శనివారం 28 నవంబర్ 2020
Health - Nov 17, 2020 , 03:13:59

యాంటి బయాట్రిక్స్‌ ..వికటిస్తున్నాయి!

యాంటి బయాట్రిక్స్‌ ..వికటిస్తున్నాయి!

రెండ్రోజులుగా జలుబు వేధిస్తుంటే, మెడికల్‌ షాప్‌కి వెళ్లి టాబ్లెట్‌ తెచ్చుకుంటాం. ఏ చల్లగాలికో దగ్గు 

మొదలైతే, టానిక్‌ కోసం మళ్లీ మెడికల్‌షాపుకే వెళ్తాం. అంతేనా, ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందని డాక్టర్‌ ఓ పదిరోజులకు మందులు రాసిస్తాడు. కానీ, మనం మాత్రం నాలుగు రోజుల్లో తగ్గిపోయిందని ఔషధాలు ఆపేస్తాం. అదే ఇన్‌ఫెక్షన్‌ మళ్లీ వస్తుంది. ఈసారి మాత్రం, ఎన్ని రోజులు వాడినా తగ్గదు. ఎన్ని మందులు మార్చినా ఫలితం ఉండదు. క్షయ, న్యుమోనియా లాంటి ఇన్‌ఫెక్షన్లు ఇప్పుడిలాగే అవుతున్నాయి. మందులకు లొంగని రోగాలై కూర్చుంటున్నాయి. అందుకే, ‘యాంటి బయాటిక్స్‌.. హ్యాండిల్‌ విత్‌ కేర్‌!’ అని పిలుపునిస్తున్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ. 

ఈ నెల 18 నుంచి 21 వరకు ‘వరల్డ్‌ యాంటి బయాటిక్‌ అవేర్‌నెస్‌ వీక్‌'

ప్రపంచ ఆరోగ్య వ్యవస్థకు అతిపెద్ద సవాలుగా నిలిచిన సమస్య.. యాంటి బయాటిక్‌ రెసిస్టెన్స్‌. దీనికి కుల, మత, లింగ, వయో భేదాలేమీ లేవు. ఎవరినైనా కబళించవచ్చు. ఇన్నాళ్లూ యాంటిబయాటిక్‌ మందుల బోనులో బందీగా ఉన్న బ్యాక్టీరియా జూలు విదిల్చి..  సవాలు విసిరేంత శక్తిని సంతరించుకుంటున్నది. 

  ఎందుకిలా..?

 •   విచక్షణ లేకుండా యాంటి బయాటిక్స్‌ను వాడటం.
 •   చికిత్స కోర్సు పూర్తయ్యేవరకూ పేషెంట్లు మందుల వాడకాన్ని కొనసాగించక పోవడం. డాక్టర్‌ సిఫార్సుతో సంబంధం లేకుండా మధ్యలోనే యాంటిబయాటిక్స్‌ వాడకాన్ని ఆపేయడం.
 •   హాస్పిటల్స్‌, క్లినిక్‌లలో ఇన్‌ఫెక్షన్ల నియంత్రణ సరిగా లేకపోవడం.
 •    పరిసరాల్లో పరిశుభ్రత కొరవడటం.
 •   మనం ఆహారంగా తీసుకునే జంతువులు, చేపల పెంపకంలో కూడా యాంటి బయాటిక్స్‌ని అతిగా వాడటం.
 •   కొత్త యాంటి బయాటిక్స్‌ అభివృద్ధి పూర్తిగా మందగించడం.

నియంత్రణ ఎలా?

యాంటి బయాటిక్స్‌ను విచక్షణ లేకుండా వాడటం వల్లనే యాంటిబయాటిక్‌ రెసిస్టెన్స్‌ సమస్య తీవ్రతరం అవుతున్నది. కాబట్టి, వివిధ దశల్లో దీని నియంత్రణ అవసరం. 

 •  గుర్తింపు పొందిన ఆరోగ్య నిపుణులు సూచించిన యాంటి బయాటిక్స్‌ను మాత్రమే వాడాలి. 
 •   డాక్టర్‌ అవసరం లేదని చెప్పిన తరువాత కూడా, యాంటి బయాటిక్స్‌ ఇవ్వమని ఒత్తిడి చేయకూడదు. 
 •   మిగిలిపోయిన యాంటి బయాటిక్స్‌ని ఉపయోగించకూడదు. ఫలానా వాళ్లు వాడితే తగ్గింది కదా అని, అదే యాంటి బయాటిక్‌ను సొంతంగా వాడకూడదు. జబ్బు ఒకటే అయినా, ఒకరికి ఇచ్చిన మందులు మరొకరు తీసుకోకూడదు. 
 •   చేతులు శుభ్రంగా ఉంచుకోవడం అన్నది తప్పనిసరి అలవాటుగా చేసుకోవాలి. వంట చేసేటప్పుడు, వడ్డించేటప్పుడు శుభ్రత పాటించాలి. ఆహారాన్ని పరిశుభ్ర వాతావరణంలో నిల్వ ఉంచాలి. 
 • ఇన్‌ఫెక్షన్లు ఉన్నవాళ్లకు దూరంగా ఉండాలి.    పిల్లలకు వ్యాధి       నిరోధక టీకాలు తప్పక వేయించాలి. 

