యాధులు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. అదేవిధంగా వీరిలో మానసికంగా బలహీనత, తొందరగా అలసిపోవడం, చర్మం పాలిపోవడం వంటివి కూడా ఎదురవుతాయి. ఇలాంటి వారికి నిత్యం మాంసపోషకాలు అందించాల్సి ఉంటుంది. పోషకాహార లోపం సమస్యను అధిగమించేందుకు నిత్యం ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి. మద్యపానం, ధూమపానం చేసే అలవాటును మానుకోవాలి. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను మాత్రమే తీసుకోవాలి. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను తరుచుగా సందర్శిస్తూ వారి సలహాలు తీసుకుంటూ ఉండాలి. అధిక బరువు, ఊబకాయానికి చెక్‌ పెట్టేందుకు ఆహారం, పానీయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆహారం తీసుకుంటున్నా తగిన శారీరక శ్రమ లేనప్పటికీ ఊబకాయం పెరిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏపీలో ఊబకాయులు ఎక్కువేనంట..!

ఛత్తీస్‌గఢ్‌లో 32.2 శాతం మంది పోషకాహార లోపానికి గురవగా.. ఒడిశాలో 29.9 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 28.9 శాతం, ఝార్కండ్‌లో 27.4 శాతం, మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో 26.7 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇకపోతే, ఢిల్లీలో అత్యధికంగా 52.7 శాతం మంది ఊబకాయంతో బాధపడుతుండగా.. పంజాబ్‌లో 49.4 శాతం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 43.2 శాతం, హిమాచల్‌ప్రదేశ్‌లో 42.2 శాతం, కేరళలో 42.1 శాతం మంది ఊబకాయులు ఉన్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది.

ఊబకాయంతో బాధపడేవారిలో ముఖ్యంగా అధిక రక్తపోటు, డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌, గుండె సంబంధ సమస్యలతోపాటు ఆర్థరైటీస్ సమస్యలు వస్తుంటాయి. ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు ప్లేటు నిండా ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి. జంక్‌ ఫుడ్స్‌ను పూర్తిగా పక్కనపెట్టాలి. 8 గంటలు తక్కువ కాకుండా నిద్రపోవాలి. వారంలో కనీసం 5 రోజులు అర్ధగంటకు తక్కువ కాకుండా వ్యాయామం చేయాలి. స్వీట్స్‌ తినడం పూర్తిగా మానేయాలి. 

ఇవి కూడా చదవండి..

చరిత్రలో ఈరోజు.. అమెరికా పౌరుల బందీ.. 1 ఏడాది 2 నెలల 2 వారాల 2 రోజులు..

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo