మంగళవారం 09 మార్చి 2021
Health - Dec 01, 2020 , 00:44:29

వాసన తెలియకపోతే..

వాసన తెలియకపోతే..

వాసన లేని పువ్వును.. పూజకు పనికిరాదని పడేస్తాం! వాసనరాని వంటను.. ఎండుగడ్డి కింద జమకడతాం! ఆమాటకొస్తే, గుత్తొంకాయ రుచికన్నా గుప్పుమనే వాసనే మహాద్భుతం! రోజాల పరిమళానికి.. రుష్యశృంగుడైనా రొమాంటిక్‌గా మారాల్సిందే. మనిషికి వాసన ఓ వరం, అవసరం కూడా. తేడా వస్తే మాత్రం.. కలవరమే! 

వాసన తెలియకపోవడం ఏమంత పెద్ద జబ్బు కాదు. కానీ, రాబోయే రోగాలకు ఒక సూచన. ‘భద్రం బిడ్డా..’ అన్న హెచ్చరిక. పెద్ద ప్రమాదాన్ని తప్పించే చిన్న చికాకు. అలా అని అలక్ష్యం చేయడానికి వీల్లేదు. పూర్తిగా ఘ్రాణశక్తిని కోల్పోవడాన్ని వైద్య పరిభాషలో ‘అనాస్మియా’ అంటారు. అదే, పాక్షికంగా వాసన కోల్పోతే ‘హైపాస్మియా’గా వ్యవహరిస్తారు. పదివేల మందిలో ఒకరు ఇలాంటి సమస్యతో పుడతారు. ‘కాల్మన్‌ సిండ్రోమ్‌' అనే జన్యు సంబంధ వ్యాధికి..  వాసన తెలియకపోవడం అనేది ఒక ప్రాథమిక లక్షణం. ఒకే కిడ్నీతో పుట్టడం, వర్ణ అంధత్వం, వినికిడి లోపం, నేత్ర సంబంధ సమస్యలు.. ఇతర లక్షణాలు! దీనికి చికిత్స ఉండదు. దీని నుంచి కోలుకోవడం కూడా ఉండదు. కొంతమందికి మధ్యలోనూ రావచ్చు. ఆ వచ్చింది మధ్యలోనే పోవచ్చు. శాశ్వతంగానూ ఉండిపోవచ్చు. ఇక తాత్కాలికంగా వాసన కోల్పవడం అన్నది జలుబు, అలర్జీ, సైనసైటిస్‌, ముక్కులో దుర్మాంసం (పాలిప్స్‌) పెరగడం, ముక్కు ఎముక వంకరగా ఉండటం.. తదితర సందర్భాల్లో జరుగుతుంది. సరైన చికిత్స అందిస్తే, తిరిగి వాసన తెలుస్తుంది. ఏది మల్లెల వాసనో, ఏది మిర్చీ బజ్జీల వాసనో అర్థమైపోతుంది. బతుకు గాడిన పడిపోతుంది. వాసన తెలియని ముక్కు, బుల్లెట్‌ లేని తుపాకీతో సమానం! 

ఎందుకు తెలియదు?

ముక్కు వాసనను కోల్పోవడానికి రకరకాల కారణాలు. వైరస్‌ల వల్ల వచ్చే జలుబు, అలర్జీల కారణంగా ముక్కు రంధ్రాల్లో కఫం నిండిపోతుంది. సూక్ష్మ క్రిములు ముక్కు రంధ్రాల్లోకి చేరగానే శ్లేష్మం విడుదల అవుతుంది. దాంతో, వాసనకు సంబంధించిన సంకేతాలు.. ముక్కు నుంచి మెదడుకు తీసుకెళ్లే నరాలకు చేరవు. అలా వాసన తెలియకపోవడమనే ఇబ్బంది మొదలవుతుంది. గుప్పుమనే గుత్తొంకాయ కూర వాసన అయినా, ఘాటైన ఎండుచేపల తాలింపు అయినా మనదాకా రాదు. మనిషి భోజనాన్ని ఆస్వాదించడంలో  ముక్కు, నోరు, కండ్లు.. ఒక్కొక్కటి ఒక్కోలా సహకరిస్తాయి. ఎంత కమ్మని వంటలు అయినా, వాసన తెలియకపోతే చప్పచప్పగానే అనిపిస్తాయి. ఓరకంగా భాష తెలియని సినిమా చూసినట్టే ఉంటుంది.  


వాసన తెలియకపోతే..

పుట్టుకతోనే ఉన్నా, మధ్యలో వచ్చినా.. సమస్య సమస్యే. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.  ఇంట్లోవాళ్లు కూడా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే అనర్థాలు తప్పవు.