పొంచివున్న విపత్తు

1928లో అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ పెన్సిలిన్‌ను కనుగొన్న తరువాత క్రమంగా యాంటి బయాటిక్స్‌ అభివృద్ధి పెరిగింది. రకరకాల బ్యాక్టీరియాలను మట్టుబెట్టడం సులువైంది. ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కోవడం అతిసాధారణం అయిపోయింది. కానీ మన అలవాట్ల వల్ల, నిర్లక్ష్యం వల్ల యాంటి

బయాటిక్స్‌ను తట్టుకునే శక్తిని కొన్నిరకాల బ్యాక్టీరియాలు సొంతం చేసుకున్నాయి. మందులకు లొంగకుండా, ఏకంగా తమ నిర్మాణాన్నే మార్చుకుంటున్నాయి. దాంతో ప్రపంచ వ్యాప్తంగా యాంటి బయాటిక్‌ రెసిస్టెన్స్‌ ప్రమాద ఘంటికలను మోగిస్తున్నది. న్యుమోనియా, ట్యూబర్‌ క్యులోసిస్‌, రక్తంలో ఇన్‌ఫెక్షన్లు, గొనోరియా లాంటి వ్యాధుల విషయంలో చికిత్స అనేది పెను సవాలుగా మారింది. శక్తిమంతమైన యాంటి బయాటిక్‌ మందులు కూడా పనిచేయడం మానేస్తున్నాయి. చాలారకాల యాంటి బయాటిక్స్‌ ప్రమాదకర బ్యాక్టీరియాను నిలువరించలేని స్థితిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతి సాధారణ ఇన్‌ఫెక్షన్లు సైతం ప్రాణాంతకంగా మారుతున్నాయి. మొదటి దశ యాంటి బయాటిక్స్‌ చికిత్స వల్ల ఫలితం లేనప్పుడు, మరింత ఖర్చుతో కూడిన సమర్థమంతమైన యాంటి బయాటిక్స్‌ వాడాల్సి ఉంటుంది. యాంటి 

బయాటిక్స్‌ పనిచేయకపోవడం వల్ల ఎన్నో విపరిణామాలు. చికిత్స కాలం పెరుగుతుంది. రోగికి అనారోగ్య బాధ మరింత అధికం అవుతుంది. హాస్పిటల్స్‌లో ఉండాల్సిన వ్యవధి ఇంకొంత పెరుగుతుంది. వైద్య ఖర్చులూ అధికం అవుతాయి. ఫలితంగా కుటుంబాలపై భారం పెరుగుతుంది. అవయవమార్పిడి, కీమోథెరపీ, శస్త్రచికిత్సల సమయంలో తగిన యాంటిబయాటిక్స్‌ అందుబాటులో లేకపోవడం ప్రాణాంతకం కావచ్చు. సాధారణ సిజేరియన్‌ కూడా ఇన్‌ఫెక్షన్‌ కారణంగా.. చికిత్సకు లొంగని మొండి సమస్యగా పరిణమించవచ్చు. 

ప్రభుత్వాల బాధ్యత

 •  యాంటి బయాటిక్‌ రెసిస్టెంట్‌ ఇన్‌ఫెక్షన్ల నివారణకు ప్రాధాన్యం ఇవ్వాలి. 
 •  ఇన్‌ఫెక్షన్‌ వచ్చినవారికి తక్షణం సరైన 
 • చికిత్స అందించడానికి చర్యలు తీసుకోవాలి. 
 •   ఇన్‌ఫెక్షన్ల నివారణకు, నియంత్రణకు తగిన పథకాలు అమలుపరచాలి. 
 •  వైద్యశాలల్లో నాణ్యమైన మందులనే వాడేలా చర్యలు తీసుకోవాలి. 
 •   యాంటి బయాటిక్‌ రెసిస్టెన్స్‌ గురించి అవగాహన పెంచేందుకు విస్తృతంగా కార్యక్రమాలు రూపొందించాలి.
 •  దీన్ని పాఠ్యాంశంలో భాగం చేయాలి. 

