గురువారం 25 ఫిబ్రవరి 2021
Health - Jan 26, 2021 , 01:01:01

నలభై ఏండ్లు దాటితే.. ఎండోస్కోపీ, కొలనోస్కోపీ చేయించుకోవాలా?

నలభై ఏండ్లు దాటితే.. ఎండోస్కోపీ, కొలనోస్కోపీ చేయించుకోవాలా?

ప్ర : ఎగువ జీర్ణాశయాంతర ఎండోస్కోపీ (అప్పర్‌ జీఐ ఎండోస్కోపీ) అంటే ఏంటి?

జ : అన్నవాహిక (ఈసోఫేగస్‌), జీర్ణాశయం (స్టమక్‌), చిన్నపేగు మొదటి భాగం (డుయోడినమ్‌)లలో ఉండే శ్లేష్మపొర (మ్యూకోసా)ను కెమెరా ద్వారా పరిశీలించడాన్నే అప్పర్‌ జిఐ ఎండోస్కోపీ అంటారు. 

ప్ర: అప్పర్‌ జీఐ ఎండోస్కోపీ ఎవరికి అవసరం?

జ : కడుపు పైభాగంలో నొప్పి, కడుపులో మంట, కడుపులో తిప్పడం, వాంతులు, రక్తహీనత, విరేచనం నల్లగా రావడం, రక్తపు వాంతులు, అకారణంగా బరువు తగ్గడం లేదా పెరగడం వంటి సమస్యలు ఉన్నవాళ్లకు ఈ ఎండోస్కోపీ అవసరమవుతుంది. 

ప్ర: కొలనోస్కోపీ అంటే ఏంటి?

జ: పెద్దపేగు లోపలి భాగాన్ని, అంటే దాని లోపలున్న శ్లేష్మపొర (మ్యూకోసా)ను కెమెరా ద్వారా పరిశీలిస్తే కొలనోస్కోపీ అంటారు. 

ప్ర: కొలనోస్కోపీ ఎవరికి అవసరం?

జ: రక్త విరేచనాలు, మలబద్ధకం, ఎక్కువ కాలం పాటు విరేచనాలు కావడం, విరేచనం తీరు మారడం, ఎప్పుడూ విరేచనం వస్తున్నట్టే అనిపించడం, మలవిసర్జనకు వెళ్లి వచ్చిన తరువాత కూడా పూర్తిగా విరేచనం అయినట్టు అనిపించకపోవడం, అకారణంగా బరువు తగ్గడం లాంటి సమస్యలు ఉన్నవాళ్లకు కొలనోస్కోపీ అవసరమవుతుంది. 

ప్ర: ఎండోస్కోపీ లేదా కొలనోస్కోపీ తప్పనిసరా?

జ: ఇబ్బంది తీవ్రత, సమస్య ఎంతకాలంగా ఉంది, ఇతర దీర్ఘకాల సమస్యలేమైనా ఉన్నాయా, కుటుంబ సభ్యులెవరికైనా జీర్ణాశయ క్యాన్సర్లున్నాయా, సిగరెట్‌, మద్యం, పొగాకు నమలడం లాంటి అలవాట్లు ఉన్నాయా.. అనే అంశాలను బట్టి పరీక్ష అవసరమా లేదా అనేది నిర్ణయిస్తారు. 

ప్ర: 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ చేయించుకోవాలా?

జ: నలభయ్యేండ్లు దాటిన తరువాత ఆరోగ్య పరీక్షలలో భాగంగా రక్తపరీక్షలు, గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకున్నట్టుగానే ఎండోస్కోపీ, కొలనోస్కోపీలు కూడా జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి చేయించుకోవాల్సినవి. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా జీర్ణాశయ క్యాన్సర్‌ ఉన్నట్టయితే ఇవి తప్పనిసరిగా చేయించుకోవాలి. 40 సంవత్సరాల వయసు తరువాత లేదా క్యాన్సర్‌ వచ్చిన వారి కంటే పది సంవత్సరాల ముందు వయసులో.. ఏది ముందైతే ఆ వయసులో, ఈ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. అదేవిధంగా సిగరెట్‌ అలవాటు ఉన్నవాళ్లు కూడా ఎండోస్కోపీ చేయించుకోవాలి. 

ప్ర: ఈ పరీక్షల వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా?

జ: వీటివల్ల ఇబ్బందులు రావడం చాలా అరుదు. వెయ్యి మందిలో ఎవరో ఒకరికి ఇబ్బంది కలుగవచ్చు. పరీక్ష జరిగే సమయంలో కడుపు ఉబ్బినట్టుగా అనిపించడం సాధారణం. పరీక్ష అయిపోయాక అది తగ్గిపోతుంది. 

ప్ర: ఈ పరీక్షలు ఎప్పుడైనా చేయించుకోవచ్చా? ఏదైనా ముందుగా సిద్ధం కావాల్సి ఉంటుందా?

జ: ఎగువ జీర్ణాశయ ఎండోస్కోపీ కోసం కనీసం 6 గంటల ముందు నుంచి ఏమీ తినకూడదు. కొలనోస్కోపీకి పెద్దపేగు ఖాళీ కావడం కోసం ముందుగా ప్రిపరేటరీ ఔషధం తీసుకోవాల్సి ఉంటుంది. 

ప్ర: పరీక్షలు చేయించుకునే ముందు డాక్టర్‌ని కలవాలా?

జ: డాక్టర్‌కి చూపించుకున్న తరువాత పరీక్ష చేయించుకోవడం మేలు. ఎందుకంటే ఏ ఇబ్బంది ఉందని డాక్టర్‌ అనుకుంటున్నారో, దానికి అనుగుణంగా పరీక్ష చేయవచ్చు.

డాక్టర్‌ స్ఫూర్తి కొల్ల

రెనోవా నీలిమ హాస్పిటల్స్‌, సనత్‌నగర్‌, హైదరాబాద్‌

MD (Gen Med) DM (MED GASTRO)

Consultant Gastroenterologist, Hepatologist 

& Therapeutic Endoscopist

Cell: 91210 12265,

TOLL FREE: 18005998989

VIDEOS

logo