 • ఇంట్లో ఏదైనా వస్తువు కాలిపోతున్నా వాసన రాదు. దీంతో ప్రమాదం పెద్దదై ప్రాణనష్టం జరగవచ్చు. 
 • ఫ్రిజ్‌ లేదా బయటి వాతావరణంలో నిల్వచేసిన ఆహారాన్ని తీసుకోవద్దు. వాసన తెలియదు కాబట్టి, పాడైన పదార్థాలు అయినా గబగబా తినేస్తారు. దీంతో ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే, వాసన తెలియనివాళ్లు ఎప్పుడూ తాజా ఆహారమే తీసుకోవాలి.
 • అనాస్మియా ఉన్నవాళ్లకు ఎంత ఘాటు వాసనలు అయినా ముక్కుకు ఎక్కవు. అందువల్ల ఇంట్లో ఉండే యాంటీసెప్టిక్‌ లిక్విడ్స్‌, యాసిడ్స్‌, పెస్టిసైడ్స్‌ వంటివాటిని ఏదైనా ఓ  మూలన భద్రపరచాలి. వాటిని కూడా లేబుల్‌ (పేరుగల స్టిక్కర్‌) ఉంటేనే కొనాలి. లేదంటే, వాసన రాకపోవడం వల్ల ... ఇంకేవో పదార్థాలు అనుకునే ప్రమాదం ఉంది. చక్కెర పొడి అనో, దగ్గు మందు అనో భ్రమపడిపోయి ప్రాణాల మీదికి తెచ్చుకున్నవారూ ఉన్నారు.  
 • ఇంట్లో ఎల్‌పీజీ లీక్‌ అయినా వాసన తెలియదు. అందువల్ల గ్యాస్‌ లీకేజ్‌ అలారం పెట్టుకుంటే మంచిది. ఇంట్లోవాళ్లు కూడా గ్యాస్‌ ఆఫ్‌ చేశామా లేదా అని ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి.

కరోనా సమయంలో..


కరోనా వైరస్‌ సోకుతున్న వాళ్లలో చాలామంది.. తాత్కాలికంగా ఘ్రాణశక్తిని కోల్పోతున్నారు. కొందరికి మూడు రోజుల్లో, ఇంకొందరికి వారం పదిహేను రోజుల్లో మళ్లీ వాసన తెలుస్తుంది. అరుదుగా నెలా, రెండు నెలలూ పడుతుంది. చెడులోనూ మంచి అంటే ఇదే కావచ్చు.. కొవిడ్‌ లక్షణాల్లో భాగంగా వాసన, రుచి కోల్పోయిన రోగుల్లో ఎక్కువమంది వైరస్‌ బారి నుంచి త్వరగా కోలుకుంటున్నారు. కొవిడ్‌ సోకినా వాసనను కోల్పోని రోగుల విషయంలో మాత్రం.. పరిస్థితి తీవ్రంగానే ఉంటున్నది. దగ్గు, జ్వరం, నీరసం లాంటి.. ఇతర లక్షణాలు లేకున్నా కొంతమంది వాసనను కోల్పోవడాన్ని చూస్తుంటాం. అంతే, అది కొవిడ్‌ లక్షణమే అని అర్థమైపోతుంది. వెంటనే ఐసొలేట్‌ అయిపోయి, చికిత్స తీసుకుంటారు. ఇలా, వాసన కోల్పోవడం అనేది కొన్నిసార్లు మంచే చేస్తుంది. 

వాసనకు, రుచికి సంబంధం ఏంటి?


వాసనకు సంబంధించిన సంకేతాలు, రుచికి సంబంధించిన సంకేతాలు.. రెంటినీ మెదడుకు తీసుకెళ్లే నరాలు వేర్వేరుగా ఉంటాయి. కానీ ఈ రెండూ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి.  వాసన లేకపోతే రుచిని వందశాతం ఆస్వాదించలేం. ఘుమఘుమలు తెలియకపోతే, తినే పదార్థాలపై ఆసక్తి చచ్చిపోతుంది. ఫలితంగా, పోషకాహార లోపం ఎదురవుతుంది. బరువు కూడా తగ్గిపోతారు. దుర్బలమైన ఆ శరీరంలో రోగనిరోధకశక్తి ఉండదు. ఇతర వ్యాధులు సోకే ప్రమాదమూ ఉంటుంది. 

ఆ శక్తి తిరిగి రావాలంటే..


 • విటమిన్‌-సి నరాల రికవరీకి ఉపయోగపడతుంది. జలుబు, అలర్జీలతో వాసన కోల్పోయినప్పుడు నిమ్మకాయలు ఎక్కువగా తీసుకోవాలి.
 • కాచి చల్లార్చిన నీళ్లలో ఉప్పు వేసి, ఆ మిశ్రమంతో ముక్కును శుభ్రం చేసుకోవాలి. అయితే ఆ సమయంలో కచ్చితంగా తలను కిందికి వంచాలి.
 • వాసన కొద్దికొద్దిగా వస్తున్నైట్లెతే, గాఢంగా ఉన్న వాసనలు గట్టిగా పీల్చాలి. దాంతో ముక్కుకు వాసనను కనిపెట్టే శక్తి తిరిగి వస్తుంది.  

ఇవీ కారణాలు


 • వృద్ధాప్యంలో నాడుల పనితనం తగ్గిపోవడం.
 • తలకు తీవ్రంగా గాయాలైనప్పుడు నరాలు దెబ్బతినడం.
 • బ్రెయిన్‌ ట్యూమర్స్‌.
 • మధుమేహ వ్యాధితో నరాలు బలహీనపడటం.
 • మద్యపానం, ధూమపానం.
 • థైరాయిడ్‌ హార్మోన్‌ అసమతుల్యత.
 • అల్జీమర్స్‌ సిండ్రోమ్‌.
 • హార్మోన్ల విడుదలలో హెచ్చుతగ్గులు.
 • అధిక రక్తపోటుకు తీసుకునే మందులు.
 • ఫిట్స్‌ వచ్చినప్పుడు నరాలు దెబ్బతినడం.
 • విటమిన్ల లోపం.

డాక్టర్‌ రవిశంకర్‌ ప్రజాపతి

చెవి, ముక్కు, గొంతు 

వ్యాధుల నిపుణులు,

ప్రభుత్వ ఇ.ఎన్‌.టి వైద్యశాల, కోఠి, హైదరాబాద్‌

VIDEOS

logo