నాకు మూడేండ్ల వయసు ఉన్నప్పుడు క్షయ వ్యాధి సోకింది. ఓ ఏడాదిపాటు హాస్పిటల్‌లోనే ఉన్నాను. చనిపోతాననే అనుకున్నారు. మూడు రకాల యాంటి బయాటిక్స్‌తో కూడిన చికిత్స అందుబాటులోకి రాకపోతే చచ్చేవాడినే. ఈ యాంటి బయాటిక్స్‌ను మొదటగా తీసుకున్న యూరోపియన్లలో నేనొకడిని. ఎన్ని రకాల యాంటి బయాటిక్స్‌ ఉన్నా.. అదే క్షయ మళ్లీ ఇప్పుడు మృత్యుశంఖం పూరిస్తున్నది. అంటే మనం వెనక్కి వెళ్తున్నామా..! యాంటి బయాటిక్స్‌కి నిరోధకత పెంచుకున్న బాక్టీరియా విషయంలో ఇప్పుడైనా మేల్కొనకపోతే మన ఆరోగ్యానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అంతా కలిసి, యాంటి బయాటిక్స్‌ దుర్వినియోగాన్ని అరికడదాం. 

- మార్క్‌ స్ప్రెంగర్‌,  డైరెక్టర్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ 

యాంటిమైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ విభాగం యాంటి భయాటిక్స్‌!

యాంటి బయాటిక్స్‌ అనేవి.. బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయే కానీ, వైరస్‌ల వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లను కాదు. ఈ విషయం తెలియక చాలామంది వైరస్‌లతో వచ్చే జలుబు, ఫ్లూ, ముక్కు కారడం వంటి సమస్యలకు కూడా యాంటి బయాటిక్స్‌ను వాడుతుంటారు. వీటివల్ల అనేక దుష్ఫరిణామాలు. అవి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. సాధారణంగా అధికశాతం రోగులలో కనిపించే సైడ్‌ ఎఫెక్ట్స్‌.. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, జ్వరం. మలంలో చీము, రక్తం పడటం కూడా కొంతమందిలో కనిపిస్తుంది. యాంటి బయాటిక్స్‌లోని టెట్రాసైక్లిన్‌, డాక్సీసైక్లిన్‌ అనే పదార్థాల వల్ల..  ఎనిమిదేండ్ల లోపు పిల్లల పళ్లపై శాశ్వతమైన మచ్చలు ఏర్పడే ఆస్కారం ఉంటుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు యాంటి బయాటిక్స్‌ వాడినా కూడా.. పిల్లల పాలపళ్లపై మచ్చలు వచ్చే ప్రమాదం ఉంది. టెట్రాసైక్లిన్‌ వంటి యాంటి బయాటిక్స్‌ వాడుతున్నప్పుడు కొంతమంది కాంతిని కూడా తట్టుకోలేరు. చిన్నపాటి ఎండకే చర్మంపై మచ్చల లాంటివి  ఏర్పడవచ్చు. అయితే ఈ ‘ఫొటోసెన్సిటివిటీ ఎఫెక్ట్‌' యాంటి బయాటిక్స్‌ మానేయగానే తగ్గిపోతుంది. దీనికి ప్రత్యేకించి, చికిత్స అంటూ లేదు కాబట్టి, ఆ సమయంలో ఎండలో తిరగకపోవడం మంచిది. ట్యాబ్లెట్స్‌ వాడుతూ కూడా బయటికి వెళ్లాల్సి వస్తే సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవాలి. తలకు టోపీ, కండ్లకు సన్‌గ్లాసెస్‌ ఉపయోగించాలి. యాంటి బయాటిక్స్‌  మహిళల్లో వెజినల్‌ ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్‌కి దారి తీయవచ్చు. కారణం వెజినా దగ్గరుండే మంచి బ్యాక్టీరియాను యాంటి బయాటిక్స్‌ దూరం చేస్తాయి. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. అతికొద్ది మందిలో యాంటి బయాటిక్స్‌ వల్ల స్టీవెన్స్‌-జాన్సన్‌ సిండ్రోమ్‌ అనే సమస్యా వస్తుంది. దీనివల్ల జ్వరం, గొంతునొప్పి, చర్మంపై పొట్టు పోవడం వంటి దుష్ఫలితాలు కనిపిస్తాయి. కాబట్టి, యాంటి బయాటిక్స్‌ని డాక్టర్‌ పర్యవేక్షణలోనే వాడాలి.\


- డాక్టర్‌ తుషార్‌ 

సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌, యశోద హాస్పిటల్స్‌, సికింద్రాబాద్‌